విజయానంతరం అఫ్గాన్ ఆటగాడితో కెప్టెన్ రహానే కరచాలనం
ఎలాంటి అద్భుతాలు జరగలేదు.. రషీద్ ఖాన్ బంతి తిరగలేదు.. చారిత్రక టెస్టులో చెత్త రికార్డు ప్రత్యర్థి జట్టుకు.. ఘన చరిత్ర ఆతిథ్య జట్టుకు దక్కింది. ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం సాధించింది. నెంబర్ వన్ జట్టు చాంపియన్ ఆటను ప్రదర్శించగా.. పసికూన పాఠాలు నేర్వాల్సి ఉంది. ఇక టెస్టు ఆరంభానికి ముందు నుంచే స్లెడ్జింగ్‌కు దిగిన అఫ్గాన్ జట్టుకు టీమిండియా షాకిచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో అసాధారణ ప్రదర్శన కనబరిచి భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండ్రోజుల్లోనే అఫ్గన్ కథను ముగించి చారిత్రక విజయం సాధించింది.
సాక్షి, బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో తొలి రోజు భారత్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టగా, రెండో రోజు ప్రత్యర్థి బ్యాట్‌మెన్‌కు టీమిండియా బౌలర్లు దడ పుట్టించారు. ఓవర్‌నైట్ స్కోర్ 347/6తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా మరో 127 పరుగుల జోడించి 474 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ పరుగుల విషయం పక్కకు పెడితే క్రీజులో నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడ్డారు. అశ్విన్ (4/27), జడేజా(2/18), ఇషాంత్ శర్మ(2/28), ఉమేశ్(1/18) చెలరేగటంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో షహజాద్ రనౌట్ రూపంలో తొలి వికెట్‌గా వెనుదిరగగా.. ఆపై స్వల్ప విరామాల్లో జావేద్ అహ్మదీ(1), రహ్మత్ షా(14), అఫ్సర్ జజాయ్(6), అస్గార్ స్టానిక్‌జాయ్(11) వికెట్లను చేజార్చుకుంది. దీంతో 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. మహ్మద్ నబీ (24) కొంత పోరాటం చేసిన మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం చెందటంతో 27.5 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది.
అనంతరం టీమిండియా కెప్టెన్ రహానే ఏమాత్రం ఆలోచించకుండా అఫ్గాన్‌ను మరోసారి బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ కష్టాలు రెండో ఇన్నింగ్స్‌లోనూ కొనసాగాయి. తొలి ఇన్నింగ్స్‌ను స్పిన్‌తో దెబ్బకొట్టిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో పేస్ బౌలర్లు సత్తా చూపారు. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టడంతో అఫ్గాన్ ఏ దశలోను కోలుకోలేక పోయింది. టాప్ ఆర్డర్ మరోసారి విఫలమవ్వగా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షాహిది(36), అస్గార్ స్టానిక్‌జాయ్(25) కొంత వరకు పోరాడినా మ్యాచ్‌ను మూడో రోజుకు తీసుకోని పోలేకపోయారు. దీంతో 38.4 ఓవర్లలో 103 పరుగులకు అఫ్గానిస్తాన్ ఆలౌటైంది.
భారత బౌలర్లలో రవీంద్రజడేజా (4/17), ఉమేశ్(3/26), ఇషాంత్ శర్మ(2/17), అశ్విన్(1/32) మరోసారి ప్రత్యర్థి జట్టు పని పట్టారు. రెండో రోజు మొత్తం 24 వికెట్లు పడిపోయాయి. టీమిండియాకు టెస్ట్ మ్యాచ్‌ల్లో అతి పెద్ద ఇన్నింగ్స్ విజయం ఇదే కావడం విశేషం.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment