హామిల్టన్ : సిరీస్ కాపాడుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓటమి చవిచూసింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 0-3తో టీమిండియాకు చేజార్చుకుంది. అయితే తొలి రెండు టీ20ల్లో అంతగా పోరాట పటిమను ప్రదర్శించని కివీస్.. మూడో టీ20లో మాత్రం గెలిచినంత పనిచేసింది. ముఖ్యంగా సారథి కేన్ విలియమ్సన్ అసమాన రీతిలో పోరాడాడు. 48 బంతుల్లో 95 పరుగుల (8ఫోర్లు, 6 సిక్సర్లు)తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో కివీస్ విజయం ఖాయం అనుకున్నారు. అయితే చివరి ఓవర్‌లో షమీ మైండ్ బ్లాక్ బౌలింగ్‌కు మ్యాచ్ స్వరూపం తారుమారై చివరికి ‘టై’గా ముగిసింది. అయితే సూపర్ ఓవర్‌లో విజయం సాధించడంతో మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కోహ్లి సేన కైవసం చేసుకుంది. అయితే బహుమతి ప్రధానోత్సవం సందర్భంగా కేన్ విలియమ్సన్ ఈ ఓటమిపై నిరాశ వ్యక్తం చేశాడు. చేతుల దాకా వచ్చిన విజయాన్ని నేలపాలు చేశామని అసహనం వ్యక్తం చేశాడు.
‘మాకు సూపర్ ఓవర్ అనేది కలసి రావడం లేదు. అందుకే మేము మామూలు మ్యాచ్‌ల్లోనే గెలవాలి. క్రికెట్ ఎంతో గొప్ప క్రీడా. ఏ చిన్న తప్పు దొర్లినా విజేత మారిపోతారు. కీలక, ఒత్తిడి సమయంలో టీమిండియా తన అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించింది. ఈ విషయంలో మేము భారత్ నుంచి ఎంతో నేర్చుకోవాలి. టీమిండియా ఓపెనర్లు దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించినా మా బౌలర్లు తిరిగి తేరుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇరుజట్లు బౌలింగ్ అద్భుతంగా చేశాయి. ఈ రోజు నాబ్యాటింగ్ పట్ల సంతృప్తిగా ఉన్నాను. మిడిల్ ఓవర్లోలో భాగస్వామ్యాలను నమోదు చేశాను. కానీ దురదృష్టమేంటంటే మ్యాచ్‌ను విజయంతో ముగించకపోవడం. ఇక ఓడిపోయామని పిచ్‌ను తప్పుపట్టడానికి వీలు లేదు. బ్యాటింగ్‌కు మంచిగా అనుకూలించింది. ఇక ఓటమి గురించి సభ్యులతో చర్చించుకోవాలి. మేము మరింత మెరుగుపడాలి. ముఖ్యంగా ఒత్తిడిలో జయించడం నేర్చుకోవాలి’ అని విలియమ్సన్ పేర్కొన్నాడు. ఇక ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 శుక్రవారం జరగనుంది.
చదవండి:
టీమిండియా ‘సూపర్’ విజయం
ధోనిని దాటేసిన ‘కెప్టెన్’.. కోహ్లి సరసన రోహిత్
Comments
Please login to add a commentAdd a comment