వీడ్కోలు పలికిన సచిన్, ద్రవిడ్
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌కు వన్నె తెచ్చిన ఇద్దరు దిగ్గజాలు ప్రత్యర్థులుగానైతేనేమి... చివరిసారి ఒకే మ్యాచ్‌లో కలిసి బరిలోకి దిగారు. పోటీ క్రికెట్‌లో సంయుక్తంగా దాదాపు 92 వేల పరుగులు చేసిన ఈ ఇద్దరూ తమ అనుభవాలు గుర్తు చేసుకుంటే అవన్నీ మధుర స్మృతులే అవుతాయి. టి20 క్రికెట్‌లో ఆఖరి మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో తన సహచరుడి గురించి సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఒకరిపై మరొకరు ప్రశంసల జల్లు కురిపించారు.
‘వయసులో నాకన్నా రెండు నెలలు చిన్నవాడైనా ఆటలో సచిన్ ఏడేళ్లు సీనియర్. నా మూడో టెస్టుకు అతనే కెప్టెన్. వర్ధమాన క్రికెటర్లు ఎవరైనా అతనిలా కావాలని కోరుకున్నవారే. ప్రతీ ఒక్కరికీ సచినే స్ఫూర్తి. అందరూ అతడిని అనుకరించేందుకు ప్రయత్నించినవారే. తొలి టూర్‌లో సచిన్‌తో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం గొప్ప అవకాశంగా భావించాను’ అని మాస్టర్ గురించి ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. మరో వైపు టెండూల్కర్ కూడా ద్రవిడ్ గొప్పతనాన్ని కీర్తించాడు. ‘అతనిలో అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం ఉంది. నా జట్టులో ఎప్పుడైనా మూడో స్థానం అతనిదే. ఇతర సభ్యులందరూ ఇబ్బంది పడిన చోట ద్రవిడ్ ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడు. సవాళ్లంటే అతనికి ఇష్టం. మేం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ద్రవిడ్ వైపే చూసేవాళ్లం’ అని సచిన్ అభిప్రాయపడ్డాడు.
ప్రైజ్‌మనీ
విజేత ముంబై ఇండియన్స్‌కు 25 లక్షల డాలర్లు
(రూ. 15 కోట్ల 34 లక్షలు)
రన్నరప్ రాజస్థాన్ రాయల్స్‌కు 13 లక్షల డాలర్లు
(రూ. 7 కోట్ల 98 లక్షలు)
సెమీస్‌లో ఓడిన చెన్నై, ట్రినిడాడ్ జట్లకు 5 లక్షల డాలర్లు
(రూ. 3 కోట్లు)
గోల్డెన్ బ్యాట్ (టోర్నీలో అత్యధిక పరుగులు)
అజింక్యా రహానే (288-రాజస్థాన్ రాయల్స్)
గోల్డెన్ వికెట్ (టోర్నీలో అత్యధిక వికెట్లు)
ప్రవీణ్ తాంబే (12-రాజస్థాన్ రాయల్స్)