జువాన్ మటా ఇంటర్వూ
మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ ఫార్వర్డ్ ప్లేయర్ జువాన్ మటా ఈ సీజన్‌లో పది గోల్స్ సాధించి అద్భుత ఫామ్‌తో కొనసాగుతున్నాడు. అయితే ఇబ్రహీమోవిక్‌తో కలిసి జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న మటా గాయం కారణంగా ఈ నెలలో జరిగే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో చాలా మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. కానీ ఇప్పటికే తన ఆటతీరుతో జట్టును ఐదో స్థానంలో నిలపగలిగాడు. గత శనివారం వెస్ట్ బ్రోమ్‌తో జరిగిన మ్యాచ్‌ను 0–0తో డ్రాగా ముగించిన అనంతరం బుధవారం ఎవర్టన్‌తో జరిగే మ్యాచ్‌లో యునైటెడ్ సత్తా చూపిస్తుందని మటా చెబుతున్నాడు.
ఈ సీజన్‌లో ఎక్కువగా మ్యాచ్‌లను గెలవలేకపోయిందనే విమర్శలు యునైటెడ్‌పై ఉన్నాయి. ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది?
నిజానికి ఎవరైనా మ్యాచ్‌లను గెలవాలనే కోరుకుంటారు. ఇటీవలి కాలంలో మా ఆటతీరు చాలా మెరుగుపడింది. అందుకే చివరి ఐదు మ్యాచ్‌ల్లో మాకు ఓటమి లేదు. అయితే ఓ జట్టుగా సాధించాల్సింది ఇంకా ఉంది. ట్రోఫీలను గెలుచుకుంటూ చాంపియన్స్ లీగ్‌లో ఆడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే లీగ్ కప్ గెలిచాం. అయితే మరిన్ని మ్యాచ్‌లతో పాటు కప్‌లను గెలవాల్సిన అవసరం ఉంది.
మాంచెస్టర్ యునైటెడ్‌కు ఈ నెల ఎంత కీలకం కాబోతుంది. ముఖ్యంగా మీ గైర్హాజరీలో జట్టు ఎలా ఆడబోతోంది?
ఏప్రిల్ మాకు చాలా ముఖ్యమైంది. తక్కువ సమయంలోనే ఎక్కువ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. అలాగే ప్రీమియర్ లీగ్ సీజన్, యూరోపా లీగ్‌లో కూడా ఇది నిర్ణయాత్మకమైన సమయం. మేం కచ్చితంగా మెరుగ్గా సిద్ధం కావాల్సి ఉంది.
ఈ సీజన్‌లో యునైటెడ్ తరఫున 10 గోల్స్ సాధించడమే కాకుండా వరుసగా మూడో ఏడాది ఈ మార్కును అందుకున్నారు. ఇప్పుడు ఈ గాయానికి ముందు వరకు మీరు సాధించిన దానిపై అభిప్రాయం?
నా ఫామ్‌పై చాలా సంతోషంగా ఉన్నాను. గత రెండు సీజన్లలోనూ పదేసి గోల్స్ చేశాను. గాయం నుంచి కోలుకున్నాక మరిన్ని గోల్స్ సాధిస్తాననే నమ్మకం ఉంది.
యునైటెడ్ జట్టుకు ఈ సీజన్ కాస్త కఠినంగానే సాగినా మీ ఫామ్ మాత్రం అద్భుతంగా సాగడంపై ఎలా అనిపిస్తుంది?
ఇంకా చాలా సాధించాల్సి ఉన్నా సంతోషంగానే ఉన్నాను. నా చుట్టూ అద్భుత ఆటగాళ్లున్నారు. వారు కూడా ఈ సీజన్‌లో మెరుగ్గానే ఆడారు. నేను ఆడిన మ్యాచ్‌లు, చేసిన గోల్స్‌ను బట్టి చూస్తే ఈ సీజన్‌పై సంతృప్తిగానే ఉన్నాను.
నా ఫామ్‌పై సంతృప్తిగా ఉన్నాను
Published Tue, Apr 4 2017 12:23 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
Advertisement
Advertisement