
'మా జట్టులో టీ 20 స్టార్స్ లేరు'
మిర్పూర్:ఆసియాకప్లో భాగంగా ఆదివారం జరగబోయే తుదిపోరులో టీమిండియానే ఫేవరెట్ అని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రాఫ్ మోర్తజా అభిప్రాయపడ్డాడు. ట్రోఫీని అందుకునేందుకు అన్ని అర్హతలతో టీమిండియా బరిలోకి దిగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. దీనిపై ఎటువంటి చర్చ అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. కాగా, స్వదేశీ పరిస్థితులు తమకు కలిసొచ్చే అవకాశం లేకపోలేదని ఆశాభావాన్ని మోర్తజా వ్యక్తం చేశాడు. యువకులతో కూడిన తమ జట్టు సమష్టి ప్రదర్శనతోనే విజయాలను సాధించి ఫైనల్ పోరుకు అర్హత సాధించిందన్నాడు.
'మా జట్టులో టీ 20 స్టార్ అంటూ ఎవరూ లేరు. మ్యాచ్ విన్నర్స్ అంతకన్నా లేరు. వాతావరణం, పిచ్, స్వదేశీ పరిస్థితులు మాత్రమే మాకు అనుకూలంగా ఉన్నాయి. ఫైనల్లో గెలవడానికి మా శాయశక్తులా పోరాడుతాం' అని మోర్తజా పేర్కొన్నాడు. తమకు ఫైనల్ కూడా ఒక మ్యాచ్ వంటిదే అన్న టీమిండియా డైరెక్టర్ వ్యాఖ్యలతో మోర్తజా ఏకీభవించాడు. అంతకుముందు 10 మ్యాచ్లు వారు ఎలా ఆడారో అదే విధంగా ఈ మ్యాచ్ ఆడతారన్నాడు. కాగా, టీమిండియా ఆడే ఫైనల్ మ్యాచ్ల్లో ఆ జట్టే ఎక్కువ హైప్ స్పష్టిస్తూ ఉంటుందని మోర్తజా తెలిపాడు. కాగా, తమ జట్టుపై మాత్రం ఎటువంటి ఒత్తిడి లేదని, సహజసిద్ధంగానే రేపటి పోరుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు.