
నాలుగో వన్డేలో భారత్ ఓటమి
రాంచీ: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ నెగ్గి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావించిన భారత్‌కు న్యూజిలాండ్ అడ్డుకట్టవేసింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ 2-2తో రసవత్తరంగా మారింది. న్యూజిలాండ్ విధించిన 261 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. విరాట్ కోహ్లీ(45), రహానే(57), అక్షర్ పటేల్(38) మాత్రమే రాణించగా రోహిత్ శర్మ(11), ఎంఎస్ ధోనీ(11), మనీశ్ పాండే(12) విఫలమయ్యారు. ఓ దశలో 25 ఓవర్లలో 122/2 గా ఉన్న భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో.. 48.2 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. చివర్లో దవల్ కులకర్ణి(25) పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీకి 3, బోల్ట్, నిషామ్‌లకు రెండేసి చొప్పున వికెట్లు దక్కాయి.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్ కు 15.3 ఓవర్లలో 96 పరుగులు చేసిన తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్ లో రహానేకు క్యాచ్ ఇచ్చి లాథమ్(39) ఔటయ్యాడు. మరో ఓపెనర్ గప్టిల్ హాఫ్ సెంచరీ (72, 11 ఫోర్లు)తో చెలరేగగా.. కెప్టెన్ విలియమ్సన్ 41 పరుగులు చేశాడు. 35 ఓవర్లలో 184/2తో పటిస్ట స్థితిలో ఉన్న కివీస్ ను టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా దెబ్బతీశాడు. రెండు వరుస ఓవర్లలో విలియమ్సన్, నీషమ్(6)ను ఔట్ చేసి పరుగుల వేగాన్ని తగ్గించాడు. ఆ తర్వాత రాస్ టేలర్ (34) పరవాలేదనిపించాడు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్, కులకర్ణి, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. చివరి వన్డే శనివారం విశాఖలో జరగనుంది.