ఎన్నాళ్లయిందో బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ నిబ్బరం చూసి! ఎన్ని ఇన్నింగ్స్‌లయ్యాయో అతడింత సంయమనంగా ఆడి! సిక్సర్ల జోరు, బౌండరీల మెరుపుల్లేకుండా ఎంత నిగ్రహంగా నిలిచాడో! ప్రపంచ కప్‌లో భారత్ ఏమైతే కోరుకుంటోందో అదే జరిగిన వేళ... అలవోక విజయంతో జట్టు టైటిల్ వేట ఆశావహంగా ప్రారంభమైంది. భారీ స్కోర్ల మైదానంగా పేరున్న రోజ్‌బౌల్ అందుకు భిన్నంగా స్పందించినా... యజువేంద్ర చహల్ మాయాజాలం, బుమ్రా మెరుపులు, రోహిత్ పోరాటంతో దక్షిణాఫ్రికాపై టీమిండియా సమయోచితంగా ఆడి గెలుపును సొంతం చేసుకుంది.
మ్యాచ్‌లో ఇరు జట్ల ఆట కంటే వాతావరణం గురించే ఎక్కువ చెప్పుకోవాలేమో...? మబ్బులు కమ్మి శీతల గాలులతో అంతగా పరిస్థితులను మార్చింది మరి. అదనపు బౌన్స్, స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టింది. దీంతో క్యాచ్‌ల కోసం టెస్టుల తరహాలో మూడు స్లిప్‌లలో ఫీల్డర్లను మోహరించారు. చల్లదనంతో ఆటగాళ్లు పదేపదే చేతులను రుద్దుకున్నారు. దీంతో ఊహించిన దానికంటే తక్కువ స్కోర్లే నమోదయ్యాయి.
సౌతాంప్టన్: అంచనాలకు తగ్గకుండా ఆడి... ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ఆటతో తమ తొలి మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించింది. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ (144 బంతుల్లో 122 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో రాణించిన వేళ దక్షిణాఫ్రికాతో బుధవారం ఇక్కడి రోజ్‌బౌల్ మైదానంలో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్లతో జయభేరి మోగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు... మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ (4/51) మాయాజాలం, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (2/35) పకడ్బందీ బౌలింగ్‌తో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.
8వ నంబరు బ్యాట్స్‌మన్ క్రిస్ మోరిస్ (34 బంతుల్లో 42; ఫోర్, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. రబడ (35 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు)తో అతడు జోడించిన 66 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. కెప్టెన్ డు ప్లెసిస్ (54 బంతుల్లో 38; 4 ఫోర్లు), ఫెలుక్వాయో (61 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్) మోస్తరుగా ఆడారు. భువనేశ్వర్ (2/44) ఆఖర్లో రెండు వికెట్లు తీశాడు. ఛేదనలో రోహిత్ శతకానికి రాహుల్ (42 బంతుల్లో 26; 2 ఫోర్లు), ధోని (46 బంతుల్లో 34; 2 ఫోర్లు) అండగా నిలవడంతో భారత్ 47.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 230 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. రోహిత్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. టీమిండియా తదుపరి మ్యాచ్‌ను లండన్‌లో ఈ నెల 9న ఆస్ట్రేలియాతో ఆడనుంది.
మొదట బుమ్రా, మధ్యలో చహల్...
గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించి దెబ్బతిన్న పరిణామమేమో కాని... మబ్బులు కమ్మిన వాతావరణం ఉన్నప్పటికీ, బుధవారం టాస్ నెగ్గగానే డు ప్లెసిస్ బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. కానీ భువీ, బుమ్రాను ఎదుర్కొనడం సఫారీ ఓపెనర్లు ఆమ్లా (9 బంతుల్లో 6; ఫోర్), డికాక్ (17 బంతుల్లో 10; ఫోర్)లకు కత్తిమీద సామే అయింది. గుడ్ లెంగ్త్‌లో ఆఫ్ స్టంప్‌కు దూరంగా బుమ్రా వేసిన బంతి అదనపు బౌన్స్‌తో ఆమ్లా బ్యాట్ అంచును తాకుతూ రాగా రెండో స్లిప్‌లో రోహిత్ ఒడిసి పట్టాడు.
బుమ్రా మరుసటి ఓవర్లో ఫుల్ లెంగ్త్ బంతితో డికాక్‌ను పెవిలియన్ చేర్చాడు. ఈ క్యాచ్‌ను మూడో స్లిప్‌లో కోహ్లి అందుకున్నాడు. ప్రధాన పేసర్ల తొలి స్పెల్ పూర్తికాక ముందే ఓపెనర్లు ఔటైన పరిస్థితుల్లో డు ప్లెసిస్, డసెన్ (22) నిలిచారు. పది ఓవర్ల పవర్ ప్లే పూర్తయ్యేసరికి జట్టు స్కోరు 34/2 మాత్రమే. కుల్దీప్, పాండ్యా బౌలింగ్‌లో ఇబ్బంది పడుతూనే ఈ జోడీ మూడో వికెట్‌కు 54 పరుగులు జత చేసింది. ఈ దశలో చహల్ రంగప్రవేశం ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పింది. అతడు వేసిన 20వ ఓవర్ మొదటి బంతిని రివర్స్ స్వీప్‌కు యత్నించి డసెన్ బౌల్డ్ కాగా, గుగ్లీగా వచ్చిన చివరి బంతి డు ప్లెసిస్ వికెట్లను గిరాటేసింది.
డుమిని (3)ని కుల్దీప్ ఎల్బీగా పంపాడు. దీనిపై రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. మిల్లర్ (40 బంతుల్లో 31; 1 ఫోర్), ఫెలుక్వాయో 12 ఓవర్ల పైగా నిలిచి 46 పరుగులు జోడించారు. మరోసారి చహల్ మాయాజాలం చూపి వీరిద్దరినీ ఔట్ చేశాడు. 158/7తో ఒకదశలో దక్షిణాఫ్రికా తక్కువ స్కోరుకే చాపచుట్టేసేలా కనిపించింది. మోరిస్, రబడ జంట భారత బౌలర్లందరినీ తట్టుకుని 59 బంతులు ఆడి స్కోరును 200 దాటించింది. చివరి ఓవర్లో మోరిస్, తాహిర్ (0)లను భువీ ఔట్ చేశాడు.
ఛేదన కష్టమైంది...
స్కోరు చిన్నదే అయినా దానిని అందుకోవడంలో భారత్‌కు తిప్పలు తప్పలేదు. పిచ్‌ను సద్వినియోగం చేసుకున్న ప్రత్యర్థి పేసర్లు రబడ (2/39), మోరిస్ (1/36) చుక్కలు చూపారు. వీరి ధాటికి శిఖర్ ధావన్ (12 బంతుల్లో 8; ఫోర్) చేతులెత్తేశాడు. కోహ్లి (34 బంతుల్లో 18; 1 ఫోర్) తన ఆఫ్ స్టంప్ బలహీనత చాటుకుంటూ... డికాక్ పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. కానీ, రోహిత్ దృఢ సంకల్పంతో నిలిచాడు. ఇరు జట్ల గెలుపు అవకాశాలు చెరి సగం ఉన్న దశలో రాహుల్‌తో కలిసి మూడో వికెట్‌కు 96 బంతుల్లో 85 పరుగులు జోడించి మ్యాచ్ భారత్ వైపు మొగ్గేలా చేసాడు.
అనంతరం ధోనితో కలిసి 74 పరుగులు జత చేసి విజయం ఖాయం చేశాడు. 48 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన దశలో వీరిద్దరూ దూకుడుగా ఆడి లక్ష్యాన్ని కరిగించారు. అంతకుముందు 70 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను చేరుకున్న రోహిత్... రెండో ఫిఫ్టీని 58 బంతుల్లోనే అందుకుని సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (7 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) ఫటాఫట్ బౌండరీలతో మ్యాచ్‌ను ముగించాడు.
ఊపొచ్చింది... మజా లేదు
ప్రపంచ కప్ ప్రారంభమైన వారం రోజులకు... అది కూడా టీమిండియా ఆడుతుందనగానే మన ప్రేక్షకులకు ఊపొచ్చింది. ప్రారంభ ఉత్కంఠను అధిగమించి మ్యాచ్ గెలిచినా వారు కోరుకున్నంత మజా మాత్రం రాలేదు. త్వరత్వరగా వికెట్లు కోల్పోయిన సఫారీల నుంచి పెద్దగా ప్రతిఘటన, మెరుపులు లేకపోవడం, నత్తనడక రన్‌రేట్‌తో ఓ స్థితిలో మ్యాచ్ బోర్ కొట్టించింది. భారత ఇన్నింగ్స్‌లో ధావన్, కోహ్లి వికెట్లు కోల్పోయిన తర్వాత కాస్త చురుకు పుట్టింది. పిచ్ క్లిష్టంగా ఉండటంతో రోహిత్ సైతం ఎదుర్కొన్న తొలి 22 బంతుల్లో 5 పరుగులే చేయగలిగాడు. కోహ్లి (తొలి 32 బంతుల్లో 14)దీ ఇదే పరిస్థితి. కుదురుకున్నాక, ముఖ్యంగా అర్ధ సెంచరీ దాటాక రోహిత్ స్పిన్నర్లు షమ్సీ, తాహిర్ బౌలింగ్‌లో కట్ షాట్లతో బౌండరీలు కొట్టి తన క్లాస్ చూపాడు. దీంతో కొంత అనుభూతి మిగిలింది.
సరైన సమయంలో...
కొన్నాళ్లుగా భారత విజయాల్లో టాప్–3 బ్యాట్స్‌మెన్‌దే కీలక పాత్ర. అయితే, ఈ మ్యాచ్‌లో ధావన్ నిరాశపర్చాడు. కోహ్లి విఫలమయ్యాడు. రోహిత్ మాత్రం సెంచరీతో హిట్ కొట్టాడు. 145 కి.మీ.పైగా వేగంతో వచ్చిన రబడ మెరుపు బంతులను, పదునుగా కనిపించిన మోరిస్ బౌలింగ్‌ను తట్టుకుని మరీ పరీక్ష గట్టెక్కాడు. ఐపీఎల్ సహా ఇటీవల ఫామ్ లేమితో సతమతం అవుతున్న అతడు సరైన సమయంలో నిలిచి గెలిపించాడు.
తన ఆటతో జట్టు నెత్తిన పాలు పోశాడు. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన అతడికి ఈ క్రమంలో అదృష్టం కూడా తోడైంది. నాలుగుసార్లు క్యాచ్ ఔట్ ప్రమాదాన్ని తప్పించుకున్న హిట్‌మ్యాన్, ఒకసారి రివ్యూ నుంచి నాటౌట్‌గా బయట పడ్డాడు. మరోసారి రనౌట్ నుంచి గట్టెక్కాడు. ఏదేమైనా కప్ తొలి మ్యాచ్‌లోనే రోహిత్ టచ్‌లోకి రావడం టీమిండియాకు పెద్ద బలం.
ఆ క్యాచ్ పట్టి ఉంటే...
మ్యాచ్‌లో సెంచరీతో భారత గెలుపులో కీలక పాత్ర పోషించిన రోహిత్ వాస్తవానికి రబడ మొదటి ఓవర్లోనే ఔట్ కావాల్సింది. అప్పటికి అతడి స్కోరు 1 మాత్రమే. రబడ వేసిన బంతిని రోహిత్ ఫుల్‌షాట్ ఆడబోగా అది గ్లోవ్స్‌కు తగిలి రెండో స్లిప్ దిశగా గాల్లో లేచింది. డు ప్లెసిస్ నెమ్మదిగా కదలడంతో అందుకునే అవకాశం లేకపోయింది. వాస్తవానికి అద్భుత ఫీల్డరైన డుప్లెసిస్ తేలికైన క్యాచ్‌ను జారవిడిచి జట్టుకు కోలుకోలేని నష్టం చేశాడు. సరిగ్గా ఆరు బంతుల తర్వాత మోరిస్ ఓవర్లో డుమిని ఓ క్లిష్టమైన క్యాచ్‌ను పట్టలేకపోయాడు. ఈ రెండు దక్షిణాఫ్రికాకు మ్యాచ్‌ను చేజార్చాయని చెప్పొచ్చు.
పిచ్ సవాల్ విసరడంతో మ్యాచ్ చాలెంజింగ్‌గా సాగింది. రోహిత్‌కు హ్యాట్సాఫ్. టాస్ గెలిచి ఉంటే బౌలింగే చేసేవాళ్లం. బుమ్రా బౌలింగ్‌లో డికాక్ క్యాచ్ అందుకున్న 15 నిమిషాల తర్వాత సైతం నా చేతులు సాధారణ స్థితికి రాలేదు. ఆమ్లాను అతడు ఔట్ చేసిన తీరును వన్డేల్లో నేనింతవరకు చూడలేదు. దీన్నిబట్టి బుమ్రా ఓ ప్రత్యేక శ్రేణిలో ఉన్నాడని చెప్పొచ్చు. చహల్ అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లోనూ జట్టుగా రాణించాం. మేం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం.
–విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
పాపం దక్షిణాఫ్రికా...
ఆటగాళ్ల తప్పిదాలు, ప్రకృతి శాపాలతో ప్రపంచ కప్‌కు ఎప్పుడూ దురదృష్టాన్ని నెత్తిన పెట్టుకెళ్లే దక్షిణాఫ్రికా ఈసారి ఏకంగా ఉదాసీనతనూ మోసుకొచ్చినట్లుంది. ఆ జట్టు టోర్నీలో ఉందన్న మాటే కానీ, ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన పరిస్థితుల్లో మిగతా ఆరూ గెలిస్తే కానీ సెమీస్ చేరే అవకాశం లేదు. సఫారీలు ఇప్పుడున్న ఫామ్‌లో ఇది ఊహకు కూడా అందని విషయం. కప్‌కు ముందే ఫిలాండర్, నోర్జ్టె దూరం కాగా, కప్ జరుగుతుండగా ప్రధాన పేసర్లు స్టెయిన్, ఇన్‌గిడి ఔటయ్యారు.
ఇది డుప్లెసిస్ సేనను కోలుకోలేని దెబ్బతీసింది. అటు బ్యాటింగ్‌లోనూ పేలవ ప్రదర్శనే. నిలకడకు మారుపేరైన ఆమ్లా పనైపోయినట్లుంది. అనుభవజ్ఞులైన డుమిని, మిల్లర్‌లది సంపూర్తి వైఫల్యం. డికాక్, డుప్లెసిస్ అవసరమైన సమయంలో ఆడలేకపోయారు. మొత్తం సఫారీ ఆటగాళ్ల కళ్లలో కసి లేదు. ప్రతిష్ఠాత్మక కప్ అన్న స్పృహే వారిలో లేదు. భారత్‌తో మ్యాచ్‌లో అతి పేలవమైన వారి ఫీల్డింగ్ చూస్తేనే ఈ విషయం తెలిసిపోతోంది. బహుశా ఈ ప్రపంచ కప్‌లో సఫారీలు సెమీస్ రేస్ నుంచి పక్కకు వెళ్లిపోయినట్టే అనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment