దెబ్బకు దెబ్బ
►రెండో టెస్టులో భారత్ ఘన విజయం
►75 పరుగులతో ఆస్ట్రేలియా చిత్తు
►112 పరుగులకే కుప్పకూలిన కంగారూలు
►అశ్విన్ కు 6 వికెట్లు
భారత్ కంగారూలను వెంటాడి వేటాడింది. పుణే పరాభవ భారంతో పెరిగిన కసిని కోహ్లి సేన బెంగళూరులో ప్రదర్శించింది. దుర్భేద్యంగా కనిపించిన తమ జట్టును దెబ్బ తీసిన ప్రత్యర్థిపై ఈసారి నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. ఊపిరి పీల్చుకోలేని విధంగా నలుగురు బౌలర్లతో దిగ్బంధనం చేసి ఆస్ట్రేలియాను కేవలం 35.4 ఓవర్లలో మడతెట్టేసింది. క్షణక్షణానికి మారుతున్న పిచ్‌పై ప్రతీ బంతిని ప్రాణ సంకటంలా ఎదుర్కొన్న స్మిత్ బృందం 188 పరుగులు చేయడం కూడా తమ వల్ల కాదన్నట్లుగా చేతులెత్తేసి మ్యాచ్‌ను అప్పగించేసింది.
ఛేదనలో ఒక దశలో ఆసీస్ స్కోరు 42/1. అంతా వారికి అనుకూలంగానే సాగుతుందనిపించింది. అప్పుడొచ్చాడు అశ్విన్... ఎప్పుడైనా ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న తన ‘ప్రియమైన శత్రువు’ వార్నర్‌ను దెబ్బ తీసి దారి చూపించాడు. అంతే... ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ అలా ఆడటం, ఇలా అవుట్ కావడం ఆగకుండా సాగిపోయింది. సమీక్షలకు పునస్సమీక్షలకు కూడా ఎలాంటి అవకాశం లేకుండా మనోళ్లు కట్టి పడేశారు. 11 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు కోల్పోయిన ఆసీస్ బేలగా మారిపోయింది.
తొలి ఇన్నింగ్స్‌లో తమను దెబ్బ తీసిన నాథన్ లయన్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకొని అశ్విన్ ఆకాశపు అంచుల్లోకి బంతిని విసిరిన అపురూప క్షణాన... ఎన్నో అరుదైన దృశ్యాలు... ఒక్కో ఆటగాడిలో ఎన్నో భావోద్వేగాలు... నాలుగు రోజులుగా మాటల తూటాలు... వివాదాలు, వ్యాఖ్యలు, విభిన్న హావభావాలు... ఈ టెస్టు గురించి ఏమని చెప్పగలం... తొలిరోజు 189 పరుగులకే ఆలౌటైన స్థితి నుంచి చివరకు ఆసీస్‌ను భారత్ చావుదెబ్బ కొట్టే వరకు ఎన్నో మలుపులు... చిన్నస్వామి మైదానం హోరెత్తుతుండగా, చివరకు టీమిండియానే ఈ పోటీలో సగర్వంగా నిలబడింది.
బెంగళూరు: బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో భారత్ మళ్లీ రేసులోకి వచ్చింది. సమష్టి వైఫల్యంతో ఆస్ట్రేలియా చేతిలో తొలి టెస్టులో చిత్తయిన భారత్, అదే సమష్టి ఆటతో రెండో మ్యాచ్‌లో ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం ఇక్కడ ముగిసిన రెండో టెస్టులో భారత్ 75 పరుగుల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించింది. 188 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (48 బంతుల్లో 28; 3 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (6/41) మరోసారి చెలరేగి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్ పుజారా (221 బంతుల్లో 92; 7 ఫోర్లు) సెంచరీ చేజార్చుకోగా... హాజల్‌వుడ్ (6/67) తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కీలక అర్ధసెంచరీలు చేసిన కేఎల్ రాహుల్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. తాజా ఫలితంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. మూడో టెస్టు ఈ నెల 16 నుంచి రాంచీలో జరుగుతుంది.
సెషన్–1: చెలరేగిన ఆసీస్ పేసర్లు
ఓవర్‌నైట్ స్కోరు 213/4తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ను స్టార్క్, హాజల్‌వుడ్ ఇబ్బంది పెట్టారు. పుజారా, రహానే ఐదో వికెట్‌కు 118 పరుగులు జోడించిన తర్వాత స్టార్క్ దెబ్బ తీశాడు. 128 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రహానే (134 బంతుల్లో 52; 4 ఫోర్లు)ను అవుట్ చేసిన స్టార్క్, తర్వాతి బంతికే కరుణ్ నాయర్ (0)ను బౌల్డ్ చేశాడు. తర్వాతి ఓవర్లోనే పుజారాను, అశ్విన్ (4)ను హాజల్‌వుడ్ పెవిలియన్ పంపించాడు. ఉమేశ్ (1) అవుటైన తర్వాత చివర్లో ఇషాంత్ (6) సహకారంతో సాహా (37 బంతుల్లో 20 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని కీలక పరుగులు జత చేశాడు. 36 పరుగుల వ్యవధిలో భారత్ తమ చివరి 6 వికెట్లు కోల్పోయింది.
ఓవర్లు: 25.1, పరుగులు: 61, వికెట్లు: 6
సెషన్–2: కుప్పకూలిన ఆసీస్
ఇషాంత్ తన మూడో ఓవర్లో చక్కటి బంతితో రెన్‌షా (5)ను అవుట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. అశ్విన్ బౌలింగ్‌లో దాదాపు ప్రతీ బంతికి ఇబ్బంది పడిన వార్నర్ (17) కాస్త సాహసం చేసి అతని బౌలింగ్‌లోనే ఒక భారీ సిక్స్ బాదాడు. కానీ అశ్విన్ తన తర్వాతి బంతికే వార్నర్‌ను ఎల్బీగా వెనక్కి పంపి కంగారూల పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత షాన్ మార్ష్(9) పని పట్టిన ఉమేశ్, రెండు ఓవర్ల తర్వాత స్మిత్‌ను దెబ్బ తీయడంతో ఆసీస్ కష్టాలు పెరిగాయి. మరోవైపు అసలే మాత్రం పరుగులు ఇవ్వకుండా జడేజా ప్రత్యర్థిని మరింత చికాకు పరిచాడు. అనంతరం అశ్విన్ వరుస ఓవర్లలో మిషెల్ మార్ష్ (13), వేడ్ (0)లను అవుట్ చేశాడు.
ఓవర్లు: 27.5, పరుగులు: 101, వికెట్లు: 6
సెషన్–3: ఖేల్ ఖతం
విరామం తర్వాత పది నిమిషాలకే ఆస్ట్రేలియా ఆట ముగిసింది. ముందుగా స్టార్క్ (1)ను అశ్విన్ బౌల్డ్ చేయగా, జడేజా బౌలింగ్‌లో ఒకీఫ్ (2) అవుటయ్యాడు. అప్పటి వరకు పోరాడుతూ వచ్చిన హ్యాండ్స్‌కోంబ్ (67 బంతుల్లో 24; 2 ఫోర్లు) అసహనంతో భారీ షాట్‌కు ప్రయత్నించి సాహాకు చిక్కగా... తన బౌలింగ్‌లోనే నాథన్ లయన్ (2) ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అందుకొని అశ్విన్ విజయనాదం చేశాడు.
ఓవర్లు: 7.5, పరుగులు: 11,వికెట్లు: 4
ఇదో తీపి విజయం. కచ్చితంగా కెప్టెన్‌గా నాకు ఇదే అత్యుత్తమ మ్యాచ్. భావోద్వేగాల పరంగా కూడా జట్టులో అందరికీ ఈ టెస్టు గుర్తుండిపోతుంది. నన్ను ఒక్కడినే పడగొడితే చాలు గెలుస్తామని అనుకోవద్దు. ఇదంతా సమష్టి కృషి. రెండో రోజు తొలి సెషన్‌లో కేవలం 47 పరుగులు ఇవ్వడంతోనే మ్యాచ్ మలుపు తిరిగింది. మేం వారికి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. 150కు పైగా పరుగుల లక్ష్యం ఉంటే చాలు మాకు అవకాశం ఉంటుందని తెలుసు. కానీ ఇంత సునాయాసంగా అదీ 75 పరుగుల తేడాతో గెలుస్తామని అనుకోలేదు. ఎవరి కోసమో కాకుండా మా కోసం గెలిచి చూపించాలనుకున్నాం. ఎలాంటి స్థితి నుంచైనా గెలవగలమని నిరూపించాం. రాంచీలో కూడా జోరు కొనసాగిస్తాం. ఎప్పుడెప్పుడు ఆడాలా అని ఉన్న నాకు ఎనిమిది రోజులు విరామం ఉండటం కష్టంగా అనిపిస్తోంది.
– విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
► 25 అశ్విన్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం ఇది 25వసారి. అందరికంటే వేగంగా (47 టెస్టులు) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రిచర్డ్ హ్యాడ్లీ (62 టెస్టుల్లో)ని అశ్విన్ అధిగమించాడు.
► 1 ఒకే టెస్టులో నాలుగు ఇన్నింగ్స్‌లలో నలుగురు వేర్వేరు బౌలర్లు కనీసం 6 వికెట్లు పడగొట్టడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో లయన్, జడేజా, హాజల్‌వుడ్, అశ్విన్ దీనిని నమోదు చేశారు.
► 5 భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బిషన్ సింగ్ బేడి (266)ని దాటి అశ్విన్ (269) ఐదో స్థానానికి చేరుకున్నాడు. కుంబ్లే, కపిల్, హర్భజన్, జహీర్ వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. భారత గడ్డపైనే కేవలం 30 టెస్టుల్లో అతను 202 వికెట్లు తీయడం విశేషం.
►1 భారత్‌లో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న విదేశీ జట్టుగా ఆస్ట్రేలియా(20) నిలిచింది. ఇంగ్లండ్ 19 మ్యాచ్‌లు ఓడింది.