
దుబాయ్: పుల్వామా ఘటన నేపథ్యంలో వచ్చే వరల్డ్ కప్‌లో భారత్–పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ నిర్వహణపై అన్ని వైపుల నుంచి సందేహాలు రేకెత్తుతున్నాయి. రెండు పాయింట్లు కోల్పోయినా సరే... పాక్‌తో మ్యాచ్ ఆడరాదంటూ భారత్‌లో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 16న మాంచెస్టర్‌లో జరగాల్సిన ఈ మ్యాచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పందించింది. ప్రస్తుతానికి వరల్డ్ కప్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ అన్నారు. ‘దారుణమైన ఘటనలో బాధితులైన వారికి మా తరఫున కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ విషయంపై ఐసీసీ సభ్య దేశాలతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నాం.
ఇప్పటి వరకైతే మ్యాచ్‌ల నిర్వహణలో ఎలాంటి మార్పు లేదు. అన్ని మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. అయితే నా దృష్టిలో అన్ని వర్గాల ప్రజలను ఏక తాటిపై తెచ్చే సామర్థ్యం ఒక్క క్రీడలకే ఉంది కాబట్టి దీనిపై మరింతగా చర్చిస్తాం’ అని రిచర్డ్సన్ స్పష్టం చేశారు. మరోవైపు పాక్‌తో మ్యాచ్ ఆడరాదంటూ క్రికెటర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ‘అది హర్భజన్ వ్యక్తిగత అభిప్రాయం. లీగ్ దశలో ఆడం సరే...అదే ఏ సెమీస్‌లోనో, ఫైనల్లోనో ఆడాల్సి వస్తే మ్యాచ్ వదిలేసుకుంటామా? నిజానికి కార్గిల్ యుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో కూడా మనం 1999 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడలేదా’ అని ఆయన గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment