కూలిడ్జ్ (ఆంటిగ్వా): స్పెషలిస్ట్ ఆటగాళ్ల చేరికతో కరీబియన్ పర్యటనలో టీమిండియా టెస్టు సమరానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా శనివారం నుంచి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఎలెవెన్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో భారత జట్టులో లేని బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, పేసర్లు ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు సంప్రదాయ ఫార్మాట్‌కు సమాయత్తం అయ్యే ప్రయత్నం చేయనున్నారు.
నెల రోజుల విశ్రాంతి అనంతరం ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తాజాగా మైదానంలో దిగనున్నాడు. బుధవారం జరిగిన మూడో వన్డేలో కుడి చేతి బొటన వేలికి గాయం కావడంతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి బరిలోకి దిగకపోవచ్చని తెలుస్తోంది. ఇది అధికారిక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ కాకపోవడంతో టీమిండియా తరఫున బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరూ మైదానంలో కాసేపు గడిపే వీలుంది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పుజారా ఎనిమిది నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నాడు. దేశవాళీ జట్టు సౌరాష్ట్ర తరఫున ఫిబ్రవరి మొదటివారంలో రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడిన అనంతరం అతడు మార్చిలో ముస్తాక్ అలీ టి20 టోర్నీలో పాల్గొన్నాడు.
టెస్టు జట్టు వైస్ కెప్టెన్ హోదాలో ఉన్నప్పటికీ కొంతకాలంగా తనదైన ఇన్నింగ్స్ ఆడలేకపోతున్న రహానేకు ఇప్పుడు అసలైన పరీక్షా కాలం నడుస్తోంది. ఇంగ్లిష్ కౌంటీల్లోనూ అతడు పెద్దగా రాణించలేకపోయాడు. ఏడు మ్యాచ్‌ల్లో 307 పరుగులే చేశాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌కు రహానేనే సారథ్యం వహించనున్నాడు. సాహా అందుబాటులోకి వచ్చినందున తొలి టెస్టులో చోటు దక్కాలంటే పంత్ మెరుగైన కీపింగ్ లక్షణాలు కనబర్చాల్సి ఉంటుంది. హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ ఆటపైనా ఆసక్తి నెలకొంది. ప్రథమ ప్రాధాన్య ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌లకే అవకాశం ఉన్నా... విహారి నుంచి వీరిద్దరిలో ఒకరికి పోటీ ఉంది. పేస్‌తో ఉమేశ్, ఇషాంత్, స్పిన్‌తో అశ్విన్, జడేజా టీం మేనేజ్‌మెంట్‌ను మెప్పించేందుకు ప్రయత్నించవచ్చు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్–వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది.
కోహ్లి లేకుండా ప్రాక్టీసుకు...
Published Sat, Aug 17 2019 4:35 AM | Last Updated on Sat, Aug 17 2019 12:09 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment