
వృద్ధిమాన్ శతక్కొట్టుడు!
బంగ్లాదేశ్ తో ఇక్కడ జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా శతకం నమోదు చేశాడు.
హైదరాబాద్:బంగ్లాదేశ్ తో ఇక్కడ జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా శతకం నమోదు చేశాడు. 153 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. అజింక్యా రహానే అవుటైన తరువాత క్రీజ్లోకి వచ్చిన సాహా సొగసైన షాట్లతో అలరించాడు. ప్రధానంగా రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే సాహా సెంచరీ సాధించగా, జడేజా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇది సాహా కెరీర్ లో రెండో టెస్టు సెంచరీ కాగా, జడేజా కెరీర్ లో ఐదో టెస్టు హాఫ్ సెంచరీ. ఈ జోడి ఏడో వికెట్ కు అజేయంగా 118 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత భారత్ జట్టు 687/6 వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి సాహా (106 నాటౌట్), జడేజా(60 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు.
అంతకుముందు విరాట్ కోహ్లి(204) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు గురువారం తొలి రోజు ఆటలో సెంచరీ బాదిన కోహ్లి.. శుక్రవారం రెండో రోజు ఆటలో కూడా దూకుడుగా ఆడి మరో శతకం నమోదు చేశాడు. ఓవరాల్ గా 239 బంతుల్లో 24 ఫోర్లతో డబుల్ సెంచరీతో కోహ్లి అదరగొట్టాడు. ఇది కోహ్లి టెస్టు కెరీర్లో నాల్గో డబుల్ సెంచరీ కావడం విశేషం. మరొకవైపు ఈ నాలుగు డబుల్ సెంచరీల్ని వరుస టెస్టు సిరీస్ల్లో సాధించడం మరొక విశేషం. తొలుత వెస్టిండీస్ పై ద్విశతకం కొట్టిన కోహ్లి.. ఆపై న్యూజిలాండ్, ఇంగ్లండ్లతో జరిగిన వరుస టెస్టుల్లో కూడా డబుల్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. ఇలా వరుస సిరీస్ ల్లో డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లి కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ రోజు ఆటలో భాగంగా తొలుత ఓవర్ నైట్ ఆటగాడు అజింక్యా రహానే తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించాడు. ఈ జోడి 222 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో భారత్ పటిష్ట స్థితికి చేరింది.