
ముంబై : విరాట్ కోహ్లి.. పరిచయం అవసరం లేని పేరు. ఇప్పటికే చాలా సార్లు కోహ్లి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. మంచినీళ్లు తాగినంత సులభంగా సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. భారత క్రికెట్ శకంలో సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగానిగా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. తన దూకుడైన ఆటతీరుతో ఎన్నో ఇన్నింగ్స్‌లు గెలిపించిన కోహ్లికి రెండో ఇన్నింగ్స్ మాట వినగానే పూనకం వచ్చేస్తుంది. అతను చేసిన సెంచరీల్లో ఎక్కువభాగం రెండో ఇన్నింగ్స్‌లో వచ్చినవే. ఒక ఆటగాడిగానే గాక టీమిండియా కెప్టెన్‌గాను సమర్థవంతంగా తన పాత్రను పోషిస్తున్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఒక్కోసారి దూకుడుగా, కొన్నిసార్లు డిఫెన్స్ మోడ్ ఆడే కోహ్లి మైదానంలో ఉన్నప్పుడు అక్కడి వాతావరణాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంటాడు. తాజాగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఫేస్‌బుక్ లైవ్ చాటింగ్‌లో మాట్లాడుతూ కోహ్లి సక్సెస్‌కు గల కారణాలను పంచుకున్నాడు. అదేంటో అతని మాటల్లోనే విందాం..
' కోహ్లి ఏ మ్యాచ్‌నైనా నిజాయితీగా ఆడటానికే ప్రాధాన్యతనిస్తాడు. ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్‌గా నిలవాలనే తాపత్రయంతో చాలా కష్టపడుతుంటాడు. ఆ నిబద్ధతే ఈరోజు కోహ్లిని ఉన్నత స్థానంలో నిలిపింది. ఒక్కసారి మైదానంలోకి దిగాడంటే ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదని భావించే కోహ్లి బెస్ట్ ఇన్నింగ్స్ ఆడటానికే ప్రయత్నిస్తాడు. అన్నింటికంటే కోహ్లికున్న అనుకూలతలే అతని అతిపెద్ద బలం అని ఎప్పటికి నమ్ముతా. అతను ఎప్పుడు ఒకే డైమన్షన్ ఆటతీరును ప్రదర్శించడు. పరిస్థితులను బట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేస్తాడు. ఫార్మాట్‌కు తగ్గట్టుగా ఆటశైలిని మార్చుకుంటాడు. అందుకు ఉదాహరణ.. ఐపీఎల్ 2016.. ఈ సీజన్‌లో కోహ్లి నాలుగు సెంచరీలు బాదాడు.. అందులో 40 సిక్సర్లు ఉన్నాయి. అంత దూకుడుగా ఆడిన కోహ్లి ఐపీఎల్ తర్వాత జరిగిన విండీస్ సిరీస్‌లో మాత్రం తన దూకుడైన ఆటతీరును ప్రదర్శించకుండానే అక్కడ ఆడిన మొదటి మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో మెరిశాడు. అందుకే కోహ్లి ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్లలో ఒకడిగా నిలిచాడు.' అంటూ రాథోర్ ప్రశంసలు కురిపించాడు.(నెపోటిజమ్ అనే మాటే లేదు: ఆకాశ్ చోప్రా)
Comments
Please login to add a commentAdd a comment