21 ఓవర్లలో 283 పరుగులు | In 21 overs 283 runs scored by New Zealand | Sakshi
Sakshi News home page

21 ఓవర్లలో 283 పరుగులు

Published Thu, Jan 2 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM

జెస్సీ రైడర్

జెస్సీ రైడర్

క్వీన్స్‌టౌన్: టి20 క్రికెట్‌లో అయితే ఇది అత్యధిక స్కోరుగా రికార్డులకెక్కేది. కానీ వన్డే కావడం వల్ల పుస్తకాల్లోకి రాలేదు. కానీ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ చేసిన వీరవిహారం మాత్రం చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కేవలం 21 ఓవర్లలో 283 పరుగులు చేశారంటే... ఆ విధ్వంసాన్ని ఊహించడం కూడా కష్టం. కోరీ అండర్సన్ (47 బంతుల్లో 131 నాటౌట్; 6 ఫోర్లు, 14 సిక్సర్లు), జెస్సీ రైడర్ (51 బంతుల్లో 104; 12 ఫోర్లు, 5 సిక్సర్లు)ల సంచలన సెంచరీలతో... వెస్టిండీస్‌తో బుధవారం క్వీన్స్‌టౌన్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో ఈ ఘనత సాధ్యమైంది.
 
 వర్షం కారణంగా 21 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. గుప్టిల్ (1), టేలర్ (9) విఫలమైనా.. బ్రెండన్ మెకల్లమ్ (11 బంతుల్లో 33; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. అండర్సన్, రైడర్ నాలుగో వికెట్‌కు 191 పరుగులు జోడించారు.
 
  హోల్డర్ 2, నరైన్, మిల్లర్ చెరో వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 21 ఓవర్లలో 5 వికెట్లకు 124 పరుగులకే పరిమితమైంది. డ్వేన్ బ్రేవో (54 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. దేవ్‌నారాయణ్ (30 బంతుల్లో 29; 4 ఫోర్లు), వాల్టన్ (17) మోస్తరుగా ఆడారు. మెక్లీంగన్ 2 వికెట్లు పడగొట్టాడు. అండర్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. వర్షం కారణంగా రెండో వన్డే రద్దయిన సంగతి తెలిసిందే. నాలుగో వన్డే నీల్సన్‌లో శనివారం జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement