పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌పై భారత్ విజయం పరిపూర్ణమైంది. తొలి రెండు టి20లను గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న తర్వాత కూడా టీమిండియా ఎక్కడా తగ్గలేదు. చివరి మ్యాచ్‌లోనూ కోహ్లి సేన తమ స్థాయికి తగ్గ ఆటతో ప్రత్యర్థిని చిత్తు చేసి 3–0తో పోరును ముగించింది. గత రెండు మ్యాచ్‌లతో పోలిస్తే ఈ సారి కొంత మెరుగైన ప్రదర్శన కనబర్చినా... చివరకు విండీస్‌కు సొంతగడ్డపైనా విజయం దక్కలేదు. దీపక్ చహర్ అద్భుత బౌలింగ్‌తో ఆరంభంలోనే దెబ్బ తిన్న విండీస్ సాధారణ స్కోరుకే పరిమితం కాగా... కోహ్లి, పంత్ శతక భాగస్వామ్యంతో భారత్‌ను గెలిపించారు. ఇక భారత్ తర్వాతి లక్ష్యం వన్డే సిరీస్‌లో సత్తా చాటడమే.
ప్రొవిడెన్స్ (గయానా): వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌లో సాధికారిక ఆటను ప్రదర్శించిన భారత్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన మూడో టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (45 బంతుల్లో 58; 1 ఫోర్, 6 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, రావ్‌మన్ పావెల్ (20 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు.
భారత బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’దీపక్ చహర్ 3, సైనీ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (42 బంతుల్లో 65 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లి (45 బంతుల్లో 59; 6 ఫోర్లు) మూడో వికెట్‌కు 77 బంతుల్లోనే 106 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. గురువారం ఇదే మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌తో ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది.
విండీస్ సిక్సర్ల మోత...
వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు మాత్రమే ఉండగా, 11 సిక్సర్లు నమోదు కావడం విశేషం. ఇందులో ఆరు పొలార్డ్ ఒక్కడే బాదాడు. తొలి టి20లో త్రుటిలో అర్ధసెంచరీ చేజార్చుకున్న పొలార్డ్ ఈ మ్యాచ్‌లోనూ దూకుడు ప్రదర్శించాడు. దీపక్ చహర్ (3/4) దెబ్బకు 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తన జట్టును అతను ఆదుకున్నాడు. సైనీ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో ఖాతా తెరిచిన పొలార్డ్, రాహుల్ చహర్ ఓవర్లో మరో రెండు సిక్స్‌లు బాదాడు. పొలార్డ్, పూరన్ (23 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 56 బంతుల్లో 66 పరుగులు జోడించడంతో విండీస్ కోలుకుంది.
పూరన్ వెనుదిరిగిన తర్వాత కృనాల్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో 40 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పొలార్డ్... అదే ఓవర్లో మరో సిక్సర్ కొట్టాడు. ఏడున్నరేళ్ల తర్వాత పొలార్డ్ అంతర్జాతీయ టి20ల్లో అర్ధసెంచరీ నమోదు చేయడం విశేషం! చివరకు అతను సైనీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తన బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన కెప్టెన్ బ్రాత్‌వైట్ (10)ను తర్వాతి బంతికే ఔట్ చేసి రాహుల్ చహర్ తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. అయితే సైనీ వేసిన ఆఖరి ఓవర్లో పావెల్ రెండు భారీ సిక్సర్లతో చెలరేగడంతో విండీస్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. 14 ఓవర్ల వరకు 6 రన్‌రేట్‌ను దాటలేకపోయిన విండీస్... చివరి 6 ఓవర్లలో 62 పరుగులు చేసింది.
భారీ భాగస్వామ్యం
ఇన్నింగ్స్ మూడో బంతికే రాహుల్ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) భారీ సిక్సర్ కొట్టడంతో భారత్ ఖాతా తెరవగా, తర్వాతి ఓవర్లో శిఖర్ ధావన్ (3) వెనుదిరిగాడు. కొద్ది సేపటికి అలెన్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన రాహుల్ కూడా డగౌట్ చేరాడు. ఈ స్థితిలో కోహ్లి, పంత్ ప్రశాంతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. కోహ్లి చూడచక్కటి షాట్లు కొట్టగా... పంత్ గత రెండు మ్యాచ్‌లకు భిన్నంగా ఈ సారి జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. నిలదొక్కుకున్న తర్వాత కీమో పాల్ బౌలింగ్‌లో సిక్స్‌తో దూకుడు పెంచాడు.
పాల్ తర్వాతి ఓవర్లో వీరిద్దరు సిక్స్, ఫోర్‌తో 14 పరుగులు రాబట్టారు. నరైన్ బౌలింగ్‌లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా ఫోర్ కొట్టడంతో 37 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తయింది. అంతర్జాతీయ టి20ల్లో అతనికి ఇది 21వ హాఫ్ సెంచరీ. ఆ వెంటనే పంత్ 37 బంతుల్లో తన రెండో అర్ధసెంచరీని అందుకున్నాడు. విజయానికి చేరువైన దశలో కోహ్లి వెనుదిరిగినా... మనీశ్ పాండే (2 నాటౌట్)తో కలిసి పంత్ మ్యాచ్ ముగించాడు. బ్రాత్‌వైట్ వేసిన చివరి ఓవర్ తొలి బంతిని పంత్ భారీ సిక్సర్ బాదడంతో టీమిండియా గెలుపు పూర్తయింది.
దీపక్ సూపర్ స్పెల్...
2019 ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శనతో మళ్లీ భారత జట్టులోకి వచ్చిన పేసర్ దీపక్ ఏడాది విరామం తర్వాత తన రెండో టి20 మ్యాచ్ ఆడాడు. అరంగేట్ర మ్యాచ్‌లో (ఇంగ్లండ్‌పై) 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి పేలవ ప్రదర్శన కనబర్చిన దీపక్ ఈ మ్యాచ్‌ను మాత్రం చిరస్మరణీయం చేసుకున్నాడు. తన తొలి ఓవర్లోనే నరైన్ (2) వికెట్ తీసిన అతను, రెండో ఓవర్ మరింత అద్భుతంగా వేశాడు. లూయిస్ (10), హెట్‌మైర్ (1)లను ఎల్బీడబ్ల్యూలుగా ఔట్ చేయడంతో పాటు మెయిడిన్‌గా ముగించాడు. మూడో ఓవర్లో కూడా ఒక్క పరుగే ఇచ్చిన దీపక్ గణాంకాలు 3–1–4–3 కావడం విశేషం. ఇంత అద్భుత స్పెల్ తర్వాత అనూహ్యంగా అతడిని తప్పించిన కోహ్లి చివర్లో మరో ఓవర్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
భారత్ తరఫున 81వ ప్లేయర్‌గా రాహుల్ చహర్
గయానాలో వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో టి20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 81వ క్రికెటర్‌గా అతను గుర్తింపు పొందాడు. టాస్ వేయడానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా రాహుల్ చహర్ టీమిండియా క్యాప్‌ను అందుకున్నాడు. భారత్ తరఫున టి20ల్లో అరంగేట్రం చేసిన నాలుగో పిన్న వయస్కుడిగా రాహుల్ (20 ఏళ్ల 2 రోజులు) నిలిచాడు. ఈ జాబితాలో వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు), రిషభ్ పంత్ (19 ఏళ్ల 120 రోజులు), ఇషాంత్ శర్మ (19 ఏళ్ల 152 రోజులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. సోదరుడు దీపక్ చహర్‌తో కలిసి అతను ఈ మ్యాచ్‌లో ఆడటం విశేషం. అయితే వీరిద్దరు సొంత అన్నదమ్ములు కాదు. కజిన్స్ మాత్రమే. వీరిద్దరి తండ్రులు సొంత అన్నదమ్ములు, తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు కావడం మాత్రం మరో విశేషం.
స్కోరు వివరాలు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: లూయిస్ (ఎల్బీ) (బి) దీపక్ చహర్ 10; నరైన్ (సి) సైనీ (బి) దీపక్ చహర్ 2; హెట్‌మైర్ (ఎల్బీ) (బి) దీపక్ చహర్ 1; పొలార్డ్ (బి) సైనీ 58; పూరన్ (సి) పంత్ (బి) సైనీ 17; రావ్‌మన్ పావెల్ (నాటౌట్) 32; బ్రాత్‌వైట్ (సి) సుందర్ (బి) రాహుల్ చహర్ 10; అలెన్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 146.
వికెట్ల పతనం: 1–4; 2–13; 3–14; 4–80; 5–105; 6–119.
బౌలింగ్: భువనేశ్వర్ 3–0–19–0; దీపక్ చహర్ 3–1–4–3; సైనీ 4–0–34–2; రాహుల్ చహర్ 3–0–27–1; వాషింగ్టన్ సుందర్ 3–0–23–0; కృనాల్ పాండ్యా 4–0–35–0.
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) పూరన్ (బి) అలెన్ 20; ధావన్ (సి) కాట్రెల్ (బి) థామస్ 3; కోహ్లి (సి) లూయిస్ (బి) థామస్ 59; పంత్ (నాటౌట్) 65; మనీశ్ పాండే (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 150.
వికెట్ల పతనం: 1–10; 2–27; 3–133.
బౌలింగ్: కాట్రెల్ 4–0–26–0; థామస్ 4–0–29–2; అలెన్ 3–0–18–1; నరైన్ 4–0–29–0; బ్రాత్‌వైట్ 2.1–0–25–0; కీమో పాల్ 2–0–23–0.
Comments
Please login to add a commentAdd a comment