న్యూఢిల్లీ:ఇటీవల కాలంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో విరాట్ కోహ్లిని పోల్చడం ఎక్కువైతే, అదే సమయంలో కోహ్లితో వేరే క్రికెటర్లని పోల్చడం కూడా సాధారణంగా మారిపోయింది. ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్లలో విరాట్ ఒకడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇలా విరాట్ కోహ్లితో పోల్చే ఆటగాళ్లలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ డీకాక్‌తో పాటు పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజమ్ కూడా ఉన్నాడు. కాగా, తన అభిమాన క్రికెటర్ల గురించి మరోసారి పెదవి విప్పిన బాబర్.. తాను ఫాలో అయ్యే క్రికెటర్లలో కోహ్లికే తొలిస్థానం ఇచ్చాడు
'ప్రస్తుతం నేను విరాట్ బ్యాటింగ్‌ను ఫాలో అవుతున్నా. గతంలో ఏబీ డివిలియర్స్‌ను ఎక్కువగా అనుసరించే వాణ్ని. ఎంతలా అంటే అతను ఆడే షాట్లను ప్రత్యేకంగా సాధన చేసేవాడిని. ఒక్కమాటలో చెప్పాలంటే ఏబీని కాపీ కొట్టేవాడిని. ప్రధానంగా నెట్స్‌లో కనీసం కొన్ని షాట్లైనా ఏబీ మ్యాచ్‌ల్లో కొట్టిన షాట్లను ప్రాక్టీస్ చేసేవాడిని. కాకపోతే ఇప్పుడు నేను ఫాలో అయ్యే క్రికెటర్లలో కోహ్లి ముందు వరుసలో ఉన్నాడు. కోహ్లి బ్యాటింగ్ శైలిని ఎక్కువగా పరిశీలిస్తూ ఉంటా. కోహ్లి, ఆమ్లా, ఏబీ డివిలియర్స్‌ల బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. దాంతోనే వారిపై విపరీతమైన అభిమానం ఏర్పడింది' అని బాబర్ అజమ్ తెలిపాడు.
తనను కోహ్లితో పోల్చడంపై కూడా అజమ్ స్పందించాడు. కోహ్లితో పోల్చడం గర్వకారణమే అయినా, అతను సాధించిన ఘనతల్ని తాను సాధించలేదనే వాస్తవం గ్రహించాలన్నాడు. ఆ నేపథ్యంలో తనకు కోహ్లితో పోలిక సరికాదన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment