హాకీ ప్రపంచ కప్‌ క్వార్టర్స్‌లో భారత్‌ | India Beat Italy 3-0 To Qualify For Quarter-Finals | Sakshi
Sakshi News home page

హాకీ ప్రపంచ కప్‌ క్వార్టర్స్‌లో భారత్‌

Published Wed, Aug 1 2018 1:13 AM | Last Updated on Wed, Aug 1 2018 1:13 AM

India Beat Italy 3-0 To Qualify For Quarter-Finals - Sakshi

లండన్‌: చావో రేవో మ్యాచ్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. హాకీ ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ కోసం మంగళవారం నిర్వహించిన క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌లో రాణి రాంపాల్‌ నాయకత్వంలోని భారత మహిళల జట్టు 3–0 గోల్స్‌ తేడాతో ఇటలీ జట్టును ఓడించింది. భారత్‌ తరఫున లాల్‌రెమ్‌సియామి (9వ ని.లో), నేహా గోయల్‌ (45వ ని.లో), వందన కటారియా (55వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. ఈ విజయంతో భారత్‌ 1974 తర్వాత ప్రపంచకప్‌లో మరోసారి క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. 1974లో జరిగిన తొలి మహిళల ప్రపంచకప్‌లో భారత్‌ సెమీఫైనల్లో ఓడిపోయి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఏనాడూ లీగ్‌ దశను అధిగమించలేకపోయిం ది. మళ్లీ 44 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టీమిండియా నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. 

ఇటలీతో జరిగిన పోరులో భారత్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. సమన్వయంతో ముందుకు సాగుతూ అవకాశం దొరికినపుడల్లా ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌పై దాడులు చేసింది. 9వ నిమిషంలో లాల్‌రెమ్‌సియామి చేసిన గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. అనంతరం 45వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను నేహా లక్ష్యానికి చేర్చగా... 55వ నిమిషంలో లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను వందన కటారియా గోల్‌గా మలిచింది. ఆ తర్వాత ఐదు నిమిషాల్లోనూ భారత్‌ తమ ఆధిపత్యాన్ని కొనసాగించి 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ఐర్లాండ్‌తో భారత్‌ తలపడుతుంది. పూల్‌ ‘బి’లో ఐర్లాండ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 0–1తో ఓడిపోయింది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement