కివీస్‌ కొట్టేనా.. భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసేనా? | IND Vs NZ: Rohit Fifty Helps India To 163 Runs | Sakshi
Sakshi News home page

కివీస్‌ కొట్టేనా.. భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసేనా?

Published Sun, Feb 2 2020 2:17 PM | Last Updated on Sun, Feb 2 2020 2:21 PM

IND Vs NZ: Rohit Fifty Helps India To 163 Runs - Sakshi

మౌంట్‌మాంగనీ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా 164 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ జట్టులో కేఎల్‌ రాహుల్‌(45; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), రోహిత్‌ శర్మ(60 రిటైర్డ్‌ హర్ట్‌; 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో పాటు శ్రేయస్‌ అయ్యర్‌(33 నాటౌట్‌; 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌-సంజూ శాంసన్‌లు ఆరంభించారు. కాగా, సంజూ శాంసన్‌(2) విఫలమయ్యాడు. మరొకసారి వచ్చిన అవకాశాన్ని శాంసన్‌ కోల్పోయాడు. ఈ రోజు కివీస్‌తో మ్యాచ్‌లో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసే క్రమంలో కేఎల్‌ రాహుల్‌, శాంసన్‌లు ఓపెనర్లుగా వచ్చారు. అయితే ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కాసేపటికే శాంసన్‌ పెవిలియన్‌ చేరాడు. ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొని అనవసరమైన షాట్‌కు నిష్క్రమించాడు.(ఇక్కడ చదవండి: శాంసన్‌ మళ్లీ మిస్‌ చేసుకున్నాడు..!)

న్యూజిలాండ్‌ బౌలర్‌ కుగ్‌లీన్‌ వేసిన రెండో ఓవర్‌ మూడో బంతికి శాంసన్‌ ఔటయ్యాడు. కవర్స్‌లోకి షాట్‌  ఆడి సాన్‌ట్నర్‌కు దొరికిపోయాడు. దాంతో 8 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో రాహుల్‌కు జత కలిసిన రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడి 88 పరుగులు జత చేసిన తర్వాత రాహుల్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. బెన్నెట్‌ వేసిన 12 ఓవర్‌ మూడో బంతికి పెవిలియన్‌ చేరాడు. షాట్‌ ఆడదామని రాహుల్‌ యత్నించగా అది ఎడ్జ్‌ తీసుకుని సాన్‌ట్నర్‌ చేతుల్లోకి వెళ్లింది. ఫలితంగా జట్టు స్కోరు 96 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై రోహిత్‌ శర్మ-అయ్యర్‌లు ఇన్నింగ్స్‌ను ధాటిగా కొనసాగించారు. రోహిత్‌ శర్మ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. కాగా, రోహిత్‌ 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా రిటైర్డ్‌హర్ట్‌ అయ్యాడు. కాలి కండరాలు పట్టేయడంతో పెవిలియన్‌ చేరాడు. దాంతో క్రీజ్‌లోకి వచ్చిన దూబే(5) నిరాశపరిచాడు. చివర్లో మనీష్‌ పాండే(11 నాటౌట్‌: 4 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది.  న్యూజిలాండ్‌ బౌలర్లలో కుగ్‌లీన​ రెండు వికెట్లు సాధించగా,బెన్నెట్‌కు వికెట్‌ లభించింది. మరి ఈ సాధారణ లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకుని క్లీన్‌స్వీప్‌ చేస్తుందో లేదో చూడాలి. (ఇక్కడ చదవండి:  కోహ్లిని దాటేసిన రాహుల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement