టి20లు అంటేనే మెరుపు షాట్లు... భారీ స్కోర్లు! కానీ, కోల్‌కతాలో ఆదివారం తొలి మ్యాచ్ ఇలాంటి మెరుపులేమీ లేకుండానే సాగింది. వెస్టిండీస్ ఆట ఇంతేనని సరిపెట్టుకుంటే, టీమిండియా సైతం కొంత కష్టంగానే లక్ష్యాన్ని ఛేదించింది. జట్ల బలాబలాలు ఎలా ఉన్నా, పిచ్ గురించి వస్తున్న విశ్లేషణలను చూస్తే లక్నోలో జరుగనున్న రెండో మ్యాచ్ కూడా మొదటిదానికి భిన్నంగా ఉండేట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తెలివిగా ఆడిన జట్టుదే విజయం అనడంలో సందేహం లేదు. మరి... మరో గెలుపుతో రోహిత్ బృందం సిరీస్‌ను ఇక్కడే కైవసం చేసుకుంటుందా? పర్యాటక జట్టు పుంజుకుని పోటీ ఇస్తుందా?
లక్నో: టెస్టు, వన్డే సిరీస్‌ల తరహాలోనే టి20 సిరీస్‌నూ ఒడిసి పట్టేందుకు మరో విజయం దూరంలో టీమిండియా. వెస్టిండీస్‌తో మంగళవారం లక్నోలో కొత్తగా నిర్మించిన ‘భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి అంతర్జాతీయ స్టేడియం’లో రెండో మ్యాచ్. రోహిత్ సేనకు అటు సిరీస్‌తో పాటు పొట్టి ఫార్మాట్ ప్రపంచ చాంపియన్‌పై విజయాల రికార్డు మెరుగుపర్చుకునే అవకాశం. అయితే, అప్పటివరకు ఎలా ఆడినా, ఉప్పెనలా విరుచుకుపడి క్షణాల్లో ఫలితం మార్చేసే కరీబియన్లకు ఏమేరకు ముకుతాడు వేస్తారనే దానిపైనే ఇది ఆధారపడి ఉంది. మరోవైపు పిచ్ నెమ్మదిగా ఉంటుందనే అంచనాల రీత్యా అభిమానులకు ఉర్రూతలూగించే క్రికెట్ విందు లేనట్లే.
భారత్... భువీతో!
బంతి ఆగిఆగి బ్యాట్‌పైకి రావడంతో కోల్‌కతాలో టీమిండియాకు ఛేదన ఏమంత సులువు కాలేదు. ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమైనా, లోతైన బ్యాటింగ్ లైనప్‌తో భారత్ పెద్దగా కంగారు పడాల్సిన పని లేకపోయింది. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కు అరంగేట్ర ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా అండగా నిలిచి లాంఛనాన్ని ముగించాడు. అయితే, ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంతవరకు సరైన ఇన్నింగ్స్ ఆడకపోవడం జట్టుకు కొంత ఇబ్బందిగా ఉంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగితే కెప్టెన్ రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్, మనీశ్ పాండే సాధ్యమైనన్ని పరుగులు అందించాల్సి ఉంటుంది.
రిషభ్ పంత్ మరోసారి స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గానే వచ్చే వీలుంది. దినేశ్ కార్తీక్, కృనాల్ ఆఖర్లో చెలరేగితే ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని విధించవచ్చు. ఛేదన అయినా ఇదే తీరులో ఆడాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్‌కు భారత్ బౌలింగ్‌లో ఒక మార్పుతో బరిలో దిగే అవకాశం ఉంది. పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్ జట్టులోకి వస్తాడు. బుమ్రా, ఖలీల్ అహ్మద్ అతడితో పాటు బంతిని పంచుకుంటారు. స్పిన్ బాధ్యతలు కుల్దీప్, కృనాల్ తీసుకుంటారు.
విండీస్... పోరాడితే
ప్రత్యర్థి ప్రతిభ కంటే మ్యాచ్, పిచ్ పరిస్థితులను పట్టించుకోకుండా ఆడటమే కోల్‌కతాలో వెస్టిండీస్ పరాజయానికి ప్రధాన కారణమైంది. బ్యాట్స్‌మెన్ సహజ శైలిలో షాట్లకు దిగి వికెట్లు పారేసుకోవడంతో మోస్తరు లక్ష్యాన్నీ నిర్దేశించలేకపోయింది. ఫామ్‌లో ఉన్న షై హోప్ అనవసర రనౌట్ మరింత దెబ్బతీసింది. బౌలింగ్‌లోనే జట్టు ప్రతిఘటన చూపగలిగింది. కెప్టెన్ బ్రాత్‌వైట్, పియర్ పొదుపైన బౌలింగ్‌కు తోడు పేసర్ థామస్ మెరుపు స్పెల్ ఆశలు రేపినా అది విజయానికి సరిపోలేదు. హెట్‌మైర్, పొలార్డ్, బ్రావో తలో చేయి వేసి... ఆఖర్లో బ్రాత్‌వైట్ బ్యాట్ ఝళిపిస్తే భారత్‌కు సవాల్ విసిరే స్కోరు చేయగలదు. ఏదేమైనా బ్యాట్స్‌మెన్ కాస్త ఓపికగా ఆడి భారీగా పరుగులు సాధిస్తేనే విండీస్ విజయం అందుకోగలదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, కేఎల్ రాహుల్, పాండే, పంత్, దినేశ్ కార్తీక్, కృనాల్, భువనేశ్వర్, కుల్దీప్, బుమ్రా, ఖలీల్.
వెస్టిండీస్: బ్రాత్‌వైట్ (కెప్టెన్), హోప్, రామ్‌దిన్, హెట్‌మైర్, బ్రావో, పొలార్డ్, రావ్‌మన్ పావెల్, అలెన్, కీమో పాల్, పియర్, థామస్.
పిచ్, వాతావరణం
కొత్తగా నిర్మించిన ఈ మైదానంలో పిచ్ చాలా నెమ్మదిగా ఉంది.వర్ష సూచనలు లేవు. రాత్రి వేళ మంచు కురుస్తుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌కే మొగ్గు చూపొచ్చు.
రాత్రి గం.7 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment