సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ మ్యాచ్ రెండో రోజు కూడా మహారాష్ట్ర పట్టు వదల్లేదు. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లతో చెలరేగడంతో సొంతగడ్డపై హైదరాబాద్ జట్టు నిస్సహాయంగా మారిపోయింది. ఫలితంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ సంగతేమో కానీ... ఓడిపోకుండా ఉండాలంటే హైదరాబాద్ తీవ్రంగా శ్రమించాల్సి ఉంది.
కేదార్ జాదవ్ (267 బంతుల్లో 204; 29 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు కెప్టెన్ రోహిత్ మొత్వాని (239 బంతుల్లో 107; 9 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 163.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 616 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దిలీప్ అతీత్కర్ (175 బంతుల్లో 98; 10 ఫోర్లు) సత్తా చాటాడు. హైదరాబాద్ బౌలర్లలో రవికిరణ్ 4, షిండే 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం హైదరాబాద్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. సుమన్ (46 బంతుల్లో 28 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్), అక్షత్ రెడ్డి (43 బంతుల్లో 20 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు.
బౌలర్ల వైఫల్యం
337/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మహారాష్ట్ర రెండో రోజు ఆట ప్రారంభించింది. కొద్ది సేపటికే జాదవ్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో వికెట్‌కు 145 పరుగులు జోడించిన అనంతరం విహారి బౌలింగ్‌లో జాదవ్ వెనుదిరిగాడు. అయితే మహారాష్ట్ర తమ దూకుడు దక్కించలేదు. మొత్వాని, అతీత్కర్ కలిసి స్కోరుబోర్డును పరుగెత్తించారు. ఈ క్రమంలో మొత్వాని కెరీర్‌లో మూడో సెంచరీని అందుకున్నాడు. ఆరో వికెట్‌కు వీరిద్దరు కలిసి 179 పరుగులు జత చేశారు. వీరిద్దరు పెవిలియన్ చేరిన తర్వాత తక్కువ వ్యవధిలో మహారాష్ట్ర మరో మూడు వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం హైదరాబాద్ ఓపెనర్లు ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించారు.
ఓడిపోకుంటే చాలు!
Published Sat, Nov 16 2013 12:08 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement