
తాహిర్ రికార్డ్.. సౌతాఫ్రికా విన్
బాసెటెరీ (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్): హషిమ్ ఆమ్లా సెంచరీ ఇన్నింగ్న్, ఇమ్రాన్ తాహిర్ 'రికార్డ్' బౌలింగ్ తో వెస్టిండీస్ ను చిత్తుగా ఓడించింది దక్షిణాఫ్రికా. ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా బుధవారం జరిగిన ఆరో వన్డేలో విండీస్ పై 139 పరుగుల తేడాతో విజయం సాధించింది. 344 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 38 ఓవర్లలో 204 పరుగులకే చాప చుట్టేసింది. 35 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లు కోల్పోయింది. చార్లెస్(49) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
దక్షిణాఫ్రికాలో బౌలర్లలో తాహిర్ 45 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడొట్టాడు. షాంసి 2 వికెట్లు తీశాడు. అతి తక్కువ వన్డేల్లో 100 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్ గా తాహిర్ రికార్డు సృష్టించాడు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 343 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఆమ్లా అద్భుతంగా ఆడి సెంచరీ చేశాడు. 99 బంతుల్లో 13 ఫోర్లతో 110 పరుగులు సాధించాడు. అతడికి వన్డేల్లో ఇది 23వ సెంచరీ. అంతేకాకుండా విండీస్ పై అత్యుత్తమ బ్యాటింగ్ గణాంకాలు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు. డీకాక్(71), డుప్లెసిస్(73) అర్ధసెంచరీతో రాణించారు. మోరిస్ 40, డివిలియర్స్ 27, డుమిని 10 పరుగులు చేశారు. తాహిర్ కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది.