‘బజ్‌బాల్’... దూకుడైన ఆటకు మారుపేరు అంటూ ఇంగ్లండ్ జట్టు గత కొంత కాలంగా ప్రచారం చేసింది. అయితే భారత్‌లో ఇది సాధ్యమా అనే సందేహాలు వినిపించాయి. ఇంగ్లండ్ ఆశించినట్లుగా ఆ ధాటి పని చేసింది... అయితే అది తొలి ఎనిమిది ఓవర్ల వరకే... ఆ తర్వాత భారత ‘స్పిన్ బాల్’ దెబ్బకు లెక్క మారిపోయింది... వరుసగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ చివర్లో స్టోక్స్ ఆదుకోవడంతో కాస్త కోలుకుంది.
అక్కడక్కడ ఇంగ్లండ్ కాస్త మెరుగైన స్థితిలోనే నిలిచినా చివరకు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆపై మన గడ్డపై ‘బజ్‌బాల్’ ఎలా ఆడాలో భారత ఓపెనర్లు చూపించారు. యశస్వి ధాటికి ఆరంభంలో స్కోరు ఆరుకు పైగా రన్‌రేట్‌తో సాగింది. తొలి రోజే ప్రత్యర్థి స్కోరులో దాదాపు సగం స్కోరును జట్టు అందుకుంది... మొత్తంగా అన్ని విధాలా మొదటి రోజు మనదిగా ముగిసింది.
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ మొదటి రోజు పైచేయిని ప్రదర్శించింది. టాస్ ఓడిపోవడం మినహా దాదాపు మిగతా రోజంతా టీమిండియాకే అనుకూలంగా సాగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 64.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (88 బంతుల్లో 70; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా... బెయిర్‌స్టో (58 బంతుల్లో 37; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.
స్పిన్నర్లు అశ్విన్ జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టగా...అక్షర్ పటేల్ ఖాతాలో 2 వికెట్లు చేరాయి. పేసర్ బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు సాధించింది. యశస్వి జైస్వాల్ (70 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా... రోహిత్ శర్మ (27 బంతుల్లో 24; 3 ఫోర్లు) రాణించాడు.
ప్రస్తుతం భారత్ మరో 127 పరుగులు వెనుకబడి ఉండగా... క్రీజ్‌లో యశస్వితో పాటు గిల్ (43 బంతుల్లో 14 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నాడు. నేడు రెండో రోజూ పూర్తిగా బ్యాటింగ్ చేసి టీమిండియా భారీ స్కోరు సాధిస్తే మ్యాచ్ చేతుల్లోకి వచ్చి నట్లే.
ఓపెనర్ల శుభారంభం...
బుమ్రా, సిరాజ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ క్రాలీ (40 బంతుల్లో 20; 3 ఫోర్లు), డకెట్ (39 బంతుల్లో 35; 7 ఫోర్లు) వేగంగా పరుగులు రాబట్టారు. 8 ఓవర్లలో వీరు 41 పరుగులు జత చేశారు. తర్వాతి ఓవర్ జడేజా మెయిడిన్‌గా వేయడంతో దూకుడుకు అడ్డుకట్ట పడింది. అశ్విన్ , జడేజా చెలరేగడంతో 5 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది.
ఈ దశలో రూట్ (60 బంతుల్లో 29; 1 ఫోర్), బెయిర్‌స్టో కలిసి 61 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. అయితే 4 పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. అక్షర్ అద్భుత బంతితో బెయిర్‌స్టోను బౌల్డ్ చేయగా, రూట్ స్వయంకృతంతో వెనుదిరిగాడు. 137/6తో ఇన్నింగ్స్ ముగిసేందుకు ఇంగ్లండ్ చేరువైంది. అయితే స్టోక్స్ తన విలువను చూపించాడు. ఈ స్థితిలో స్టోక్స్ స్కోరు 8 పరుగులు మాత్రమే. కానీ టెయిలెండర్ల సహాయంతో అతను చెలరేగిపోయాడు.
జట్టు సాధించిన తర్వాతి 109 పరుగుల్లో 62 అతని బ్యాట్ నుంచే రాగా... హార్లీ (24 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) తన కెప్టెన్ కు అండగా నిలిచాడు. జడేజా ఓవర్లో స్టోక్స్ వరుస బంతుల్లో కొట్టిన రెండు సిక్సర్లు, అతని ఓవర్లోనే బాదిన మూడు ఫోర్లు హైలైట్‌గా నిలిచాయి. చివరకు చక్కటి బంతితో స్టోక్స్ ఆటను బుమ్రా కట్టించాడు. తొలి రెండు సెషన్లలో వందకు పైగా పరుగులు సాధించి ఇంగ్లండ్ మెరుగ్గానే ఆడినా... చివరకు వచ్చేసరికి ఆ జట్టు ఆశించిన భారీ స్కోరు మాత్రం సాధ్యం కాలేదు.
మెరుపు ఆరంభం...
వుడ్స్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతినే ఫోర్‌తో మొదలు పెట్టిన యశస్వి, అరంగేట్ర బౌలర్ హార్లీ తొలి టెస్టు బంతిని సిక్సర్ బాది స్వాగతం పలికాడు. మరోవైపు రోహిత్ అండగా నిలవడంతో 6.3 ఓవర్లలోనే టీమిండియా స్కోరు 50 పరుగులకు చేరింది. అనంతరం 47 బంతుల్లోనే యశస్వి అర్ధసెంచరీ పూర్తయింది.
అయితే జట్టుకు అంతా అనుకూలంగా ఉండి టెస్టులో ఇంకా ఎంతో సమయం మిగిలి ఉన్నా... అనవసరంగా అత్యుత్సాహానికి పోయి చెత్త షాట్ ఆడిన రోహిత్ వికెట్ పారేసుకున్నాడు. అనంతరం గిల్ బాగా జాగ్రత్త ప్రదర్శించడంతో వేగం తగ్గింది. అయినా చివరకు 5.17 రన్‌రేట్‌తో భారత్ రోజును ముగించింది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) సిరాజ్ (బి) అశ్విన్ 20; డకెట్ (ఎల్బీ) (బి) అశ్విన్ 35; పోప్ (సి) రోహిత్ (బి) జడేజా 1; రూట్ (సి) బుమ్రా (బి) జడేజా 29; బెయిర్‌స్టో (బి) అక్షర్ 37; స్టోక్స్ (బి) బుమ్రా 70; ఫోక్స్ (సి) భరత్ (బి) అక్షర్ 4; రేహన్ (సి) భరత్ (బి) బుమ్రా 13; హార్లీ (బి) జడేజా 23; వుడ్ (బి)అశ్విన్ 11; లీచ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (64.3 ఓవర్లలో ఆలౌట్) 246.
వికెట్ల పతనం: 1–55, 2–58, 3–60, 4–121, 5–125, 6–137, 7–155, 8–193, 9–234, 10–246. బౌలింగ్: బుమ్రా 8.3–1–28–2, సిరాజ్ 4–0–28–0, జడేజా 18–4–88–3, అశ్విన్ 21–1–68–3, అక్షర్ 13–1–33–2. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (బ్యాటింగ్) 76; రోహిత్ (సి) స్టోక్స్ (బి) లీచ్ 24; గిల్ (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (23 ఓవర్లలో వికెట్ నష్టానికి) 119. వికెట్ల పతనం: 1–80. బౌలింగ్: వుడ్ 2–0–9–0, హార్లీ 9–0 –63–0, లీచ్ 9–2–24–1, రేహన్ 3–0–22–0.
Comments
Please login to add a commentAdd a comment