
తిరువనంతపురం : తొలి టీ20లో పర్యాటక వెస్టిండీస్ జట్టుపై ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. ఆదివారం స్థానిక మైదానంలో జరగబోయే రెండో టీ20లో తప్పక గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం పక్కా ప్రణాళికలు రచిస్తోంది కోహ్లి సేన. తొలి మ్యాచ్‌లో గెలిచినప్పటికీ కొన్ని లోపాలు కూడా భయటపడ్డాయి. హైదరాబాద్ టీ20లో బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పాటు చెత్త ఫీల్డింగ్ టీమ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. దీంతో రెండో మ్యాచ్‌లో ఈ లోపాలను సరిదిద్దుకోవడంతో పాటు జట్టులోనూ పలు మార్పులు చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
అయితే విన్నింగ్ టీమ్‌ను మార్చకూడదని నిబంధనలను రూపొందించుకున్నప్పటికీ మార్పులు తప్పేలా లేవని సమాచారం. బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు లేవని తెలుస్తోంది. అయితే బౌలింగ్ విభాగంపైనే టీమ్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. పునరాగమనం మ్యాచ్‌లో భువనేశ్వర్ తేలిపోయాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న దీపక్ చహర్ విఫలమయ్యాడు. యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఫీల్డింగ్‌లో పూర్తిగా నిరుత్సాహపరిచాడు. దీంతో భువీ, చహర్‌లలో ఒకరిని పక్కకు పెట్టి మహ్మద్ షమీని తీసుకోవాలని భావిస్తున్నారు. అదేవిధంగా వాషింగ్టన్ సుందర్‌ను జట్టు నుంచి తప్పించి కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది.
ఇక ఫీల్డింగ్ వైఫల్యంపై కూడా మేనేజ్‌మెంట్ ప్రత్యేక దృష్టి సారించింది. ఆదివారం జరిగిన నెట్ ప్రాక్టీస్‌లో ఫీల్డింగ్ కోసం ఓ సెషన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక తొలి మ్యాచ్‌లో ఎక్కువగా క్యాచ్‌లు నేలపాలు చేసిన రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్‌లో ఈ అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. అదేవిధంగా మిగతా టీమిండియా ఆటగాళ్లు ఫీల్డింగ్ కోచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రిల్‌లో పాల్గొన్నారు. ఇక కరీబియన్లు కూడా తొలి మ్యాచ్ వైఫల్యాలను గుర్తించి సరిదిద్దుకోని తిరువనంతపురం మ్యాచ్‌లో అడుగుపెట్టాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment