'ఢమాకా'కు వేళాయే | india and england first t-20 match | Sakshi
Sakshi News home page

'ఢమాకా'కు వేళాయే

Published Thu, Jan 26 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM

'ఢమాకా'కు వేళాయే

'ఢమాకా'కు వేళాయే

టి20ల్లో తలపడనున్న భారత్, ఇంగ్లండ్‌
►  నేడు తొలి మ్యాచ్‌
రిషభ్‌ పంత్‌కు అవకాశం దక్కేనా!  


ఏకపక్షంగా సాగిన టెస్టు సిరీస్, వన్డేల్లో హోరాహోరీ మ్యాచ్‌ల తర్వాత భారత్, ఇంగ్లండ్‌ సుదీర్ఘ పోరు ఇప్పుడు చివరి అంకానికి చేరింది. ఇకపై ఇరు జట్లు పొట్టి ఫార్మాట్‌లో తమ సత్తా చాటేందుకు     సన్నద్ధమయ్యాయి. ధనాధన్‌ ఆటతో     అభిమానులకు పూర్తి వినోదాన్ని     అందించేందుకు ఒకవైపు కోహ్లి సేన, మరోవైపు మోర్గాన్‌ బృందం ‘సై’ అంటున్నాయి. అనుభవజ్ఞులు, కుర్రాళ్ల కలయికతో భారత జట్టు కాస్త కొత్తగా కనిపిస్తుండగా, స్పెషలిస్ట్‌లతో ఇంగ్లండ్‌ బరిలో నిలిచింది. మూడు మ్యాచ్‌ల ధమాకా     క్రికెట్‌కు నేడు కాన్పూర్‌లో తెర లేస్తోంది. భారత టి20 కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లికి ఇదే తొలి మ్యాచ్‌ కావడం విశేషం.  

కాన్పూర్‌: భారత గణతంత్ర దినోత్సవాన క్రికెట్‌ అభిమానుల కోసం మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టి20 సిరీస్‌లో భాగంగా నేడు (గురువారం) జరిగే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడుతుంది. టెస్టు, వన్డే సిరీస్‌లను గెలుచుకున్న టీమిండియా, ఈ ఫార్మాట్‌లోనూ తమ ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తుండగా, ఒక్క సిరీస్‌ విజయంతోనైనా తిరిగి వెళ్లాలని ఇంగ్లండ్‌ పట్టుదలగా ఉంది. ఇరు జట్ల మధ్య వన్డేల్లోనే రికార్డు స్థాయిలో పరుగుల వరద పారిన నేపథ్యంలో టి20ల్లో కూడా అదే జోరు కొనసాగే అవకాశం ఉంది. ఇటీవలే 500వ టెస్టుకు వేదికగా నిలిచిన గ్రీన్‌ పార్క్‌ మైదానంలోనే ఈ మ్యాచ్‌ జరగనుంది. ఉత్తరాదిన మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో మ్యాచ్‌ సమయాన్ని ముందుకు మార్చారు.

ఓపెనర్‌గా కోహ్లి!
భారత వన్డే జట్టుతో పోలిస్తే కొన్ని కీలక మార్పులు టి20 టీమ్‌లో కనిపించనున్నాయి. సురేశ్‌ రైనా, ఆశిష్‌ నెహ్రాలాంటి సీనియర్లు మ్యాచ్‌ బరిలోకి దిగుతుండగా, మిడిలార్డర్‌లో మనీశ్‌ పాండేకు అవకాశం దక్కనుంది. వన్డేల్లో చోటు కోల్పోయి ఈ ఒక్క ఫార్మాట్‌కే పరిమితమైన రైనా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ సిరీస్‌లో రాణించడం తప్పనిసరి. వన్డేల్లో ఎక్కువగా రిజర్వ్‌కే పరిమితమవుతున్న పాండే కూడా తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అశ్విన్, జడేజాలకు విశ్రాంతినివ్వడంతో ప్రధాన స్పిన్నర్‌గా అమిత్‌ మిశ్రా బరిలోకి దిగడం ఖాయమైంది. లెగ్‌స్పిన్‌ ఆడటంలో ఇంగ్లండ్‌ బలహీనతను బట్టి చూస్తే మిశ్రా కీలకం కానున్నాడు. అదే విధంగా ఆఫ్‌స్పిన్నర్‌గా పర్వేజ్‌ రసూల్‌  కూడా తుది జట్టులో ఉంటాడు. డెత్‌ ఓవర్లలో మన బౌలర్లు ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరం. మరోవైపు సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి కెప్టెన్‌గా తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో మరో బాధ్యతను తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. తాను ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉందని అతను పరోక్షంగా వెల్లడించాడు.

ఐపీఎల్‌లో ఓపెనింగ్‌కు దిగినా... భారత్‌ తరఫున గతంలో రెండుసార్లు మాత్రం అతను ఓపెనర్‌ స్థానంలో ఆడాడు. కోహ్లిలాంటి స్టార్‌ ఆటగాడు ఎక్కువ ఓవర్లు ఆడేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. అయితే అతనికి జోడిగా ఎవరు ఉంటారనేది ఆసక్తికరం. ఈ విషయంలో లోకేశ్‌ రాహుల్‌కు అనుకూలతలు ఉన్నా, మన్‌దీప్‌ సింగ్‌ నుంచి అతనికి పోటీ ఎదురవుతోంది. మరోవైపు రంజీల్లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు ఎంపికైన వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా అవకాశం ఇవ్వాలంటే ఓపెనింగ్‌ మినహా మరో స్థానం ఖాళీ లేదు. జట్టులో అందరికీ తగినంత టి20 అనుభవం ఉండటంతో భారత్‌ పటిష్టంగా కనిపిస్తోంది. యార్కర్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు మ్యాచ్‌కు ముందు రోజు ధోని, బుమ్రా బౌలింగ్‌లో ప్రత్యేకంగా సాధన చేయడం విశేషం.
నలుగురు పేసర్లతో...
ఇంగ్లండ్‌ జట్టు వన్డే సిరీస్‌ ఓడినా, తొలి రెండు మ్యాచ్‌లలో కూడా గట్టి పోటీ ఇచ్చింది. టెస్టు టీమ్‌తో పోలిస్తే పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌లుగా జట్టులోకి వచ్చిన వారంతా తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. చివరి వన్డేలో సాధించిన విజయంతో మోర్గాన్‌ సేన కొత్త ఉత్సాహంతో టి20లకు సిద్ధమైంది. దాదాపు పది నెలల క్రితం భారత గడ్డపై ప్రపంచకప్‌ ఆడిన జట్టు నుంచే ఎక్కువ మంది ఆటగాళ్లు ఈ టీమ్‌లోనూ ఉండటం వారికి కలిసొచ్చే అంశం. ఓపెనర్‌గా జేసన్‌ రాయ్‌ మెరుపు ఆరంభం ఇవ్వగల సమర్థుడు. గాయంతో హేల్స్‌ దూరమైనా, అతని స్థానంలో వచ్చిన బిల్లింగ్స్‌కు కూడా చెలరేగే సత్తా ఉంది. సీనియర్లు మోర్గాన్, రూట్‌లతో పాటు ఆల్‌రౌండర్లు స్టోక్స్, అలీ ఆ జట్టు బలం. టి20ల్లో దూకుడైన ఆటగాడు, ఐపీఎల్‌ అనుభవం ఉన్న బట్లర్‌ కూడా ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గంటకు 90 మైళ్ల వేగంతో నిలకడగా బౌలింగ్‌ చేస్తున్న టైమల్‌ మిల్స్‌పై కూడా ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. ఇంగ్లండ్‌ తుది జట్టులో నలుగురు పేసర్లకు అవకాశం ఇవ్వనుండటం విశేషం. అయితే అనుభవం తక్కువగా ఉన్న బౌలింగ్‌తో పోలిస్తే తమ బ్యాటింగ్‌పైనే జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది.

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రాహుల్‌/పంత్, రైనా, యువరాజ్, ధోని, పాండే, పాండ్యా, రసూల్, మిశ్రా, నెహ్రా, బుమ్రా/భువనేశ్వర్‌.
ఇంగ్లండ్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), రాయ్, బిల్లింగ్స్, రూట్, బట్లర్, స్టోక్స్, అలీ, ప్లంకెట్, జోర్డాన్, మిల్స్, బాల్‌.

టి20ల్లో స్పెషలిస్ట్‌లుగా నిరూపించుకునేందుకు రసూల్‌లాంటి బౌలర్లకు ఈ సిరీస్‌ మంచి అవకాశం. భారత్‌కు మరిన్ని విజయాలు అందించగల సత్తా ఇంకా రైనాలో ఉందని నమ్ముతున్నా. అవసరమైతే నేను ఓపెనింగ్‌ చేస్తా. టెస్టులు, వన్డేల జోరును ఇక్కడా కొనసాగిస్తాం. మిల్స్‌ బౌలింగ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు కానీ 90 మైళ్లకు పైగా వేగంతో బౌలింగ్‌ చేసే చాలా మంది బౌలర్లను నా కెరీర్‌లో ఎదుర్కొన్నాను.      –  కోహ్లి, భారత కెప్టెన్‌

కోల్‌కతా వన్డే విజయం తర్వాత మా జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎంత కష్టపడినా గెలుపు దక్కలేదనే నిస్పృహ నుంచి అంతా దూరమయ్యారు. ఈ సిరీస్‌లోనూ గట్టి పోటీ తప్పదు కానీ విజయం సాధించగలమని నమ్ముతున్నాం. – మోర్గాన్, ఇంగ్లండ్‌ కెప్టెన్‌

పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌. చిన్నగ్రౌండ్‌ కూడా కావడంతో భారీ స్కోరుకు అవకాశం ఉంది. మంచు వల్ల టాస్‌ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్‌కు దిగవచ్చు.

సా.గం. 4.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో  ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement