'రూట్‌' మూసేశారు... | England Vs India:india take over first day | Sakshi
Sakshi News home page

'రూట్‌' మూసేశారు...

Published Thu, Aug 2 2018 12:41 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

England Vs India:india take over first day - Sakshi

ఐదు టెస్టుల సిరీస్‌కు ఆరంభం ఎలా ఉండాలని భారత్‌ ఆశించిందో సరిగ్గా అలాగే జరిగింది. మనోళ్లు బౌలింగ్‌లో అదరగొట్టడంతో బర్మింగ్‌హామ్‌ కాస్తా బాంబే మైదానంలా కనిపించింది. అశ్విన్‌ బంతులకు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేస్తుంటే ఆడుతోంది ఇండియాలోనే అనిపించింది. సొంతగడ్డపై టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొని అంతా తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు కనిపించిన ఇంగ్లండ్‌ను మొదటి రోజే దెబ్బ తీసి కోహ్లి సేన సిరీస్‌లో సవాల్‌ విసిరింది.  ఒక దశలో ఇంగ్లండ్‌ స్కోరు 216/3. రూట్, బెయిర్‌స్టో అలవోకగా బ్యాటింగ్‌ చేస్తూ 104 పరుగులు జోడించారు. కానీ రూట్‌ చేసిన పొరపాటుకు ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. లేని పరుగుకు ప్రయత్నించి అతను రనౌట్‌ కావడంతో భారత్‌కు ‘దారి’ తెరచుకుంది. ఈ అవకాశాన్ని టీమిండియా వృథా చేయలేదు. 1000వ టెస్టు జ్ఞాపికను సరిగా అందుకోలేక ఈసీబీ చైర్మన్‌ పడేసి రెండు ముక్కలు చేయగానే మొదలైన అశుభం ఇంగ్లండ్‌ను రోజంతా వెంటాడినట్లుంది.  

బర్మింగ్‌హామ్‌: అంచనాలకు మించి రాణించిన భారత్‌ తొలి రోజు ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. భారత్‌ బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్‌ బుధవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది.  జో రూట్‌ (156 బంతుల్లో 80; 9 ఫోర్లు), బెయిర్‌స్టో (88 బంతుల్లో 70; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయడం మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. అశ్విన్‌ 4 వికెట్లు పడగొట్టాడు. ఆఖరి ఓవర్లో కరన్‌ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ వదిలేయడంతో భారత్‌కు చివరి వికెట్‌ దక్కలేదు. చివరి సెషన్‌లోనే భారత్‌ ఆరు వికెట్లు తీయడం విశేషం. బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయిన పిచ్‌పై ఇంగ్లండ్‌ స్వయంకృతంతో కుప్పకూలింది. ఇదే వికెట్‌పై రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్‌ సత్తా చాటితే ఈ టెస్టుపై పట్టు బిగించడం కష్టం కాబోదు.  

రూట్‌ జోరు... 
టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌కు తొలి రోజు ఆశించిన ఆరంభం లభించలేదు. సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ కుక్‌ (13) తన ఆటతో మళ్లీ నిరాశపర్చాడు. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లోనే అశ్విన్‌ను బౌలింగ్‌కు దించి భారత్‌ ఫలితం సాధించింది. తన రెండో ఓవర్లోనే అశ్విన్‌ చక్కటి బంతితో కుక్‌ను బౌల్డ్‌ చేశాడు. కుక్‌ను అశ్విన్‌ ఔట్‌ చేయడం ఇది ఎనిమిదో సారి కావడం విశేషం. అంతకుముందు ఇషాంత్‌ బౌలింగ్‌లో 9 పరుగుల వద్ద నాలుగో స్లిప్‌లో రహానే క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన కీటన్‌ జెన్నింగ్స్‌ (98 బంతుల్లో 42; 4 ఫోర్లు), కెప్టెన్‌ రూట్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్నా వీరిద్దరు ఎలాంటి ప్రమాదం లేకుండా తొలి సెషన్‌ను ముగించగలిగారు. అయితే లంచ్‌ తర్వాత షమీ జోరుతో పరిస్థితి ఒక్కసారిగా భారత్‌కు అనుకూలంగా కనిపించింది. రెండో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం తర్వాత జెన్నింగ్స్‌ దురదృష్టవశాత్తూ వెనుదిరిగాడు. షమీ వేసిన బంతిని జెన్నింగ్స్‌ డిఫెన్స్‌ ఆడగా... అతని కాలికి తగిలి స్టంప్‌పై పడిన బంతి మెల్లగా బెయిల్‌ను గిరాటేసింది. కొద్ది సేపటికి మలాన్‌ (8) కూడా షమీ బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ దశలో రూట్, బెయిర్‌స్టో సమన్వయంతో బ్యాటింగ్‌ చేశారు. ఈ క్రమంలో 107 బంతుల్లో రూట్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. రెండో సెషన్‌లో మరో వికెట్‌ తీసేందుకు భారత్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.  

