చాంపియన్స్‌ లీగ్‌కు అర్హత సాధించడమే ముఖ్యం | important Champions League Eligibility arsenal team | Sakshi
Sakshi News home page

చాంపియన్స్‌ లీగ్‌కు అర్హత సాధించడమే ముఖ్యం

Published Sun, May 21 2017 12:49 AM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM

important Champions League Eligibility arsenal team

అర్సెనల్‌ తరఫున ఆడుతున్న మేసుట్‌ ఓజిల్‌ ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శనతో రాణిస్తున్నాడు. ఇప్పటికే అతను 12 గోల్స్‌తో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అయితే ఇప్పటిదాకా ఈ జట్టు చాంపియన్స్‌ లీగ్‌కు అర్హత సాధించే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో అర్సెనల్‌ జట్టు తమ చివరి మ్యాచ్‌లో నేడు (ఆదివా రం) ఎవర్టన్‌తో ఆడనుంది. అయితే టాప్‌–4 కోసం అర్సెనల్, లివర్‌పూల్‌ జట్ల మధ్య పోటీ నెలకొంది.

 ఈ రెండు జట్ల మధ్య కేవలం ఒక్క పాయింట్‌ మాత్ర మే తేడా ఉంది. దీంతో అర్సెనల్‌ తమ మ్యాచ్‌ కచ్చితంగా నెగ్గడంతో పాటు... అటు మిడిల్స్‌బ్రోతో తలపడే లివర్‌పూల్‌ ఓడాల్సి ఉంటుంది. ఈనెల 27న ఎఫ్‌ఏ కప్‌ ఫైనల్‌లో తాము చెల్సీతో తలపడుతున్నప్పటికీ చాంపియన్స్‌ లీగ్‌కు అర్హత సాధించడంపైనే దృష్టి పెట్టామని జర్మనీ సూపర్‌స్టార్‌ ఓజిల్‌ చెబుతున్నాడు.

 నిజంగానే మీ జట్టు టాప్‌–4లో చోటు దక్కించుకుంటుందని భావిస్తున్నారా?
అవును. చాంపియన్స్‌ లీగ్‌కు అర్హత సాధించడం మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రపంచంలో అర్సెనల్‌ కూడా ఉత్తమ క్లబ్‌లో ఒకటి.

ఓ ఆటగాడిగా చాంపియన్స్‌ లీగ్‌లో ఆడటం ముఖ్యమని అనుకుంటున్నారా?
నాకే కాదు మా ఆటగాళ్లందరికీ ముఖ్యమే. ఆ టోర్నీలో ఆడటమంటే ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లతో నిన్ను నీవు సరిచూసుకోవడమే. ఆటగాళ్లకే కాదు... మా అభిమానులకు కూడా కావాల్సిందిదే. అందుకే ఇది మాకు చాలా ముఖ్యం.

నాలుగేళ్లుగా అర్సెనల్‌ తరఫున ఆడుతున్నారు. అప్పటి నుంచి చాంపియన్స్‌ లీగ్‌లోనూ ఆడారు. ఒకవేళ ఈసారి మిస్‌ అయితే ఎలా ఫీలవుతారు?
ఇంకా మా ప్రయత్నం పూర్తి కాలేదు. అర్సెనల్‌ చాలా గొప్ప క్లబ్‌. మాకు అందులో ఆడే అర్హత ఉంది. అందుకే ఆ అవకాశం కోసం చాలా కష్టపడుతున్నాం.

జట్టులో గొప్ప ఆటగాళ్లున్నా చాలాకాలం నుంచి ఈపీఎల్‌ టైటిల్‌ గెలవలేకపోతున్నారని అర్సెనల్‌పై విమర్శ ఉంది. అగ్రస్థానానికి ఎందుకు చేరలేకపోతోంది?
ప్రతీ సీజన్లో మేం తొలి భాగమో.. లేకపోతే రెండో సీజన్‌లో మాత్రమే మెరుగ్గా రాణిస్తున్నాం. నిజానికి టైటిళ్లు గెలవాలంటే ఇలాంటి ప్రదర్శన కాకుండా మొత్తం సీజన్‌ అంతా బాగా ఆడాల్సిందే. అదే మాకు సవాల్‌గా మారింది. అలాగే కీలక ఆటగాళ్ల గాయాలు... కొన్నిసార్లు దురదృష్టం కూడా మమ్మల్ని వెనక్కి నెట్టింది. ఒక్క మ్యాచ్‌ ఓడిపోగానే మాలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. ఈ విషయంలో మెరుగవ్వాల్సి ఉంది.

జట్టు కోసం మీరు తగినంతగా కష్టపడటం లేదని కొందరు విమర్శిస్తున్నారు.. ఇది ఎంతవరకు నిజం?
నా కెరీర్‌ ప్రారంభంలో ఇలా జరిగి ఉండవచ్చేమో.. ఎందుకంటే నాకు అప్పుడు ఎలాంటి అనుభవం లేదు. అయితే ఇప్పుడు ఎవరు ఎలా మాట్లాడుతున్నారనేది నాకు అనవసరం. నా కోచ్‌ మాటలే నాకు ముఖ్యం. నేను చేస్తున్న గోల్స్‌ అందరికీ సమాధానమిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement