ఇమ్రాన్ తాహీర్కు భారీ జరిమానా
కేప్ టౌన్: ఆస్ట్రేలియాతో తుది వన్డే సందర్భంగా డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్కు భారీ జరిమానా పడింది. ఆస్ట్రేలియా లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన క్రమంలో 38.0 ఓవర్లలో వార్నర్ ను రెచ్చగొట్టేలా తాహీర్ ప్రవర్తించాడు. ఎల్బీడబ్యూ విషయంలో గట్టిగా అరవడమే కాకుండా వార్నర్ తో తప్పుగా ప్రవర్తించాడు. అయితే దీనిపై ఆన్ ఫీల్డ్ అంపైర్లు పలుమార్లు చెప్పినా తాహీర్ పెడచెవిన పెట్టాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధలన ప్రకారం అంపైర్ల విజ్ఞప్తిని పట్టించుకోకపోవడం విరుద్ధం కనుక తాహీర్ కు మ్యాచ్ ఫీజులు 30 శాతం జరిమానా విధించారు.
ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. మ్యాచ్ ఫీజులో కోతతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లను కూడా తాహీర్ కు విధించారు. ఒకవేళ రాబోవు రెండు సంవత్సరాల వ్యవధిలో నాలుగు, అంతకన్నా ఎక్కువ డీమెరిట్ పాయింట్లకు తాహీర్ గురైన పక్షంలో అతనిపై రెండు మ్యాచ్లు సస్పెన్షన్ పడే అవకాశం ఉంది.