విజయం ఊరిస్తోంది..! | Kohli team is another 84-run to win | Sakshi
Sakshi News home page

విజయం ఊరిస్తోంది..!

Published Sat, Aug 4 2018 12:36 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

Kohli team is another 84-run to  win - Sakshi

తొలి టెస్టులోనే విజయం సాధించి సుదీర్ఘ సిరీస్‌లో శుభారంభం చేసే అవకాశం... 194 పరుగుల సాధారణ లక్ష్యం.. కానీ మన బ్యాట్స్‌మెన్‌ మరో పేలవ ప్రదర్శనతో గెలుపు బాట కఠినంగా మారిపోయింది. 78 పరుగులకే ఐదుగురు పెవిలియన్‌ చేరి ఆందోళన పెంచారు. అయితే ఎప్పటిలాగే నేనున్నానంటూ విరాట్‌ కోహ్లి నిలబడ్డాడు. మెల్లగా జట్టును విజయం దిశగా నడిపిస్తున్నాడు. అతనికి అండగా దినేశ్‌ కార్తీక్‌ గట్టిగానే నిలబడ్డాడు. అయినా సరే మదిలో కాస్త సందేహం... ఇంగ్లండ్‌ బౌలర్లు చెలరేగిపోతుండటంతో మరో 84 పరుగులు ఇంకా సుదూరంగానే కనిపిస్తోంది.

భారత్‌ గెలుపుపై ఆశలు పెంచుకోగలిగిందంటే ఇషాంత్‌ శర్మ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన వల్లే. ఒకే ఓవర్లో మూడు వికెట్లు సహా మొత్తం ఐదు వికెట్లతో గత సిరీస్‌ ‘లార్డ్స్‌’ ప్రదర్శనను గుర్తు చేయగా, అశ్విన్‌ స్పిన్‌ కూడా మాయ చేసింది. అయితే కుర్రాడు కరన్‌ పట్టుదలగా నిలబడటంతో ఇంగ్లండ్‌ చెప్పుకోదగ్గ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. నాలుగో రోజు మనోళ్లు మిగిలిన ఐదు వికెట్లతో గట్టుకు చేరతారా? లేక ఇంగ్లండ్‌ వలలో పడతారా? ఇక అంతా కోహ్లిపైనే భారం..!

బర్మింగ్‌హామ్‌: తొలి టెస్టులో భారత్‌ గెలుపుపై ఆశలు పెంచుకుంది. 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ 5 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (76 బంతుల్లో 43 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), దినేశ్‌ కార్తీక్‌ (18 బ్యాటింగ్‌) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లాగే కోహ్లికి లోయర్‌ ఆర్డర్‌ సహకరిస్తే శనివారం సిరీస్‌లో 1–0తో భారత్‌ ఆధిక్యం సాధించేందుకు మంచి అవకాశం ఉంది. అంతకుముందు ఇషాంత్‌ శర్మ (5/51) ధాటికి ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే కుప్పకూలింది. ఎనిమిదో స్థానంలో ఆడిన స్యామ్‌ కరన్‌ (65 బంతుల్లో 63; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి.  

ఒకే ఓవర్లో మూడు వికెట్లు... 
ఓవర్‌నైట్‌ స్కోరు 9/1తో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. రెండో రోజు తొలి వికెట్‌తో భారత్‌కు శుభారంభం అందించిన అశ్విన్‌ తన జోరును కొనసాగించడంతో ఇంగ్లండ్‌ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ముందుగా జెన్నింగ్స్‌ (8) స్లిప్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇవ్వగా... కొద్ది సేపటికే కెప్టెన్‌ జో రూట్‌ (14)ను కూడా అశ్విన్‌ వెనక్కి పంపించాడు. ఇషాంత్‌ వేసిన చక్కటి బంతిని ఆడలేక మలాన్‌ (20) స్లిప్‌లో రహానేకు క్యాచ్‌ ఇవ్వడంతో జట్టు పతనం మొదలైంది. అనంతరం ఇన్నింగ్స్‌ 31వ ఓవర్లో ఇషాంత్‌ చెలరేగిపోయాడు. ముగ్గురిని ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. రెండో బంతికి బెయిర్‌స్టో (40 బంతుల్లో 28; 5 ఫోర్లు) ఔట్‌ కాగా, నాలుగో బంతికి స్టోక్స్‌ (6) వెనుదిరిగాడు. ఈ వికెట్‌ తర్వాత లంచ్‌ విరామం వచ్చింది. అయితే ఆ తర్వాత తన ఓవర్‌ కొనసాగించిన ఇషాంత్‌ చివరి బంతికి బట్లర్‌ (1) పని పట్టాడు. ఈ దశలో ఇంగ్లండ్‌ స్కోరు 87/7 కాగా... ఆధిక్యం సరిగ్గా వంద పరుగులకు చేరింది.  

కరన్‌ మెరుపులు... 
తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీసిన స్యామ్‌ కరన్‌ ఈసారి బ్యాటింగ్‌ బలం చూపించాడు. ఎనిమిదో వికెట్‌కు రషీద్‌ (16)తో 48 పరుగులు, తొమ్మిదో వికెట్‌కు బ్రాడ్‌ (11)తో 41 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. షమీ, ఇషాంత్‌ ఓవర్లలో అతను రెండేసి ఫోర్లు కొట్టాడు. బంతులు అనూహ్యంగా ఎడ్జ్‌ తీసుకొని స్లిప్‌ ఫీల్డర్లను దాటి బౌండరీలకు వెళ్లిపోవడం, రషీద్‌ క్యాచ్‌ను ధావన్‌ వదిలేయడం, వేగంగా పరుగులు రావడం... ఇలా ఇరు జట్లు ఇలా కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్నాయి. వెలుతురు తగ్గడంతో కొద్ది సేపు నిలిచిపోయిన ఆట మళ్లీ మొదలయ్యాక భారత్‌ కోలుకుంది. రషీద్‌ను ఉమేశ్‌ బౌల్డ్‌ చేశాక కూడా కరన్‌ దూకుడు తగ్గలేదు. అశ్విన్‌ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్‌ కొట్టిన అతను ఇషాంత్‌ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్‌తో 54 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్రాడ్‌ను ఔట్‌ చేసి ఇషాంత్‌ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకోగా... తర్వాతి ఓవర్లో కరన్‌ వికెట్‌ తీసి ఉమేశ్‌ ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగించాడు.  

టాపార్డర్‌ విఫలం... 
ఛేదనలో భారత్‌కు మళ్లీ నిరాశాజనక ఆరంభం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లాగే టాప్‌–3 మరోసారి విఫలమయ్యారు. విజయ్‌ (6)ను ఎల్బీగా వెనక్కి పంపిన బ్రాడ్‌... తన తర్వాతి ఓవర్లో ధావన్‌ (13)నూ ఔట్‌ చేశాడు. స్టోక్స్‌కు రాహుల్‌ (13) వికెట్‌ దక్కగా, రహానే (2) పేలవ ఫామ్‌ కొనసాగింది. ఈ దశలో మరోసారి కోహ్లి బాధ్యతను భుజాలపై వేసుకున్నాడు. ఆరో వికెట్‌కు కార్తీక్‌తో అభేద్యంగా 32 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను అతను నడిపించాడు.  

►మధ్యాహ్నం గం. 3.30 నుంచి  సోనీ సిక్స్,  సోనీ టెన్‌–3లలో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement