నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదు వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఫలితంగా టెస్టుల్లో మొదటిసారి ఐదు వికెట్లను హార్దిక్ సాధించాడు. హార్దిక్ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ 161 పరుగులకే కుప్పకూలింది. దాంతో 168 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన భారత్.. మూడో టెస్టుపై పట్టు బిగించింది. ఐదు వికెట్ల హాల్ సాధించిన హార్దిక్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
అంతకు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడి నుంచి ఆల్‌రౌండర్ అనే ట్యాగ్ తొలగించాలని పలువురు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్‌గా మారడానికి హార్దిక్ ఎంతో దూరంలో ఉన్నాడు. మరో మంచి ఆల్‌రౌండర్ కోసం భారత్ వెతుక్కోవడం మంచిది’ అని వెస్టిండీస్ మాజీ ఆటగాడు మైకెల్ హోల్డింగ్ చురకలు అంటించాడు. ‘హార్దిక్‌కు ఆల్ రౌండర్ అనే ట్యాగ్‌ను తొలగించాలి’ అని టీమిండియా సీనియర్ క్రికెటర్ భజ్జీ సైతం విమర్శించాడు.
తాజాగా ఈ విమర్శల పట్ల హార్దిక్ ఘాటుగా స్పందించాడు. ‘నేను కపిల్ దేవ్‌ను కాదు, హార్దిక్ పాండ్యానే. హార్దిక్‌గానే ఇప్పటి వరకూ 41 వన్డేలు, 10 టెస్టులు ఆడాను. కపిల్‌గా కాదు’ అని వ్యాఖ్యానించాడు. హోల్డింగ్ లాంటి ఆటగాళ్లు తమ తరంలో తామేంటో నిరూపించుకున్నారు. నన్ను వేరే వాళ్లతో పోల్చడం మానేయండి. నా ప్రదర్శన పట్ల మా జట్టు సంతృప్తిగా ఉంది. నాకు మరేం అవసరం లేదు’ హార్దిక్ తేల్చిచెప్పాడు.
చదవండి: రిషబ్ పంత్ అరుదైన రికార్డులు
Comments
Please login to add a commentAdd a comment