టపటపా... 
చివరి సెషన్‌ను ఇంగ్లండ్‌ దూకుడుగా ప్రారంభించింది. పాండ్యా ఓవర్లలో రూట్, బెయిర్‌స్టో వరుసగా రెండేసి ఫోర్లు బాదారు. ఈ క్రమంలో 72 బంతుల్లోనే బెయిర్‌స్టో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. అయితే ఈ భాగస్వామ్యం వంద పరుగులు దాటిన తర్వాత ఇంగ్లండ్‌ చేజేతులా వికెట్లు అందించి భారత్‌ శిబిరంలో ఆనందం నింపింది. రూట్‌ రనౌట్‌ జట్టు పతనానికి దారి తీసింది. అశ్విన్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టో మిడ్‌ వికెట్‌ దిశగా ఆడగా సింగిల్‌ పూర్తయింది. అయితే వీరిద్దరు లేని రెండో పరుగు కోసం సాహసం చేశారు. చురుగ్గా స్పందించిన కోహ్లి బంతిని అందుకొని నాన్‌స్ట్రయికింగ్‌ వికెట్లపై నేరుగా కొట్టడంతో రూట్‌ వెనుదిరిగాడు. కోహ్లి ‘డ్రాప్‌ ద మైక్‌’ సంబరాలతో రూట్‌ను సాగనంపాడు. కొద్ది సేపటికే ఉమేశ్‌ బంతిని బెయిర్‌స్టో వికెట్లపైకి ఆడుకోగా... బట్లర్‌ (0)ను అశ్విన్‌ ఎల్బీగా ఔట్‌ చేశాడు. ఈ దశలో ఆదుకునే ప్రయత్నం చేసిన స్టోక్స్‌ (21) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. చివర్లో స్యామ్‌ కరన్‌ (24 బ్యాటింగ్‌) కొద్దిగా పోరాడటంతో ఇంగ్లండ్‌ ఆలౌట్‌ కాలేదు.   

పుజారా పనికి రాడా!
‘జట్టులో నా స్థానంపై ఢోకా లేదు’... తొలి టెస్టుకు ముందు చతేశ్వర్‌ పుజారా చెప్పిన మాట తప్పని తేలేందుకు ఎక్కువ రోజులు పట్టలేదు. కేఎల్‌ రాహుల్‌ను మూడో స్థానంలో ఆడించేందుకు భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పుజారాను పక్కన పెట్టింది. సాంకేతికంగా మంచి నైపుణ్యం ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న టెస్టు స్పెషలిస్ట్‌ను ఆడించకపోవడం అనూహ్యమే. నిజానికి తాజా ఫామ్‌ను బట్టి చూస్తే ధావన్‌ స్థానంలో రాహుల్‌ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉందనిపించింది. కానీ ఎడమచేతి వాటం కావడం ధావన్‌కు కలిసొచ్చింది. డిఫెన్స్‌ బలంగా ఉన్నా... పుజారా అతి నెమ్మదిగా ఆడే శైలిపై ఎప్పటినుంచో కోహ్లి, శాస్త్రికి సందేహాలు ఉన్నాయి. రాహుల్‌కు కూడా మంచి టెక్నిక్‌ ఉండటంతో పాటు అవసరమైతే ధాటిగా ఆడగలడు కాబట్టి అతనికి ప్రాధాన్యత లభించింది. ఇంగ్లండ్‌ గడ్డపై టెస్టు సిరీస్‌కు ముందు సన్నాహకంగా బాగుంటుందని కౌంటీల్లో ఆడిన పుజారాకు అదే నష్టం చేసినట్లుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో కౌంటీల్లో ఆడిన 12 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను కేవలం 14.33 సగటుతో 172 పరుగులు మాత్రమే చేశాడు. పైగా 12 ఇన్నింగ్స్‌లో 8 సార్లు బౌల్డ్‌ లేదా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం పుజారా డిఫెన్స్‌పై కూడా సందేహాలు రేకెత్తించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో అతను పట్టుదలగా ఆడి చేసిన అర్ధ సెంచరీ భారత్‌ విజయానికి బాటలు పరచిన విషయాన్ని మరుగున పడేసింది. పుజారాను పక్కన పెట్టే స్థాయిలో అతను విఫలం కాలేదనేది వాస్తవం. పైగా ముగ్గురు ప్రధాన పేసర్లు తుది జట్టులో ఉన్నప్పుడు పాండ్యా అవసరం పెద్దగా లేదు. అతడిని తప్పించైనా రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌ పుజారాకు చోటు కల్పిస్తే సరిపోయేది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement