ఈ సంవత్సరం దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల రూపంలో టీమిండియాకు మూడు సవాళ్లతో ప్రారంభమైంది. వీటిని అధిగమిస్తే టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంకుకు నిజంగా అర్హులేనని క్రికెట్ ప్రపంచం మొత్తం అభిప్రాయానికి వచ్చేది. చరిత్రలో ఏ భారత జట్టుకూ సాధ్యం కాని దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో టెస్టు సిరీస్ విజయాలను సాధించగలిగితే ప్రతి ఒక్కరూ ఈ జట్టు ప్రపంచ అత్యుత్తమమని ఒప్పుకునేవారు. అయితే, దక్షిణాఫ్రికా పర్యటన రూపంలో మొదటి సవాల్‌లో విఫలమయ్యారు. ఇందుకు ప్రధాన కారణం సరైన ఆలోచన లేని షెడ్యూల్. అక్కడకు చేరిన వారం వ్యవధిలోనే సఫారీలతో తొలి టెస్టు ఆడి చిన్న లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. బ్యాటింగ్ వైఫల్యంతో రెండో టెస్టులో పరాజయం పాలయ్యారు. మూడో టెస్టుకు మాత్రం పక్కాగా సన్నద్ధమయ్యారు. అనూహ్యంగా బౌన్స్ అవుతున్న పిచ్‌పైనా బ్యాట్స్‌మెన్ రాణించగా, బౌలర్లు తమ ఫామ్‌ను కొనసాగిస్తూ దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్ చేయకుండా అడ్డుకున్నారు.
టి20లు, వన్డే సిరీస్‌ల కోసం ఇప్పుడు జట్టు నెల రోజులకు పైగా ఇంగ్లండ్‌లోనే ఉంది. తెల్ల బంతితోనే ఆ మ్యాచ్‌లన్నీ ఆడినా, వాతావరణం, పిచ్‌లకు ఆటగాళ్లు అలవాటై ఉంటారు. అసలు ప్రశ్నేంటంటే... టెస్టుల్లో ఆడే ఎర్ర బంతిని ఎదుర్కోవడానికి ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ సరిపోతుందా అని? గత నెలంతా వాతావరణం భారత్ కంటే ఎక్కువ ఎండగా ఉన్నా, రెండ్రోజులుగా మారుతోంది. వర్షం పడుతోంది. ఇదిలాగే కొనసాగితే, కొత్త బంతి బౌలర్లకు పండుగే. బంతి కూడా వేగంగా కదులుతుంది కాబట్టి పేసర్లు భారీ స్పెల్స్ వేసేందుకు ఆస్కారం ఉంటుంది.
ప్రారంభ టెస్టు ఫలితం మిగతా సిరీస్ అంతా కనిపిస్తుంది కాబట్టి, ఐదుగురు బౌలర్లు, ఆరుగురు బ్యాట్స్‌మెన్ ఫార్ములానా?, ఇందులో ఇద్దరు స్పిన్నర్లు ఉండాలా? అని భారత జట్టు మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడుతుండొచ్చు. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌తోనే ఆడినా, టెస్టుల్లో శతకాలు బాదిన అశ్విన్, హార్దిక్ పాండ్యాలు జట్టుకు అదనపు బలం. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ సైతం టెస్టుల్లో సెంచరీ చేశాడు. ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ తర్వాత కార్తీక్ ఆరో స్థానంలో ఆడితే, పాండ్యా, అశ్విన్ అతడిని అనుసరిస్తారు. ఇలాగైతే రెండో స్పిన్నర్‌గా కుల్దీప్‌ను తీసుకోవచ్చు. ఇదంతా మ్యాచ్ రోజు ఉదయం పిచ్ స్వభావాన్ని పరిశీలించాక తేలుతుంది. పచ్చిక ఎక్కువగా ఉంటే, మరో పేసర్‌ను ఎంచుకుని కుల్దీప్‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఏదేమైనా, తొలి టెస్టు ఓడామనే వెనుకబాటును తప్పించుకునేందుకు సరైన కూర్పు ముఖ్యం. లేదంటే సెప్టెంబరు వరకు సాగే పోరాటంలో పైచేయి సాధించడం కష్టం.
మొదటి టెస్టే కీలకం
Published Tue, Jul 31 2018 12:35 AM | Last Updated on Tue, Jul 31 2018 12:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment