
మీడియాతో అజింక్యా రహానే
సెంచూరియన్ : నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడంతో ఎంతో పరిణితి చెందానని టీమిండియా బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే అభిప్రాయపడ్డాడు. తొలి వన్డేలో రహానే(79) అద్బుత ఇన్నింగ్స్‌తో భారత్ ఆరు వన్డేల సిరీస్‌ను గెలుపుతో ఆరంభించిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా భారత్ మిడిలార్డర్ బలహీనంగా ఉండటంతో నాలుగో స్థానంలో ఎవరిని దింపాలని టీమిండియా కసరత్తులు మెదలు పెట్టింది. దీనికోసం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్‌లను పరీక్షించి మిశ్రమ ఫలితాలను పొందింది. దీంతో నాలుగో స్థానంలో ఎవరిని పంపాలనే విషయం జట్టు మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది.
చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రాణించి విజయంలో తనవంతు పాత్ర పోషించిన రహానేను అనూహ్యంగా తొలి వన్డేలో నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు పంపి మంచి ఫలితాన్ని పొందింది. ఈ తరుణంలో నేడు(ఆదివారం) రెండో వన్డే సందర్భంగా రహానే మీడియాతో మాట్లాడారు.
నాలుగోస్థానంలో బ్యాటింగ్ చేయడానికి సిద్దమయ్యానని, ఈ స్థానంలో బ్యాటింగ్ చేయడం విభిన్నమైనప్పటికి నా ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో బాగా తెలుసని రహానే అభిప్రాయపడ్డాడు. ఈ స్థానంలో బ్యాటింగ్ చేయడం వల్ల ఎంతో పరణతి చెందానని చెప్పుకొచ్చాడు. తొలి వన్డేలో రాణించడంపై స్పందిస్తూ.. చివరి టెస్ట్ విజయం ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చిందని, అదే ఊపుతో విజయం సాధించామన్నాడు. బౌలర్లు అద్భుతంగా రాణించారని, తన బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదించానని ఈ ముంబైకర్ చెప్పుకొచ్చాడు. ఏ జట్టుపైనైనా ఆడటానికి ఆస్వాదిస్తానని, కానీ దక్షిణాఫ్రికాపై అయితే మరింత ఇష్టపడతానన్నాడు. వారిని తక్కువ అంచనా వేయడం లేదని, పేస్ బౌలింగ్‌ను సవాల్‌గా స్వీకరిస్తున్నట్లు రహానే తెలిపాడు. జట్టు మెనేజ్‌మెంట్ ఆదేశాల మేరకు ఏ స్థానంలో ఆడటానికైనా సిద్దమేనని, గెలుపులో ముఖ్య పాత్ర పోషించడమే తన కర్తవ్యమని రహానే వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment