'సర్‌' విరాట్‌ | Virat Kohli mixes grit, brilliance to play starring role for India | Sakshi
Sakshi News home page

'సర్‌' విరాట్‌

Published Fri, Aug 3 2018 1:33 AM | Last Updated on Fri, Aug 3 2018 4:17 AM

Virat Kohli mixes grit, brilliance to play starring role for India - Sakshi

ఇంగ్లండ్‌ గడ్డపై చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ... గత పర్యటన నాటి ఆటగాడిని కానని నిరూపిస్తూ... తానెక్కడైనా రాణించగలనని చాటి చెబుతూ... ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెన్నుచూపనని రుజువు చేస్తూ... తన వికెట్‌ విలువ ఏమిటో వివరిస్తూ... తన క్యాచ్‌లను జారవిడవడం ఎంతటి తప్పిదమో అని ప్రత్యర్థి బాధపడేలా చేస్తూ... అసలు సిసలు ‘కెప్టెన్‌ ఇన్నింగ్స్‌’ అంటే ఇదేనని కళ్లకు కడుతూ... విరాట్‌ కోహ్లి అద్భుత శతకంతో చెలరేగిన వేళ... మొదటి టెస్టులో టీమిండియా నిలదొక్కుకుంది. సహచరులు ఒక్కొక్కరే వెనుదిరుగుతున్నా అమేయ పట్టుదలతో ఆడిన కోహ్లి... జట్టును ఒంటిచేత్తో ఒడ్డున పడేశాడు. ఇంగ్లండ్‌ గడ్డపై  ఇదే తరహా ఆటను ఇకముందూ కొనసాగిస్తే ‘సర్‌’ పురస్కారంతో సత్కరించేందుకు బ్రిటన్‌ సిద్ధం కావాల్సిందే   ...అయితే, దీనికిముందు ఓపెనర్లు అర్ధ శతక భాగస్వామ్యం అందించినా, విదేశీ గడ్డపై యథాప్రకారం మిగతా భారత బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు! బౌలర్లు బెంబేలెత్తించకున్నా, వారి బంతులేమీ భయంకరంగా దూసుకురాకున్నా... వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు! ...ఇప్పుడిక చేయాల్సింది సారథి స్ఫూర్తితో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను సాధ్యమైనంత తక్కువ స్కోరుకు కట్టడి చేయడమే...!  

బర్మింగ్‌హామ్‌: అహో... విరాట్‌ కోహ్లి! ఏమా పోరాటం! ఎంతటి పట్టుదల! తీరని పరాభవం మిగిల్చిన ఇంగ్లిష్‌ గడ్డపైనే తన పౌరుషం చాటాడు. తనను అవుట్‌ చేయడం ఎంత కష్టమో ఆచరణలో చూపుతూ పరుగులు పిండుకున్నాడు. అత్యంత క్లిష్టమైన పరిస్థితులను కాచుకుని, ప్రత్యర్థి ఆధిక్యానికి గండికొట్టాడు. తాను నిలవకుంటే మ్యాచే చేజారే ముప్పున్న నేపథ్యంలో... ఒంటరి పోరాటంతో ఇంగ్లండ్‌ది పైచేయి కాకుండా చూశాడు. కోహ్లి (225 బంతుల్లో 149; 22 ఫోర్లు, 1 సిక్స్‌) అమోఘ ఆటతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 274 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 285/9తో గురువారం రెండో రోజు బరిలో దిగిన ఇంగ్లండ్‌ మరో రెండు పరుగులు జోడించి ఆలౌటైంది. తొలి రోజు చివరి ఓవర్లో చేజారిన కరన్‌ (24) వికెట్‌ను తన ఖాతాలోనే వేసుకున్న షమీ (3/64) ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను ముగించాడు. అనంతరం బరిలో దిగిన భారత్‌కు ఓపెనర్లు విజయ్‌ (20), ధావన్‌ (26) తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. కానీ కోహ్లి మినహా మిగతావారు భారీ స్కోరు చేయలేకపోవడంతో 274 పరుగులకే పరిమితమైంది. స్యామ్‌ కరన్‌ (4/74) రాణించగా, అండర్సన్, స్టోక్స్, రషీద్‌లకు తలా రెండు వికెట్లు దక్కాయి. 13 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌ రోజు ముగిసేసరికి 9/1తో నిలిచింది. ఓపెనర్‌ కుక్‌ (0) మరోసారి అశ్విన్‌కే చిక్కాడు. మొత్తమ్మీద ఇంగ్లండ్‌ 22 పరుగుల ఆధిక్యంలో ఉంది.  

ఆరంభం బాగున్నా...  
విజయ్, ధావన్‌ ఇబ్బంది లేకుండా ఆడటంతో భారత ఇన్నింగ్స్‌ ఆశావహంగా సాగింది. చాలాకాలం తర్వాత విదేశాల్లో మంచి ఆరంభం దక్కింది. అయితే, కుదురుకున్న వీరిద్దరితో పాటు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ (4)ను 8 బంతుల వ్యవధిలో అవుట్‌ చేసి కరన్‌ దెబ్బకొట్టాడు. ఒక్కసారిగా స్కోరు 59/3కి పడిపోయింది. 76/3తో భారత్‌ లంచ్‌ విరామానికి వెళ్లింది. కొద్దిసేపటికే వైస్‌ కెప్టెన్‌ రహానే (15) దూరంగా వెళ్తున్న స్టోక్స్‌ బంతిని వెంటాడి వికెట్‌ పారేసుకున్నాడు. దీంతో నాలుగో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికి స్కోరు సరిగ్గా 100. వెంటనే దినేశ్‌ కార్తీక్‌ (0) కూడా స్టోక్స్‌ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. ఇంగ్లండ్‌ బౌలర్లు ఒత్తిడి పెంచడంతో ఇదే స్కోరు వద్ద జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. హార్దిక్‌ పాండ్యా (22) ఇచ్చిన క్యాచ్‌ను కుక్‌ జారవిడిచారు.  మధ్యలో పాండ్యాను అంపైర్‌ ఎల్బీగా ప్రకటించినా, అప్పీల్‌కు వెళ్లి బయటపడ్డాడు. ఇక్కడి నుంచి పాండ్యా, కోహ్లి నడిపించారు. ఆరో వికెట్‌కు 48 పరుగులు జత చేశాక పాండ్యాను కరన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈసారి అప్పీల్‌కు వెళ్లినా ఫలితం ప్రతికూలంగా వచ్చింది. అశ్విన్‌ (10), షమీ (2)లను అండర్సన్‌ పెవిలియన్‌ చేర్చాడు. అప్పటికి పరిస్థితి 182/8. ఈ లెక్కన చూస్తే ప్రత్యర్థికి భారీ ఆధిక్యమే దక్కేలా కనిపించింది. అయితే, ఇషాంత్‌ (5), ఉమేశ్‌ (1 నాటౌట్‌) సాయంతో కోహ్లి పోరాడాడు. ఈ క్రమంలో శతకం అందుకున్నాడు. అనంతరం సాధ్యమైనన్ని పరుగులు జోడించే ఉద్దేశంతో భారీ షాట్లు కొడుతూ తాడోపేడో అనేలా ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్లు చేసేదేమీ లేక అతడి ప్రతాపాన్ని చూస్తూ ఉండిపోయారు. ఆఖరికి రషీద్‌ బౌలింగ్‌లో బంతిని కట్‌ చేసేందుకు ప్రయత్నించి పాయింట్‌లో బ్రాడ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో అతడి అసాధారణ ఇన్నింగ్స్, భారత తొలి ఇన్నింగ్స్‌ ముగిశాయి. 21, 51 పరుగుల వద్ద కోహ్లి ఇచ్చిన క్యాచ్‌లను మలాన్‌ జారవిడవడం కూడా జట్టుకు కలిసొచ్చింది.

బ్రిటన్‌ను గెలిచాడు...
విరాట్‌ కోహ్లి మైదానంలోకి అడుగు పెట్టిన సమయంలో ప్రేక్షకులు అతడిని గేలి చేస్తూ స్వాగతించారు...కోహ్లి ఇన్నింగ్స్‌ ముగించి మైదానం వీడేటప్పుడు అదే జనం నిలబడి చప్పట్లతో అభినందిస్తూ ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’ ఇచ్చారు. భారత కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ గొప్పతనం చూపించేందుకు ఇది చాలు. నాలుగేళ్ల క్రితం 10 ఇన్నింగ్స్‌లలో 288 బంతులు ఎదుర్కొని 134 పరుగులు చేసిన కోహ్లి... ఇప్పుడు ఒక్క ఇన్నింగ్స్‌లో 225 బంతులు ఆడి 149 పరుగులతో లెక్క సరి చేశాడు. 2014 సిరీస్‌ జ్ఞాపకాలను, తనపై వచ్చిన విమర్శలను పాతాళంలోకి పాతి పెట్టాడు!  కోహ్లికి సెంచరీలు చేయడం కొత్త కాదు, రికార్డులు సృష్టించడమూ కొత్త కాదు. కానీ ఈ ఇన్నింగ్స్‌ ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌...ఇలా ఎక్కడైనా పరుగుల వరద పారించిన కోహ్లికి ఇంగ్లండ్‌లో మాత్రం బాకీ ఉండిపోయింది. ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో సహచరులెవరూ కనీస ప్రదర్శన చేయలేదు. నమ్ముకున్న బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమయ్యారు. ఈ స్థితిలో ఒంటరిగా పోరాడుతూ అతను చేసిన పరుగుల విలువ అమూల్యం. పాండ్యా ఆరో వికెట్‌గా వెనుదిరిగిన సమయంలో జట్టు స్కోరు 148 పరుగులు కాగా... కోహ్లి 47 వద్ద ఆడుతున్నాడు. గతంలో సచిన్‌ స్థాయి క్రికెటర్‌ కూడా టెయిలెండర్ల సహకారంతో సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్‌ చేసిన సందర్భాలు దాదాపుగా లేవు. కానీ కోహ్లి మాత్రం తనేంటో మళ్లీ చూపించాడు. ఇన్నింగ్స్‌ను పూర్తిగా అదుపులో పెట్టుకొని ముందు పరిస్థితికి తగినట్లుగా, ఆ తర్వాత ధాటిని పెంచుతూ అతను ఆడిన షాట్లు మరచిపోలేనివి. పాండ్యా వెనుదిరిగాక భారత్‌ ఖాతాలో చేరిన 126 పరుగుల్లో కోహ్లి చేసినవే 102 ఉన్నాయి. చివరి గంట పాటు కోహ్లిని ఎలా ఔట్‌ చేయాలో తెలీక ఇంగ్లండ్‌ పూర్తిగా చేతులెత్తేసింది. మ్యాచ్‌ తుది ఫలితం ఎలా ఉన్నా సిరీస్‌ మొత్తానికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని కోహ్లికి ఈ ఇన్నింగ్స్‌ పుష్కలంగా అందించింది. సెంచరీ సాధించాక భావోద్వేగాలను దాచుకోకుండా గర్జించిన తీరు అతని దృష్టిలో దీని విలువేమిటో చూపించింది.

అండర్సన్‌తో రసవత్తర పోరు: కోహ్లిని ఔట్‌ చేస్తేనే గానీ నేను ఇంటికి వెళ్లను అని ఒట్టు పెట్టుకున్నట్లుగా అండర్సన్‌ ఒక వైపు... ఏం చేసినా నీ బౌలింగ్‌లో మాత్రం ఔట్‌ కాననే పట్టుదల కనబర్చిన కోహ్లి మరో వైపు... వెరసి బర్మింగ్‌హామ్‌ టెస్టులో రెండో రోజు ఇద్దరు స్టార్‌ ఆటగాళ్ల మధ్య రసవత్తర పోరు సాగింది. ఈ క్రమంలో కోహ్లికి అదృష్ట దేవత కూడా తోడుగా వచ్చింది. 2014 సిరీస్‌లో కోహ్లిని నాలుగు సార్లు ఔట్‌ చేసిన అండర్సన్‌ ఇప్పుడు కూడా మళ్లీ అదే కోహ్లి వికెట్‌పై గురి పెట్టాడు. క్రికెట్‌ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఆ పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. చక్కటి బంతులతో పదే పదే కట్టడి చేశాక చివరకు 43 బంతులు వేసిన తర్వాత అండర్సన్‌కు కోహ్లిని ఔట్‌ చేసే అద్భుత అవకాశం వచ్చింది. 21 పరుగుల వద్ద ఆడుతున్న కోహ్లి ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను రెండో స్లిప్‌లో మలాన్‌ వదిలేయడంతో ఈ పోరు చాలించి అండర్సన్‌ తన స్పెల్‌ ముగించాడు. కోహ్లి రావడానికి ముందు వరుసగా 7 ఓవర్లు బౌలింగ్‌ చేసిన జిమ్మీ, ఆ తర్వాత కోహ్లిని పడగొట్టే ఆలోచనతో మరో 8 ఓవర్ల పాటు తన శక్తిని వెచ్చించాడు. మున్ముందు సుదీర్ఘ సిరీస్‌ గురించి ఆలోచించకుండా 36 ఏళ్ల వయసులో అతను తీవ్రంగా శ్రమించాడు. సుదీర్ఘ స్పెల్‌ నుంచి విరామం తీసుకున్న అనంతరం మరో 17 ఓవర్ల తర్వాత అండర్సన్‌ మళ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. మరో 7 ఓవర్ల పాటు పదే పదే కోహ్లిని ఇబ్బంది పెట్టగలిగినా... వికెట్‌ మాత్రం దక్కలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement