ఇక కష్టమే! | India look down the barrel after another top-order flop show | Sakshi
Sakshi News home page

ఇక కష్టమే!

Published Mon, Feb 24 2020 4:03 AM | Last Updated on Mon, Feb 24 2020 4:54 AM

India look down the barrel after another top-order flop show - Sakshi

పృథ్వీ, మయాంక్‌, పుజారా, కోహ్లి

వెల్లింగ్టన్‌ టెస్టులో భారత్‌ ప్రదర్శన వెలవెలబోతోంది. చూస్తుంటే ‘వన్డే’ పరిస్థితే ప్రతి రోజూ కనిపిస్తోంది. ఏ రోజుకు ఆ రోజు టీమిండియా తడబడుతూనే ఉంది. గత మూడు రోజుల్లో రెండు సార్లు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇంకా ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరునే చేరలేకపోయింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో అప్పుడే నాలుగు టాపార్డర్‌ వికెట్లను కోల్పోయి కష్టాల మీద కష్టాలు తెచ్చిపెట్టుకుంది. ఇప్పుడైతే ఈ మ్యాచ్‌ను గెలుచుకోవడం పక్కనబెట్టి ‘డ్రా’తో కాపాడుకోలేని స్థితికి దిగజారింది.   

వెల్లింగ్టన్‌: మన ‘టాప్‌’ మళ్లీ కూలింది. కివీస్‌ పేసర్‌ బౌల్ట్‌ నిప్పులకు భారత బ్యాటింగ్‌ చెదిరింది.  దీంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ యేటికి ఎదురీదలేని పరిస్థితిల్లోకి దిగజారింది. వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన న్యూజిలాండ్‌ అదే జోరుతో టెస్టు సిరీస్‌లోనూ చెలరేగుతోంది. ఇప్పటిదాకా జరిగిన మూడు రోజుల ఆటనూ ఆతిథ్య జట్టే శాసించింది. తొలి టెస్టును గెలిచేందుకు పట్టుబిగిస్తోంది. భారత్‌ మాత్రం అటు బ్యాటింగ్‌లో... ఇటు బౌలింగ్‌లో ఎప్పటికప్పుడు నీరుగారిపోతోంది. ఇక కష్టం! గెలుపు కాదు... ‘డ్రా’ కూడా కష్టమే!

టూకీగా చెప్పాలంటే...
మూడో రోజు కూడా భారత్‌కు క్లిష్టంగానే గడిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 216/5తో ఆదివారం ఆట కొనసాగించిన న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 100.2 ఓవర్లలో 348 పరుగులు చేసి ఆలౌటైంది. మిగిలిన ఐదు వికెట్లతోనే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ (165 పరుగులు)లో చేసిన స్కోరు కంటే ఎక్కువే (183 పరుగులు) చేసింది. తర్వాత భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఇంకా 39 పరుగులు వెనుకబడే ఉన్న         భారత్‌ ప్రధాన వికెట్లను కోల్పోయింది. కోహ్లి (19), పుజారా (11), పృథ్వీ షా (14)లను బౌల్ట్‌ అవుట్‌ చేశాడు. మయాంక్‌ అగర్వాల్‌ అర్ధ సెంచరీతో రాణించాడు.

టెయిలెండర్ల పోరాటం...
ఆట మొదలైన బంతికే న్యూజిలాండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. వాట్లింగ్‌ (14)ను బుమ్రా అవుట్‌ చేశాడు. మరో 9 పరుగుల తర్వాత సౌతీ (6) వికెట్‌ను ఇషాంత్‌ శర్మ పడేశాడు. కివీస్‌ స్కోరు 225/7. ఇక భారత్‌ పేస్‌ అలజడి మొదలైందని అనుకున్నారంతా! టెయిలెండర్లను అవుట్‌ చేయడం ఎంతసేపు... 250, 260 స్కోరుతో కివీస్‌ కథ ముగుస్తుందనిపించింది. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. మరో వికెట్‌ తీసేందుకు సుదీర్ఘ పోరాటం తప్పలేదు. గ్రాండ్‌హోమ్‌ (74 బంతుల్లో 43; 5 ఫోర్లు)తో జతకలిసిన తొమ్మిదో వరుస బ్యాట్స్‌మన్‌ జేమీసన్‌ (45 బంతుల్లో 44; 1 ఫోర్, 4 సిక్స్‌లు) చకచకా పరుగులు బాదేశాడు.

వన్డేను తలపించేలా జేమీసన్‌      భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. షమీ బౌలింగ్‌లో 2, అశ్విన్‌ ఒకే ఓవర్లో మరో రెండు సిక్సర్లు దంచేశాడు. చూస్తుండగానే స్కోరు దూసుకెళ్లింది. ఎట్టకేలకు 300 స్కోరుకు ముందు జేమీసన్‌ను, 300 అయ్యాక గ్రాండ్‌హోమ్‌ను అశ్వినే పెవిలియన్‌ చేర్చాడు. 9 వికెట్లు పడ్డా కూడా ఆలౌట్‌ అయ్యేందుకు మరో 38 పరుగులు ఆగాల్సి     వచ్చింది. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బౌల్ట్‌ (24 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్‌) బౌండరీలతో హోరెత్తించాడు. చివరకు ఇషాంత్‌ అతన్ని అవుట్‌ చేయడంతో కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 348 పరుగుల వద్ద ముగిసింది. ఇషాంత్‌కు 5, అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి.

మయాంక్‌ ఒక్కడే...
లంచ్‌ తర్వాత 183 పరుగుల లోటుతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ కష్టాలతో మొదలైంది. 8వ ఓవర్లో పృథ్వీ షా (14)ను బౌల్ట్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో మయాంక్‌ అగర్వాల్‌కు పుజారా జతయ్యాడు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ వికెట్లు కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. కొంతవరకు ఇది ఫలించినా... రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించాక జిడ్డుగా ఆడుతున్న పుజారాను బౌల్టే క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 78 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోగా... ఓపెనర్‌కు కెప్టెన్‌ కోహ్లి అండగా నిలిచాడు. చక్కగా ఆడుతున్న మయాంక్‌ 75 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.

కానీ జట్టు స్కోరు వంద పరుగులకు ముందే అతని వికెట్‌ కూడా పడిపోవడం భారత్‌ కష్టాల్ని ఒక్కసారిగా పెంచింది. ఆఖరి సెషన్‌ మొదలైన కాసేపటికి సౌతీ బౌలింగ్‌లో మయాంక్‌ వెనుదిరిగాడు. 96 పరుగులకే భారత్‌ మూ డు కీలక వికెట్లను కోల్పోయింది. ఇది చాలదన్నట్లు బౌల్ట్‌... కోహ్లి (19; 3 ఫోర్లు) వికెట్‌ పడగొట్టి భారత్‌ను చావుదెబ్బ తీశాడు. దీంతో ఈ సెషన్లో మరో వికెట్‌ పడకుండా రహానే (67 బంతుల్లో 25 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), హనుమ విహారి (70 బంతుల్లో 15 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) జాగ్రత్తగా ఆడారు. అబేధ్యమైన ఐదో వికెట్‌కు వీరిద్దరు 31 పరుగులు జోడించారు.  

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 165; న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (సి) పంత్‌ (బి) ఇషాంత్‌ 11; బ్లన్‌డేల్‌ (బి) ఇషాంత్‌ 30; విలియమ్సన్‌ (సి) సబ్‌–జడేజా (బి) షమీ 89; రాస్‌ టేలర్‌ (సి) పుజారా (బి) ఇషాంత్‌ 44; నికోల్స్‌ (సి) కోహ్లి (బి) అశ్విన్‌ 17; వాట్లింగ్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 14; గ్రాండ్‌హోమ్‌ (సి) పంత్‌ (బి) అశ్విన్‌ 43; సౌతీ (సి) షమీ (బి) ఇషాంత్‌ 6; జేమీసన్‌ (సి) విహారి (బి) అశ్విన్‌ 44; ఎజాజ్‌ పటేల్‌ (నాటౌట్‌) 4; బౌల్ట్‌ (సి) పంత్‌ (బి) ఇషాంత్‌ 38; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (100.2 ఓవర్లలో ఆలౌట్‌) 348.

వికెట్ల పతనం: 1–26, 2–73, 3–166, 4–185, 5–207, 6–216, 7–225, 8–296, 9–310, 10–348.

బౌలింగ్‌: బుమ్రా 26–5–88–1, ఇషాంత్‌ శర్మ 22.2–6–68–5, షమీ 23–2–91–1, అశ్విన్‌ 29–1–99–3.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) లాథమ్‌ (బి) బౌల్ట్‌ 14; మయాంక్‌ (సి) వాట్లింగ్‌ (బి) సౌతీ 58; పుజారా (బి) బౌల్ట్‌ 11; కోహ్లి (సి) వాట్లింగ్‌ (బి) బౌల్ట్‌ 19; రహానే (బ్యాటింగ్‌) 25; విహారి (బ్యాటింగ్‌) 15; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (65 ఓవర్లలో 4 వికెట్లకు) 144.

వికెట్ల పతనం: 1–27, 2–78, 3–96, 4–113.

బౌలింగ్‌: సౌతీ 15–5–41–1, బౌల్ట్‌ 16–6–27–3, గ్రాండ్‌హోమ్‌ 14–5–25–0, జేమీసన్‌ 17–7–33–0, ఎజాజ్‌ పటేల్‌ 3–0–18–0.  
 

బౌల్ట్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement