భారత్ ‘ఎ’ 122/3
♦ దక్షిణాఫ్రికా ‘ఎ’ 542
♦ డికాక్ సెంచరీ
వాయనాడ్ (కేరళ) : దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార టెస్టు మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు తడబడింది. రెండో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 34.5 ఓవర్లలో మూడు వికెట్లకు 122 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (49), ముకుంద్ (38), జీవన్‌జోత్ (22) అవుటయ్యారు. కెప్టెన్ అంబటి తిరుపతి రాయుడు 11 పరుగులతో, కరుణ్ నాయర్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. అంతకుముందు దక్షిణాఫ్రికా జట్టు 138.5 ఓవర్లలో 542 పరుగులకు ఆలౌటయింది.
డి కాక్ (102 బంతుల్లో 113; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు సెంచరీ చేశాడు. విలాస్ (75) రాణించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు తీయగా, శ్రేయస్, జయంత్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం భారత్ ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 420 పరుగులు వెనుకబడి ఉంది.