320 పరుగులతో వరల్డ్ రికార్డు..
పోచెస్ట్రూమ్: గతవారం భారత మహిళా ప్రధాన పేసర్ జులన్ గోస్వామి(181) వన్డేల్లో అత్యధిక వికెట్ల ఘనతను సొంతం చేసుకోగా, తాజాగా భారత మహిళా ఓపెనర్లు దీప్తి శర్మ, పూనమ్ రౌత్ లు సరికొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పారు. వన్డే క్రికెట్ లో తొలి వికెట్ కు 320 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు ఈ జోడి.
క్వాడ్రాంగులర్ సిరీస్ లో భాగంగా సోమవారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత ఓపెనింగ్ జోడి ఈ ఘనతను కైవసం చేసుకుంది. ప్రపంచ రికార్డును నెలకొల్సే క్రమంలో దీప్తి శర్మ(188;160బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్సర్లు), పూనమ్ రౌత్(109;116 బంతుల్లో 11 ఫోర్లు) లు విశేషంగా రాణించి దాదాపు 9 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. 2008లో లార్డ్స్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ జోడి ఎస్ జే టేలర్, సీఎంజీ అటికిన్స్లు 268 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని సాధించారు. మహిళల వన్డే క్రికెట్ లో ఇదే ఇప్పటివరకూ అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యం. తాజాగా ఆ రికార్డును భారత జోడి అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో భారత మహిళలు 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 358 భారీ పరుగులు చేశారు. ఈ క్రమంలోనే 320 పరుగుల భాగస్వామ్యాన్ని భారత ఓపెనింగ్ జోడి సాధించింది. ఓవరాల్ గా చూస్తే వన్డే క్రికెట్ లో ఇదే అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యం కావడం మరో విశేషం. పురుషుల క్రికెట్ లో అత్యధిక పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం 286 పరుగులు. 2006లో శ్రీలంక ఆటగాళ్లు ఉపుల్ తరంగా-జయసూర్యలు ఈ ఘనతను సాధించారు.