ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత అమ్మాయిలు టి20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయం సాధించారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ బృందం ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బంతితో కట్టడి చేసి... ఆ తర్వాత బ్యాట్‌తో చితక్కొట్టి... గత ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకుంది.
ప్రొవిడెన్స్ (గయానా): సొంతగడ్డపై పురుషుల జట్టు వెస్టిండీస్‌ను చిత్తు చేసి సిరీస్ సొంతం చేసుకుంటే... విండీస్ గడ్డపై భారత అమ్మాయిలు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పని పట్టారు. గ్రూప్ ‘బి’లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్‌లో హర్మన్ తుపాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగితే... రెండో మ్యాచ్‌లో వెటరన్ మిథాలీ రాజ్ (47 బంతుల్లో 56; 7 ఫోర్లు) ఆ బాధ్యత తీసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.
బిస్మా మారూఫ్ (49 బంతుల్లో 53; 4 ఫోర్లు), నిదా దార్ (35 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ (2/22), హేమలత (2/34) ఆకట్టుకున్నారు. పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పిచ్‌పై డేంజర్ ఏరియాలో పరిగెత్తినందుకుగాను పెనాల్టీగా అంపైర్లు భారత జట్టుకు 10 పరుగులు అదనంగా కేటాయించారు. లక్ష్య ఛేదనలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’మిథాలీ రాజ్, స్మృతి మంధాన (26; 4 ఫోర్లు), చెలరేగడంతో భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లకు 137 పరుగులు చేసి గెలుపొందింది. తదుపరి మ్యాచ్‌లో గురువారం ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది.
ఆ ఇద్దరే...
గత మ్యాచ్ మాదిరిగానే భారత్ ఒకే ఒక్క పేస్ బౌలర్‌తో బరిలో దిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి (1/24) అయేషా జఫర్ (0) వికెట్ పడగొట్టింది. అనంతరం భారత్ చురుకైన ఫీల్డింగ్‌కు ఉమైమా (3), కెప్టెన్ జవేరియా ఖాన్ (17) రనౌట్‌గా వెనుదిరిగారు. దీంతో పాక్ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బిస్మా, నిదా సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. నిదా 15 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను వేద కృష్ణమూర్తి, 29 పరుగుల వద్ద మరో క్యాచ్‌ను పూనమ్ వదిలేశారు.
దీన్ని సద్వినియోగం చేసుకున్న ఆమె భారీ షాట్లతో చెలరేగింది. 28 పరుగుల వద్ద క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన బిస్మా 44 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 93 పరుగులు జోడించాక హేమలత వేసిన 19వ ఓవర్ తొలి బంతికి బిస్మా మారూఫ్ పెవిలియన్ చేరింది. మరుసటి బంతికే నిదా దార్ సిక్సర్‌తో అర్ధశతకం పూర్తి చేసుకున్నా ఆ వెంటనే ఆమె కూడా వెనుదిరిగింది. చివరి ఓవర్‌లో పూనమ్ యాదవ్ మరో రెండు వికెట్లు పడగొట్టింది.
మిథాలీ మెరుపులు...
ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ముందే భారత్ ఖాతాలో 10 పరుగులు చేరడంతో ఓపెనర్లు మిథాలీ, స్మృతి ధాటిగా ఆడారు. రెండో ఓవర్‌లో స్మృతి రెండు ఫోర్లు... నాలుగో ఓవర్‌లో మిథాలీ రెండు బౌండరీలు కొట్టడంతో పవర్‌ప్లేలో భారత్ 48/0తో నిలిచింది. ఎనిమిదో ఓవర్‌లో మిథాలీ మరో రెండు ఫోర్లు బాది దూకుడు పెంచింది. తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించాక స్మృతి భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయింది. ఆ తర్వాత ఆచితూచి ఆడిన మిథాలీ... జెమీమా రోడ్రిగ్స్ (16; 1 ఫోర్)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది.
ఈ క్రమంలో 42 బంతుల్లో మిథాలీ అర్ధశతకం పూర్తి చేసుకుంది. విజయానికి 14 బంతుల్లో 18 పరుగులు అవసరమైన దశలో మిథాలీ వెనుదిరిగినా... వేద (8)తో కలిసి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (14 నాటౌట్; 2 ఫోర్లు) మిగతా పని పూర్తిచేసింది.
స్కోరు వివరాలు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: అయేషా (సి) వేద (బి) అరుంధతి రెడ్డి 0; జవేరియా (రనౌట్) 17; ఉమైమా (రనౌట్) 3; బిస్మా (సి) వేద (బి) హేమలత 53; నిదా దార్ (సి) హర్మన్ (బి) హేమలత 52; ఆలియా (స్టంప్డ్) తాన్యా (బి) పూనమ్ 4; నహిద ఖాన్ (నాటౌట్) 0; సనా (స్టంప్డ్) తాన్యా (బి) పూనమ్ 0; సిద్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 133.
వికెట్ల పతనం: 1–0, 2–10, 3–30, 4–123, 5–129, 6–133, 7–133.
బౌలింగ్: అరుంధతి రెడ్డి 4–1–24–1, రాధ యాదవ్ 4–0–26–0, దీప్తి శర్మ 4–0–26–0, హేమలత4–0–34–2, పూనమ్ యాదవ్ 4–0–22–2.
భారత్ ఇన్నింగ్స్: మిథాలీ రాజ్ (సి) నిదా (బి) డయాన బేగ్ 56; స్మృతి (సి) ఉమైమా (బి) బిస్మా 26; జెమీమా (సి అండ్ బి) నిదా 16; హర్మన్ (నాటౌట్) 14; వేద (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (19 ఓవర్లలో 3 వికెట్లకు) 137.
వికెట్ల పతనం: 1–73, 2–101, 3–126.
బౌలింగ్: డయానా బేగ్ 3–0–19–1, ఆనమ్ 3–0–27–0, సనా మిర్ 4–0–22–0, నిదా 4–0–17–1, ఆలియా 2–0–21–0, బిస్మా మారూఫ్ 3–0–21–1.
Comments
Please login to add a commentAdd a comment