వీళ్లతో గెలుస్తామా..?
అశ్విన్ మినహా బౌలర్లంతా పేలవం
టి20 ప్రపంచ కప్ ముంగిట ఇబ్బంది
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో భారత్ ఒక్క బౌలర్‌తోనే ఆడుతోంది..! అతిశయోక్తిలా అనిపించినా వాస్తవం ఇలాగే ఉంది. ఒక్క అశ్విన్‌ను మినహాయిస్తే మిగిలిన నలుగురు బౌలర్లూ దారుణంగా తేలిపోయారు. వీళ్లకంటే స్కూల్ పిల్లలు నయమనే తరహాలో బౌలింగ్ చేస్తూ... టి20 ఫార్మాట్‌లో మన బౌలింగ్ స్థాయి ఎక్కడుందో చూపించారు. ఆరు నెలల్లో స్వదేశంలోనే టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ బౌలింగ్ లైనప్‌తో ఎలా గెలుస్తారనేదే ప్రశ్న.
సాక్షి క్రీడా విభాగం
కటక్‌లో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో 20 ఏళ్ల దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కాగిసో రబడ 140 కిలో మీటర్ల వేగంతో బంతులు వేస్తూ... అడపా దడపా 150 కి.మీ.ని దాటి బంతులు విసిరాడు. ఇక బౌన్స్ ఉన్న ధర్మశాలలో అయితే అతని బంతులను అందుకునేందుకు కీపర్ డివిలి యర్స్ చాలా సార్లు ఆకాశాన్ని అందుకోవాలా అన్నట్లుగా ఎగరాల్సి వచ్చింది. పలు సార్లు చక్కటి బౌన్సర్‌లతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన రబడ అంపైర్ హెచ్చరికకు కూడా గురయ్యాడు. అదే మన పేసర్లు భువనేశ్వర్, మోహిత్, అరవింద్ కలిసి ఒక్కటంటే ఒక్క బౌన్సర్ కూడా వేసింది లేదు! ఆశ్చర్యమే అనిపిస్తున్నా మనోళ్ల పేస్ అంటే నేతి బీరకాయలో నేయి చందమే. కచ్చితంగా వికెట్ దక్కాల్సిన అవసరం లేదు కానీ.... 120 బంతుల ఇన్నింగ్స్‌లో ఇలాంటి పరుగు రాని బంతుల విలువ ఎక్కువే ఉంటుంది. పైగా బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలో నెట్టేందుకు ఇవి చాలు. స్టార్ బౌలర్లు స్టెయిన్, మోర్నీ మోర్కెల్, ఫిలాండర్ లేకుండా దక్షిణాఫ్రికా ద్వితీయ శ్రేణి పేసర్లు కూడా ప్రభావం చూపిస్తున్న చోట మనోళ్లు తేలిపోతున్నారు.
ఉమేశ్ పనికి రాడా..?‘మా ఫాస్ట్ బౌలర్లపై విశ్వాసం కోల్పోలేదు. సిరీస్ జరుగుతున్న పిచ్‌లను బట్టి జట్టును ఎంపిక చేశాం. ఇషాంత్ పేరు కూడా చర్చించాం. అతడు టెస్టులకే పరిమితం కాదు’... టి20 సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన అనంతరం చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ వ్యాఖ్య ఇది. అయితే ఈ లాజిక్‌లో అర్థం లేకపోవడంతో పాటు గందరగోళం కూడా కనిపిస్తోంది. సాధారణంగా అందుబాటులో ఉన్న (ఫిట్‌నెస్ సమస్యలు లేకుండా) అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలనేది ప్రాథమిక సూత్రం. అయితే ఈ సిరీస్‌లో ఉన్న భువీ, మోహిత్, అరవింద్ ఒకే తరహాలో బౌలింగ్ చేసే సాధారణ మీడియం పేసర్లు. ఎక్కువగా స్వింగ్‌పై ఆధారపడేవారే. తమ వేగంతో ఫలితం రాబట్టగల సామర్థ్యం వీరిలో లేదు. అలాంటప్పుడు ఒక ఫుల్‌లెంగ్త్ ఫాస్ట్ బౌలర్ జట్టులో ఉండాలి. ఉమేశ్ చాలా కాలంగా జట్టులో రెగ్యులర్ సభ్యుడు. వరల్డ్ కప్‌లో చాలా బాగా రాణించాడు. దీనికి ముందు శ్రీలంక సిరీస్‌లోనూ జట్టులో ఉన్నాడు. టి20 స్పెషలిస్ట్‌లు అని పేరు లేకపోయినా... ఇషాంత్, ఆరోన్ తమ వేగంతో బౌలింగ్‌కు వైవిధ్యం తీసుకు రాగలరు. వీరిని ఎందుకు పక్కన పెట్టారో కూడా కనీస కారణం సెలక్టర్లు చెప్పలేకపోయారు.
స్పిన్నర్లు ఎక్కడ?
మన దేశంలో నాణ్యమైన స్పిన్నర్లు లేరు అంటూ అధ్యక్షుడిగా వచ్చీ రాగానే శశాంక్ మనోహర్ వ్యాఖ్యానించడం ఒక రకంగా అవమానకర విషయం. జడేజాకు ప్రత్యామ్నాయం అంటూ తీసుకొచ్చిన అక్షర్ పటేల్ సాధారణంగా కనిపిస్తున్నాడు. ‘స్పిన్‌లో వైవిధ్యం చూపించని అక్షర్ అతి సాధారణ బౌలర్. సులువుగా అతడి బంతులను బ్యాట్స్‌మెన్ అంచనా వేయవచ్చు. అంతర్జాతీయ బౌలర్‌గా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని గవాస్కర్ విమర్శించడం పరిస్థితిని సూచిస్తోంది. బహుశా దీని వల్లే డుమిని తొలి టి20లో వరుసగా మూడు సిక్సర్లతో చెలరేగి మ్యాచ్ దిశను మార్చాడు. సోమవారం మ్యాచ్‌లో అక్షర్‌ను పక్కన పెట్టి రైనాతో పూర్తి కోటా వేయించడం చూస్తే రెగ్యులర్ స్పిన్నర్ల స్థితి అర్థమవుతుంది. గత రెండేళ్లుగా అశ్విన్ ఎంతో ఎదిగిపోగా... రెండో స్పిన్నర్‌గా ఎవరూ ప్రభావం చూపడం లేదు. కెరీర్ చివర్లో ఉన్న హర్భజన్ వరల్డ్ కప్ వరకు జట్టులో ఉంటాడో లేదో కూడా తెలీదు. మిశ్రా, కరణ్ శర్మలకు పూర్తి స్థాయి అవకాశాలే రాలేదు.
పరీక్ష ఎప్పటి వరకు
ప్రపంచకప్‌లోగా టి20 మ్యాచ్‌ల్లో ఫలితాలకంటే అన్ని ప్రత్యామ్నాయాలు పరిశీలించడం, అందరికీ అవకాశం ఇవ్వడం ముఖ్యమని కెప్టెన్ ధోని చెబుతున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత భారత్ ఆస్ట్రేలియా వెళ్లి 5 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు కూడా ఆడుతుంది. అక్కడ టి20లు ఆడటం భారత్‌లో జరిగే ప్రపంచకప్‌కు పెద్దగా పనికి రాకపోవచ్చు. కానీ ఐపీఎల్‌లో తమ ఫ్రాంచైజీల తరఫున చెలరేగే బౌలర్లు... అంతర్జాతీయ మ్యాచ్‌లో మాత్రం తేలిపోతున్నారు. మోహిత్, భువీ, అక్షర్... ఎవరైనా అంతే. పరిస్థితి చూస్తే అరవింద్ కెరీర్ ఒక్క మ్యాచ్‌కే ముగిసిపోతుందేమోఅనిపిస్తుంది. అలాంటప్పుడు వరల్డ్ కప్‌లోగా ఎంత మందిని పరీక్షిస్తారు, చివరకు ఎలాంటి జట్టుతో సిద్ధమవుతారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్న బృందంతో మాత్రం భారత్ మ్యాచ్‌లు గెలవడం చాలా కష్టం.