ఆటగాళ్ల సవాళ్లు, ప్రతిసవాళ్లు లేవు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, స్పందనలు కనిపించలేదు. పిచ్‌లు, వాతావరణంపై చర్చ జరిగినా, క్రికెటర్లు మాత్రం దీనిని పట్టించుకోవడం లేదు. ఇరు జట్లు కేవలం తమ బలం, బలగాన్నే నమ్ముకున్నాయి. అన్నీ పక్కన పెట్టి ఆటపై మాత్రమే దృష్టి పెట్టాయి. నాలుగేళ్ల క్రితం నాటి పరాజయాలను మరచిపోయే ప్రదర్శన చేయాలని ఒక జట్టు... రెండేళ్ల క్రితం చిత్తుగా ఓడించిన ప్రత్యర్థిని సొంతగడ్డపై పడగొట్టాలని మరో జట్టు... ఈ నేపథ్యంలో ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అసలు సమరానికి రంగం సిద్ధమైంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సరిగ్గా ఆరు వారాల వ్యవధిలో జరిగే ఐదు టెస్టులు సంప్రదాయ క్రికెట్ మజాను అందించనున్నాయి. టాప్ ర్యాంకర్ భారత్, ఐదో ర్యాంక్ టీమ్ ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ పోరులో అంతిమ విజేత ఎవరో వేచి చూడాలి.
బర్మింగ్‌హామ్: సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు ఉండే ప్రాధాన్యతే వేరు. ఇక్కడ గెలిచి శుభారంభం చేస్తే మానసికంగా ఆ జట్టు బలం రెట్టింపవుతుంది. విదేశీ గడ్డపై మొదటి మ్యాచ్‌లో వెనుకబడి భారత్ సిరీస్‌లో ఆధిక్యం ప్రదర్శించిన సందర్భాలు చాలా అరుదు. కాబట్టి ఈ సారైనా విజయంతో మొదలు పెట్టాలని టీమిండియా పట్టుదలగా ఉంది. భారత్, ఇంగ్లండ్ మధ్య నేటి నుంచి ఇక్కడి ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తొలి టెస్టు జరగనుంది. మ్యాచ్‌కు ముందు రోజే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించి సిద్ధం కాగా... భారత్ మాత్రం ఇంకా ఓపెనర్లు, స్పిన్నర్ల విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయింది.
కోహ్లిపైనే దృష్టి...
2014లో ఇక్కడ ఆఖరి టెస్టు ఆడిన భారత తుది జట్టు నుంచి కనీసం ఆరుగురు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో కూడా ఆడబోతున్నారు. విజయ్, పుజారా, రహానే, అశ్విన్, ఇషాంత్‌లతో పాటు విరాట్ కోహ్లి ఈ జాబితాలో ఉన్నాడు. అయితే ఎవరు ఎలా ఆడినా కోహ్లిని మాత్రం నాటి సిరీస్ జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ సారి కచ్చితంగా బాగా ఆడాల్సిన స్థితిలో అతను బరిలోకి దిగుతుండగా, కెప్టెన్‌గా జట్టును గెలిపించాల్సిన బాధ్యత కూడా అతనిపై ఉంది. వరల్డ్ టాప్ బ్యాట్స్‌మన్‌గా కోహ్లి తన స్థాయిని ప్రదర్శిస్తే భారత్ ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం. ఇద్దరు ఓపెనర్లలో విజయ్‌తో పాటు ఎడమచేతి వాటం కావడం వల్ల శిఖర్ ధావన్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అయితే తాజా ఫామ్ మాత్రం రాహుల్ మెరుగనే చూపిస్తోంది. పుజారా మాత్రం తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకోలేకపోతున్నాడు. 2014లో అందరిలాగే విఫలమైన తాను, ఇటీవల కౌంటీ క్రికెట్ ఆడినా పెద్దగా ప్రభావం చూపలేదు. అనూహ్య నిర్ణయాలు తీసుకునే కోహ్లి అవసరమైతే పుజారాను కూడా పక్కన పెట్టి మూడో స్థానంలో రాహుల్‌ను ఆడించవచ్చు కూడా. ఇక రహానే కూడా తన సామర్థ్యానికి తగిన విధంగా రాణించాల్సి ఉంది. బౌలింగ్‌లో ఇద్దరు పేసర్లు ఇషాంత్, ఉమేశ్ ఉండటం ఖాయం. భువనేశ్వర్, బుమ్రా లేని లోటు కనిపించకుండా వీరిద్దరు సత్తా చాటాల్సి ఉంది. స్పిన్నర్లలో అశ్విన్ తను అనుభవాన్ని చూపిస్తే ఇంగ్లండ్‌కు ఇబ్బందులు తప్పవు. ఇంగ్లండ్ ఒకే స్పిన్నర్‌కు పరిమితమైన నేపథ్యంలో భారత్ రెండో స్పిన్నర్‌ను దించి సాహసం చేస్తుందా, మూడో పేసర్‌ను తీసుకుంటుందా చూడాలి. పాండ్యాను మూడో సీమర్‌గా భావిస్తే కుల్దీప్‌కు అవకాశం దక్కవచ్చు. అయితే ఇప్పటి వరకు డ్యూక్ బంతులతో బౌలింగ్ చేయని కుల్దీప్ ఏమాత్రం ప్రభావం చూపిస్తాడనేది ఆసక్తికరం.
రషీద్ ఎంపిక...
