సాక్షి, స్కూల్‌ఎడిషన్: భారతగడ్డపై 2021లో జరిగే చాంపియన్స్‌ట్రోఫీని పొట్టిఫార్మాట్‌లో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) యోచిస్తోంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న వన్డే ఫార్మాట్ కన్నా టీ20 మ్యాచ్‌లుగా టోర్నీని జరిపితే మరింత లాభదాయకంగా ఉంటుందని ఐసీసీ ఆలోచనగా ఉంది. మరోవైపు కేంద్రప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపులు రాకపోతే ఈ టోర్నీని 2021లో భారతగడ్డపై నిర్వహించడం సందేహంగా మారనుంది. ప్రపంచశ్రేణి టోర్నీ అయిన చాంపియన్స్‌ట్రోఫీని భారత్‌లో నిర్వహించడం ద్వారా పలు పన్ను మినహాయింపుల్ని ఐసీసీ కోరుతుంది.
అయితే ఈ విషయంపై కేంద్రంతో బీసీసీఐ చర్చించి సానుకూల నిర్ణయం వచ్చేలా చూడాలని ఐసీసీ కోరుకుంటోంది. ఒకవేళ భారత ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే వచ్చే ఎడిషన్‌ను ఇతర దేశాల్లో నిర్వహించే అంశంపై ఐసీసీ కసరత్తు చేస్తోంది. భారత్‌కు చెందిన టైమ్‌జోన్‌లోనే ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంకలలో చాంపియన్స్‌ట్రోఫీని నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆదాయ పంపిణీపై ఐసీసీపై గుర్రుగా ఉన్న బీసీసీఐకి తాజా పరిణామాలు మరింత ఆజ్యం పొస్తాయనడంలో సందేహంలేదు.
పన్ను మినహాయింపులకు నో..
మరోవైపు భారతగడ్డపై ఐసీసీ నిర్వహించే టోర్నీలకు కేంద్ర ప్రభుత్వం పన్నుమినహాయింపులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 2011 వన్డే ప్రపంచకప్‌నకు పన్ను మినహాయింపు ఇచ్చిన కేంద్రం.. 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌నకు మాత్రం పన్ను మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించింది. ఈక్రమంలో మినహాయింపులపై ఐసీసీ, టోర్నీ ప్రసారదారు స్టార్ నెట్‌వర్క్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం తిరస్కరించింది. దీంతో మీడియా హక్కుల ద్వారా వచ్చిన ఆదాయంలో పదిశాతం టీడీఎస్‌గా కేంద్రానికి స్టార్ నెట్‌వర్క్ చెల్లించింది.
మరోవైపు ఐసీసీకి ఇవ్వాల్సిన మొత్తంలో ఈ మేరకు కోత విధించింది. అనంతరం టోర్నీకి సంబంధించిన రిటర్న్‌లను దాఖలు చేయాలని ఐసీసీకి భారత ఆదాయపన్నుశాఖ తెలిపింది. అయితే ఇప్పటివరకు దీనిపై ఐసీసీ స్పందన లేదని బోర్డు వర్గాలు తెలిపాయి. మరోవైపు గతేడాది భారత్‌లో నిర్వహించిన ఫిపా అండర్–17 ప్రపంచకప్‌నకు పన్ను మినహాయింపులిచ్చి తమకు ఇవ్వకపోవడంపై ఐసీసీ నిరాశ చెందినట్లు తెలుస్తోంది. దీంతో చాంపియన్స్‌ట్రోఫీతోపాటు భవిష్యత్తులో ప్రపంచకప్‌లు భారతగడ్డపై నిర్వహించడ సందిగ్ధంలో పడినట్లయ్యింది.
దాల్మియాకు గుర్తుగా..
మరోవైపు ఈ టోర్నీ ఫార్మాట్‌ను మార్చడం బీసీసీఐకి సుతారమూ ఇష్టం లేదు. దివంగత బోర్డు ఆధ్యక్షుడు జగ్‌మోహన్‌దాల్మియా విజన్‌కు గుర్తుగా రూపొందించిన ఈ టోర్నీలో మార్పులకు బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈక్రమంలో ఐసీసీ ప్రతిపాదనకు మెగ్గు చూపేదీ లేదని బోర్డు వర్గాలు ఈ సందర్భంగా పట్టుదలగా ఉన్నాయి. మరోవైపు బోర్డుకు దాల్మియా చేసిన సేవలకుగాను వచ్చే ఎడిషన్ ఫైనల్‌ను దాల్మియ సొంతగడ్డ కోల్‌కతాలో నిర్వహించాలని బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment