భారత్, ఆసీస్ క్రీడాబంధానికి శ్రీకారం
ముంబై: భారత్, ఆస్ట్రేలియా దేశాలు క్రీడల భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాయి. ఇరు దేశాల్లో క్రీడల వృద్ధి, వికాసమే ధ్యేయంగా పరస్పరం సహకరించుకోవడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం. భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్, కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ బుధవారం భారత్, ఆసీస్ క్రీడాభాగస్వామ్యం (ఐఏఎస్‌పీ) ఒప్పందంపై సంతకాలు చేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇందులో పాల్గొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా నాలుగు కీలకాంశాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం ఉంటుంది. అథ్లెట్, కోచ్ శిక్షణ, అభివృద్ధి, స్పోర్ట్స్ సైన్స్‌లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయి. కోచ్‌లు, సాంకేతిక సిబ్బందిని పరస్పరం మార్పిడి చేసుకొని సత్ఫలితాలు సాధిస్తామని గోయల్ చెప్పారు.
క్రీడలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, దీన్ని కేవలం ఆటగానే కాకుండా ప్రజల ఆరోగ్య సంపదగా భావిస్తున్నామని అన్నారు. ఇదివరకే ‘ఖేలో ఇండియా’తో క్షేత్రస్థాయిలో క్రీడల సంస్కృతి పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్ మాట్లాడుతూ... ఈ కొత్త భాగస్వామ్యంలో భాగంగా విక్టోరియా, కాన్‌బెర్రా యూనివర్సిటీలు భారత్‌లో జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు సహకరిస్తాయని చెప్పారు. అనంతరం సచిన్ అత్త అనాబెల్ మెహతా నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ ‘అప్నాలయా’ బాలికలతో టర్న్‌బుల్, గోయల్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా సచిన్‌తో కాసేపు ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇద్దరు క్రికెట్ విషయాలు చర్చించినట్లు తెలిసింది.