
గువాహటి: టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. వర్షం వల్ల మ్యాచ్ రద్దయ్యింది అనే కంటే అసోం క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) వద్ద సరైన మౌలిక సదుపాయాలు లేని కారణంగానే మ్యాచ్ జరగలేదంటేనే బాగుంటుందేమో. వర్షం వెలిసిన తర్వాత పిచ్ ఆరబెట్టడానికి సదరు అసోసియేషన్ హెయిర్ డ్రయర్స్, ఐరన్ బాక్స్‌లు ఉపయోగించడమే ఇందుకు కారణం. ఇది ఏకంగా అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా చెప్పబడుతున్న బీసీసీఐకే మచ్చతెచ్చే విషయం. ఒక అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఈ తరహా విధానాన్ని అవలంభించడమే విమర్శలకు దారి తీసింది. (ఇక్కడ చదవండి: మెరుపుల్లేవ్... చినుకులే!)
మ్యాచ్ రద్దయిన తర్వాత ఏసీఏ అవలంభించిన తీరుపైనే కాకుండా బీసీసీఐనే ఆడుసుకుంటున్నారు నెటిజన్లు. ‘ 1980 కాదురా నాయనా.. 2020. ఏకంగా ఫ్లైయింగ్ కార్స్‌ని వాడతారనుకుంటే, మరి ఏమిటో మనం వెనక్కి పయనిస్తున్నాం. ఇది బీసీసీఐకే షేమ్’ అని ఒక నెటిజన్ ఎద్దేవా చేయగా, ‘ శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో ఉపయోగించే వర్షపు కవర్లను తెచ్చుకుని ఉండాల్సింది’ అని మరొకరు విమర్శించారు. ఒక మహిళ చికెన్‌ను రోస్ట్ చేయడానికి హెయిర్ డ్రయర్‌ను ఉపయోగిస్తున్న ఇమేజ్‌ను పోస్ట్ చేసి మరీ మరొక అభిమాని సెటైర్ వేశాడు. ‘ ఇది ఇండియన్ పవర్‌ఫుల్ హెయిర్ డ్రయర్’ అని మరొకరు చమత్కరించారు. ‘ పిచ్‌ను హెయిర్ డ్రయర్‌తో ఆరబెట్టారు.. ఇక పిచ్‌ను చదును చేసే క్రమంలో మన తలలతో చేస్తే బాగుంటుందేమో’ అని మరో అభిమాని విమర్శించాడు.