రహానే రాగం...మురళీ గానం... | India first innings 462/6 | Sakshi
Sakshi News home page

రహానే రాగం...మురళీ గానం...

Published Fri, Jun 12 2015 11:52 PM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

రహానే రాగం...మురళీ గానం...

రహానే రాగం...మురళీ గానం...

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462/6
♦ మూడో రోజు కూడా అడ్డుకున్న వరుణుడు
♦ బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు
♦ షకీబ్‌కు నాలుగు వికెట్లు
 
 స్లో వికెట్... విపరీతంగా టర్న్ అవుతున్న బంతి... ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని వాతావరణం... వెరసి బంగ్లాదేశ్‌తో టెస్టులో బ్యాట్స్‌మెన్‌కు ప్రతికూల పరిస్థితులు. అయినా భారత్ జోరు తగ్గలేదు. వేగంగా పరుగులు చేసి ఫలితం కోసం ప్రయత్నించాలనే తపనతో ఆడారు. ఓపెనర్ మురళీ విజయ్ తన నిలకడను అలాగే కొనసాగిస్తే... రహానే అద్భుతమైన ఇన్నింగ్స్‌తో వేగంగా పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ భారీస్కోరు సాధించింది.

 
 ఢాకా : బంగ్లాదేశ్ బేబీలపై భారత బ్యాట్స్‌మెన్ పరాక్రమం కొనసాగింది. తొలి రోజు ధావన్ చూపించిన దూకుడును విజయ్, రహానే కూడా అందిపుచ్చుకోవడంతో ఫతుల్లాలో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది. మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 103.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 462 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ (272 బంతుల్లో 150; 12 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ చేయగా... శిఖర్ ధావన్ (195 బంతుల్లో 173; 23 ఫోర్లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 23 పరుగులు జోడించి అవుటయ్యాడు.

ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 283 పరుగులు జోడించడం విశేషం. రోహిత్, కోహ్లి విఫలమైనా.... రహానే (103 బంతుల్లో 98; 14 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మురళీ విజయ్, రహానే నాలుగో వికె ట్‌కు 114 పరుగులు జోడించారు. సాహా విఫలం కాగా... హర్భజన్ 7, అశ్విన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్ నాలుగు వికెట్లు సాధించగా... జుబైర్ హొస్సేన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: మురళీ విజయ్ ఎల్బీడబ్ల్యు (బి) షకీబ్ 150; శిఖర్ ధావన్ (సి అండ్ బి) షకీబ్ 173; రోహిత్ శర్మ (బి) షకీబ్ 6; విరాట్ కోహ్లి (బి) జుబైర్ 14; రహానే (బి) షకీబ్ 98; సాహా (బి) జుబైర్ 6; అశ్విన్ బ్యాటింగ్ 2; హర్భజన్ బ్యాటింగ్ 7; ఎక్స్‌ట్రాలు (బైస్ 4, లెగ్‌బై 1, నోబాల్ 1) 6; మొత్తం (103.3 ఓవర్లలో ఆరు వికెట్లకు) 462
వికెట్ల పతనం: 1-283; 2-291; 3-310; 4-424; 5-445; 6-453.
బౌలింగ్: షాహిద్ 22-2-88-0; సౌమ్య సర్కార్ 3-0-11-0; షువగతా 14-0-52-0; షకీబ్ అల్ హసన్ 24.3-1-105-4; తైజుల్ ఇస్లామ్ 20-0-85-0; జుబైర్ 19-1-113-2; కైస్ 1-0-3-0.
 
 సెషన్ 1: మంచి భాగస్వామ్యం
 తొలి రోజు అద్భుతంగా ఆడిన భారత ఓపెనర్లు రెండో రోజు ఆట మొత్తం రద్దయినా మూడో రోజు ఏకాగ్రతతోనే ఆడారు. దాదాపు ఆరు ఓవర్ల పాటు సింగిల్స్, డబుల్స్‌కు పరిమితమయ్యారు. తైజుల్ బౌలింగ్‌లో బౌండరీతో మురళీ విజయ్ 201 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో విజయ్‌కిది ఆరో టెస్టు సెంచరీ. ఆటలో వేగం పెంచే ప్రయత్నంలో శిఖర్ ధావన్... షకీబ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

రాగానే మంచి బౌండరీతో టచ్‌లో కనిపించిన రోహిత్... షకీబ్ వేసిన చక్కటి బంతిని అంచనా వేయడంలో పొరబడి క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ కోహ్లి కూడా రెండు ఫోర్లు కొట్టినా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. జుబేర్ హొస్సేన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో భారత్ 27 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విజయ్‌తో జతకలిసిన రహానే చక్కగా ఆడాడు. షకీబ్ బౌలింగ్‌లో మూడు బంతుల వ్యవధిలో రెండు బౌండరీలతో తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు.

విజయ్ సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తే... రహానే అడపాదడపా బౌండరీలతో పరుగుల వేగం తగ్గకుండా చూశాడు. బంగ్లాదేశ్ కొత్త బంతి తీసుకున్నాక... షాహిద్ బౌలింగ్‌లో బౌండరీతో 64 బంతుల్లో రహానే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో వర్షం మొదలవడంతో లంచ్ విరామం ప్రకటించారు. మూడు వికెట్లు కోల్పోయినా... రహానే, విజయ్‌ల మంచి భాగస్వామ్యంతో భారత్ ఈ సెషన్‌ను సంతృప్తికరంగా ముగించింది.
    
 ఓవర్లు: 37; పరుగులు: 159; వికెట్లు: 3

 సెషన్ 2: పెరిగిన వేగం
 లంచ్ తర్వాత రహానే మరింత వేగంగా ఆడాడు. మరో ఎండ్‌లో విజయ్ 271 బంతుల్లో 150 మార్కును చేరుకున్నాడు. అయితే ఆ వెంటనే షకీబ్ బౌలింగ్‌లో ఎల్బీగా అవుటయ్యాడు. సాహా వెంటనే అవుటైనా రహానే మాత్రం బౌండరీలతో దూకుడు పెంచాడు. షకీబ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రహానే... ఆ తర్వాతి బంతిని కూడా షాట్ ఆడబోయి మిస్ అయి బౌల్డ్ అయ్యాడు. కేవలం రెండు పరుగుల తేడాతో రహానే సెంచరీని కోల్పోయాడు.
 ఓవర్లు: 10.3; పరుగులు: 64; వికెట్లు: 3
 
 సెషన్ 3: వర్షంతో రద్దు
 ఎడతెరపి లేని వర్షం కారణంగా సెషన్ రద్దయింది. సాయంత్రం గం.4.30 వరకు ఎదురుచూసిన తర్వాత రోజు ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement