క్రిస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో కూడా టీమిండియా తీరు మారలేదు. అదే కథ.. అదే వ్యథ అన్నట్లు ఉంది. శనివారం కివీస్‌తో ఆరంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 242 పరుగులకు ఆలౌటైంది. భారత్ ఆటగాళ్లలో పృథ్వీ షా(54), చతేశ్వర పుజారా(54), హనుమ విహారి(55)లు రాణించడంతో ఈ మాత్రం స్కోరునైనా సాధించగలిగింది. ఈసారైనా గాడిలో పడతాడనుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి దారుణంగా నిరాశపరిచాడు.
15 బంతులు ఆడి 3 పరుగులే చేసి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఇక మయాంక్ అగర్వాల్(7), రహానే(7), రిషభ్ పంత్(12), రవీంద్ర జడేజా(9)లు ఏదో ఆడామన్న పేరుకే ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కివీస్ తరఫున రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న ఆల్ రౌండర్ కైల్ జెమీసన్ ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. పృథ్వీ షా, పుజారా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్‌లను ఔట్ చేసి సత్తాచాటాడు. జెమీసన్ నిప్పులు చెరిగే బంతులతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను బెంబెలెత్తించాడు.అతనికి జతగా టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, వాగ్నర్‌కు వికెట్ దక్కింది. చివర్లో షమీ(16), బుమ్రా(10)లు కాస్త బ్యాట్‌కు పని చెప్పడంతో టీమిండియా ఫర్వాలేదనిపించించింది.
టాస్ గెలిచిన కివీస్ భారత్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టీమిండియా ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాలు ఆరంభంలో ఆచుతూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. జట్టు స్కోరు 30 పరుగులు ఉన్నప్పుడు మయాంక్.. బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగడంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారతో కలిసి పృథ్వీ షా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ నేపథ్యంలో పృథ్వీ షా వన్డే తరహాలో ఇన్నింగ్స్ ఆడి 8పోర్లు, ఒక సిక్సర్ సాయంతో 54 పరుగులు చేసి జేమిసన్ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇవ్వడంతో 80 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లితో కలిసి పుజార మరో వికెట్ పడకుండా 85 పరుగుల వద్ద లంచ్‌కు వెళ్లింది.
లంచ్ విరామమనంతరం విరాట్ కోహ్లి తన పేలవ ఫామ్‌ను మరోసారి కొనసాగిస్తూ సౌతీ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే 7 పరుగులు చేసి ఔటవ్వడంతో 113 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఇక టీ బ్రేక్ తర్వాత టీమిండియా స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పుజారా ఔటైన తర్వాత ఏ ఒక్క ఆటగాడు కనీసం క్రీజ్‌లో నిలబడే యత్నం చేయలేదు. 45 పరుగుల వ్యవధిలో టీమిండియా ఐదు వికెట్లను కోల్పోవడం గమనార్హం. చివరి వికెట్‌గా షమీని బౌల్ట్ పెవిలియన్‌కు పంపాడు.
Comments
Please login to add a commentAdd a comment