బ్యాటింగ్‌లో ఇంగ్లండ్ ప్రధానంగా ఇద్దరు ఆటగాళ్లపై ఆధార పడుతోంది. సీనియర్ ఓపెనర్ అలిస్టర్ కుక్, కెప్టెన్ జో రూట్ ఆ జట్టు భారాన్ని మోస్తున్నారు. ఇతర బ్యాట్స్‌మెన్ కూడా రాణించే అవకాశం ఉన్నా... కుక్, రూట్ మాత్రం టెస్టు స్వరూపాన్ని మార్చగలరు. బెయిర్ స్టో మంచి ఫామ్‌లో ఉండగా, లోయర్ ఆర్డర్‌లో బట్లర్ బ్యాటింగ్ అదనపు బలం కాగలదు. జెన్నింగ్స్, మలాన్ ఏమాత్రం భారత్‌పై ఆధిక్యం కనబర్చగలరనేది చెప్పలేం. మరోసారి పేస్ ద్వయం అండర్సన్, బ్రాడ్‌లపై అదనపు భారం పడింది. ఆరంభంలో వీరిద్దరు టీమిండియా వికెట్ల తీయగలిగితే మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మారిపోవచ్చు. కొంత కాలంగా మరీ అద్భుతమైన ఫామ్‌లో లేకున్నా... అనుభవంతో పాటు సొంతగడ్డపై అండర్సన్, బ్రాడ్ ఎప్పుడైనా ప్రమాదకరమే. మంచి స్వింగ్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్యామ్ కరన్‌ను తుది జట్టులో ఎంపిక చేసి ఇంగ్లండ్ మూడో పేసర్ వైపే మొగ్గు చూపింది. ఒకే స్పిన్నర్‌గా ఆదిల్ రషీద్‌కే చోటు దక్కడం విశేషం. వివాదాస్పద రీతిలో జట్టులో చోటు దక్కించుకున్న రషీద్‌పై కచ్చితంగా రాణించాలనే ఒత్తిడి ఉండటం భారత్‌కు కలిసి రావచ్చు. 2014లో భారత్‌పై చెలరేగిన ఆల్‌రౌండర్ మొయిన్ అలీని మాత్రం ఇంగ్లండ్ ఎంపిక చేయకపోవడం విశేషం.
10 వేల సీట్లు ఖాళీ!
భారత్–ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్‌పై కౌంటీ జట్ల అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం టిక్కెట్ల అమ్మకాలపై పడుతోందని వాపోతున్నారు. బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమయ్యే టెస్టుకు మొదటి రెండు రోజుల పాటు 10 వేల టిక్కెట్లు అమ్ముడుకాకుండా మిగిలిపోయాయని చెబుతున్నారు. సహజంగా టెస్టులు గురువారం నుంచి ప్రారంభం కావాలని కౌంటీలు కోరుకుంటాయి. తద్వారా సెలవు రోజులైన శని, ఆదివారాల నాటికి మ్యాచ్‌లు మూడు, నాలుగో రోజుకు చేరుతాయి. రసవత్తర పోరాటాలను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అభిమానులు మైదానానికి భారీగా వస్తారు. కానీ, ప్రస్తుత సిరీస్‌లో రెండు, నాలుగో టెస్టులు మాత్రమే గురువారం మొదలవుతున్నాయి. మూడో టెస్టు శనివారం (ఆగస్టు 18), అయిదో టెస్టు శుక్రవారం (సెప్టెంబరు 7) నుంచి జరుగనున్నాయి. ‘మొత్తమ్మీద 70 వేల టిక్కెట్లు మాత్రమే అమ్మగలిగాం. తొలి రెండు రోజులకు సంబంధించిన విక్రయాలు మేం ఆశించినంతగా లేవు. బుధవారం నుంచి ప్రారంభమే దీనికి కారణం. ఈ సిరీస్ షెడ్యూల్‌పై చర్చ రేకెత్తించనుంది’ అని బర్మింగ్‌హామ్ కౌంటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీల్ స్నోబాల్ వ్యాఖ్యానించాడు.
►ఈ మైదానంలో భారత్ ఆరు టెస్టులు ఆడింది. ఐదింటిలో ఓడిపోయి, మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది.
►ఇంగ్లండ్ జట్టుకు ఇది 1000వ టెస్టు. 999 టెస్టుల్లో ఇంగ్లండ్ 357 గెలిచి, 297 ఓడింది. మరో 345 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 15 మార్చి, 1877లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో తమ తొలి టెస్టు ఆడిన ఇంగ్లండ్ 45 పరుగులతో ఓడింది. సొంతగడ్డపై 510 టెస్టులు ఆడిన ఆ జట్టు 213 గెలిచి, 119 ఓడింది. మరో 178 టెస్టులు డ్రా అయ్యాయి.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), విజయ్, ధావన్, రాహుల్/పుజారా, రహానే, కార్తీక్, పాండ్యా, అశ్విన్, ఉమేశ్, ఇషాంత్, కుల్దీప్/షమీ.
ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), కుక్, జెన్నింగ్స్, మలాన్, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, రషీద్, కరన్, బ్రాడ్, అండర్సన్.
పిచ్, వాతావరణం
గత కొద్ది రోజులుగా విపరీతమైన ఎండల వల్ల పొడిబారి ఎడ్జ్‌బాస్టన్ వికెట్ భారత్‌లోలాగే కనిపిస్తోందని అన్ని వైపుల నుంచి వ్యాఖ్యలు వినిపించాయి. అయితే మ్యాచ్‌కు ముందు రోజు పిచ్ మరీ అలా ఏమీ లేదు. నిరంతరాయంగా నీళ్లు చల్లడంతో పిచ్‌లో జీవం ఉంది. ఆరంభంలో పేస్, స్వింగ్‌కు అనుకూలించవచ్చు. ఊహించినదానికి భిన్నంగా స్పిన్ ప్రభావం తక్కువ కావచ్చు. వాతావరణం బాగుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.
భారత్(vs) ఇంగ్లండ్
తొలి టెస్టు మధ్యాహ్నం గం. 3.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment