సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌.. అరుదైన రికార్డు ముంగిట కోహ్లి | Ind Vs SA 1st Test: Kohli On Cusp Of Huge Milestone, Can Break Sehwag's Record - Sakshi
Sakshi News home page

Ind Vs SA: సఫారీలతో టెస్టు సిరీస్‌.. సెహ్వాగ్‌ రికార్డుపై కన్నేసిన కోహ్లి! 70 రన్స్‌ తీస్తే..

Published Tue, Dec 26 2023 11:25 AM | Last Updated on Tue, Dec 26 2023 12:12 PM

Ind Vs SA 1st Test Kohli On Cusp Of Huge Milestone Can Break Sehwag Record - Sakshi

India Vs South Africa 1st Test: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు భారత జట్టు ప్రొటిస్‌ దేశానికి వెళ్లింది.

పరిమిత ఓవర్ల సిరీస్‌లో మరోసారి సత్తా చాటి
ఇందులో భాగంగా సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలో టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసిన టీమిండియా.. కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలో వన్డేలను 2-1 తేడాతో గెలుచుకుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా తదితర కీలక ఆటగాళ్లు లేకుండానే సౌతాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడి ఈ విజయాలు సాధించింది.

అయితే, వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌ ఓటమి తర్వాత విశ్రాంతి తీసుకున్న ఈ ముగ్గురు స్టార్లు టెస్టు సిరీస్‌కు మాత్రం అందుబాటులోకి వచ్చారు. కాగా సఫారీ గడ్డపై ఇంతవరకు టెస్టు సిరీస్‌ గెలిచిన ఘనత ఏ భారత జట్టుకూ లేదు. అయితే, రోహిత్‌ సేన ఆ అపవాదును చెరిపివేయాలని భావిస్తోంది.

ఈ సిరీస్‌లో కోహ్లి 70 పరుగులు చేశాడంటే
ఇందుకోసం ఇప్పటికే బాక్సింగ్‌ డే నాటి తొలి టెస్టుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా విరాట్‌ కోహ్లి అరుదైన ఫీట్‌ నమోదు చేసే అవకాశం ఉంది. కాగా సౌతాఫ్రికాతో టెస్టుల్లో కోహ్లి ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్‌ ఆడి 1236 పరుగులు సాధించాడు.

ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అతడు..  70 రన్స్‌ చేయగలిగితే... సఫారీ జట్టుతో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. తద్వారా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించి దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తాడు. (ఒకవేళ ఈ సిరీస్‌లో పూర్తిగా విఫలమై కేవలం 15 పరుగులకే పరిమితమైతే సెహ్వాగ్‌ తర్వాతి స్థానంలో ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ను కూడా అధిగమించలేడు).

సౌతాఫ్రికాతో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు
1.సచిన్‌ టెండుల్కర్‌- 24 టెస్టుల్లో 1741 రన్స్‌
2.వీరేంద్ర సెహ్వాగ్‌- 15 టెస్టుల్లో 1306 పరుగులు
3.రాహుల్‌ ద్రవిడ్‌- 21 టెస్టుల్లో 1252 పరుగులు
4.విరాట్‌ కోహ్లి- 14 ఇన్నింగ్స్‌లో 1236 పరుగులు
5.వీవీఎస్‌ లక్ష్మణ్‌- 17 మ్యాచ్‌లలో 976 పరుగులు
6. సౌరవ్‌ గంగూలీ- 17 మ్యాచ్‌లలో 947 పరుగులు
7. అజింక్య రహానే- 13 టెస్టుల్లో 884 పరుగులు.

చదవండి: స్టార్‌ బౌలర్లకు షాకిచ్చిన అఫ్గన్‌ బోర్డు.. రెండేళ్ల నిషేధం! ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు ఎదురుదెబ్బ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement