సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీలో నాకౌట్ దశకు చేరే సత్తా హైదరాబాద్‌లో ఉందా... గ్రూప్ ‘సి’లో ఉన్న జట్టు వచ్చే ఏడాది పైస్థాయికి ప్రమోట్ అవుతుందా... శుక్రవారం నుంచి జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో వీటికి సమాధానం లభించవచ్చు. పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలంటే జట్టుకు మరో భారీ గెలుపు అవసరం. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్, బలహీన ప్రత్యర్థి త్రిపురతో తలపడనుంది. గత మ్యాచ్‌లో అద్భుత విజయంతో ఆత్మవిశ్వాసం పెరిగిన హైదరాబాద్, సొంతగడ్డపై చెలరేగాలని పట్టుదలగా ఉంది. మరోవైపు త్రిపుర ఆడిన ఐదు మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది.
ఫామ్‌లో బ్యాట్స్‌మెన్...
హైదరాబాద్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడినా... ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌తోనే తమ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించింది. సొంతగడ్డపై జరిగిన రెండు మ్యాచుల్లోనూ (ఆంధ్ర, మహారాష్ట్ర) ప్రయోజనం పొందలేక ‘డ్రా’తో ముగించింది. బలహీనమైన అసోంతో జరిగిన మ్యాచ్‌లో కూడా గెలవలేకపోయింది.
పట్టికలో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌లో త్రిపురలాంటి జట్టుతో ఆడనుంది కాబట్టి ఖచ్చితంగా బోనస్ పాయింట్‌తో సహా గెలిస్తేనే ఆశలు సజీవంగా ఉంటాయి. జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా రాణిస్తుండటం హైదరాబాద్‌కు అనుకూలాంశం. హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో జట్టు ఘన విజయం సాధించింది. అహ్మద్ ఖాద్రీ ఇప్పటికే రెండు సెంచరీలు చేయగా, సుమన్, సందీప్ ఒక్కో సెంచరీ చేశారు. విహారి ఖాతాలో శతకం లేకపోయినా మూడు హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. రవితేజ కూడా ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ అక్షత్ రెడ్డి మాత్రం విఫలం కావడం జట్టుకు సమస్యగా మారింది.
ఈ మ్యాచ్‌లోనైనా అతను చెలరేగాల్సి ఉంది. బౌలింగ్‌లో పేసర్ రవికిరణ్ అద్భుతంగా ఆడుతున్నాడు. మంచి వేగంతో పాటు స్వింగ్‌తో ఆకట్టుకున్న అతను 4 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. అబ్సలం కూడా గత మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. లెఫ్టార్మ్ పేసర్ అన్వర్ అహ్మద్, స్పిన్నర్ లలిత్ మోహన్‌లకు ఈ మ్యాచ్‌లో అవకాశం లభించవచ్చు. సీజన్‌లో మరో మ్యాచ్ మాత్రమే ఇక్కడ ఆడాల్సి ఉన్నందున త్రిపురతో మ్యాచ్‌తో జట్టు పూర్తి ప్రయోజనం పొందాలని పట్టుదలగా ఉంది.
ఐదు ఆడి ఐదులోనూ ఓడి...
మరోవైపు గ్రూప్ ‘సి’లో చెత్త ప్రదర్శనతో త్రిపుర పాయింట్ల పట్టిక (0 పాయింట్లు)లో అట్టడుగున ఉంది. ఆ జట్టు ఆడిన ఐదు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. కెప్టెన్ యోగేశ్ టకవాలే ఒక్కడే వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నా జట్టును ఓటమి నుంచి మాత్రం రక్షించలేకపోయాడు. యోగేశ్ 5 మ్యాచుల్లో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో 508 పరుగులు చేశాడు. అతనితో పాటు కేబీ పవన్, అభిజిత్ డే లపై జట్టు బ్యాటింగ్ ఆధార పడింది. బౌలింగ్‌లో రాణా దత్తా, ఎంబీ మురాసింగ్ జట్టు ప్రధాన బౌలర్లు. ఈ ఏడాది ఘోరమైన ఆటతీరు కనబర్చిన త్రిపుర, హైదరాబాద్‌కు ఏ మాత్రం పోటీనిస్తుందో చూడాలి.
జట్ల వివరాలు: హైదరాబాద్: అక్షత్ రెడ్డి (కెప్టెన్), సుమన్, రవితేజ, విహారి, సందీప్, అమోల్ షిండే, హబీబ్ అహ్మద్, రవికిరణ్, అన్వర్ అహ్మద్, సందీప్ రాజన్, అహ్మద్ ఖాద్రీ, కనిష్క్ నాయుడు, అభినవ్ కుమార్, ఆల్ఫ్రెడ్ అబ్సలం, లలిత్ మోహన్.
త్రిపుర: యోగేశ్ టకవాలే (కెప్టెన్), సుబ్రజిత్ రాయ్, సామ్రాట్ సింఘా, కేబీ పవన్, అబ్బాస్ అలీ, అభిజిత్ డే, మణిశంకర్ మురాసింగ్, రాణాదత్తా, సంజయ్ మజుందార్, విక్కీ సాహా, తుషార్ సాహా, బంటీ రాయ్, అభిజిత్ చక్రవర్తి, సౌమ్య బానిక్, కౌశల్ అచర్జీ.
ఇదే మంచి తరుణం
Published Fri, Dec 6 2013 12:10 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement