దిద్దు‘బాట’లో బీసీసీఐ
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాభవం... భారత జట్టు ప్రదర్శనపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు... కోచ్ ఫ్లెచర్‌పై వేటు వేయాలని, ధోనీని టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్లు... వెరసి ఉక్కిరిబిక్కిరవుతున్న బీసీసీఐ ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. చీఫ్ కోచ్ డంకన్ ఫ్లెచర్‌ను పొమ్మనలేక పొగబెట్టింది. ఆయన అధికారాలపై కోత విధించి ఉద్వాసన పలికినంత పనిచేసింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రిని భారత జట్టుకు డెరైక్టర్‌గా నియమించింది. అలాగే బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లను ఈ సిరీస్‌కు తప్పించింది.
భారత జట్టు డెరైక్టర్‌గా రవిశాస్త్రి
►ఫ్లెచర్ అధికారాలకు కత్తెర
►ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్. శ్రీధర్
►సహాయక కోచ్‌లుగా బంగర్, అరుణ్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ధోనీసేన దారుణ వైఫల్యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కాస్త ఆలస్యంగానైనా స్పందించింది. వన్డే సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుంది. కోచ్‌గా ఫ్లెచర్ అధికారాలను కత్తిరిస్తూ మాజీ కెప్టెన్ రవిశాస్త్రిని భారత జట్టుకు డెరైక్టర్‌గా నియమించింది. బౌలింగ్ కోచ్ జో డేవిస్, ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్నీలకు విరామమిస్తూ వీరి స్థానంలో భారత మాజీ ఆటగాళ్లు సంజయ్ బంగర్, భరత్ అరుణ్‌లను సహాయ కోచ్‌లుగా ఎంపిక చేసింది. ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాద్ రంజీ మాజీ క్రికెటర్ ఆర్. శ్రీధర్‌ను నియమించింది. జట్టు మేనేజ్‌మెంట్‌లో చేపట్టిన ఈ ప్రక్షాళన తక్షణమే అమల్లోకి వచ్చింది. టీమిండియా చీఫ్ కోచ్‌గా ఫ్లెచర్ కొనసాగనున్నా ఇకపై ఆయన పాత్ర నామమాత్రమే. ఈ నెల 25 నుంచి మొదలయ్యే ఐదు వన్డేల సిరీస్‌కు భారత జట్టు సాధన రవిశాస్త్రి ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది.
రవిశాస్త్రి మరోసారి
దిద్దుబాటు చర్యల్లో భాగంగా భారత జట్టుకు డెరైక్టర్‌గా కానీ, క్రికెట్ మేనేజర్‌గా కానీ ఎంపికవడం రవిశాస్త్రికిది రెండోసారి. 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి దశలోనే ఇంటిదారి పట్టిన తర్వాత అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్‌పై వేటు పడింది. ప్రపంచకప్ తర్వాత పాల్గొన్న బంగ్లా పర్యటనలో భారత జట్టుకు క్రికెట్ మేనేజర్‌గా శాస్త్రిని నియమించారు. ఇప్పుడు ధోని సేన వైఫల్యాల నేపథ్యంలో క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఇంగ్లండ్‌లోనే ఉన్న రవిశాస్త్రితో బీసీసీఐ పెద్దలు గత రెండు వారాలుగా సంప్రదింపులు జరిపారు.
క్లిష్ట సమయంలో డెరైక్టర్‌గా కొనసాగేందుకు రవిశాస్త్రి అంగీకరించడంతో కెప్టెన్ ధోని, కోచ్ ఫ్లెచర్‌లను సంప్రదించిన తర్వాత జట్టు మేనేజ్‌మెంట్‌ను ప్రక్షాళన చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరించనున్న సంజయ్ బం గర్, భరత్ అరుణ్‌లు భారత మాజీ ఆటగాళ్లు. ఆల్‌రౌండర్‌గా సంజయ్ బంగర్ అందరికీ సుపరిచితమే. ఐపీఎల్-7లో అతను పంజాబ్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు.
ఫ్లెచర్‌పై వేటు తప్పదు!
భారత క్రికెట్ జట్టుకు డెరైక్టర్‌గా రవిశాస్త్రి నియమించడంతో చీఫ్ కోచ్ డంకన్ ఫ్లెచర్‌పై ఇక వేటు దాదాపుగా ఖాయంగానే కనిపిస్తోంది. శాస్త్రి నియామకం ఒక రకంగా ఫ్లెచర్‌కు పొమ్మనలేక పొగబెట్టినట్లే. నిజానికి 2015 వన్డే ప్రపంచకప్ వరకు ఫ్లెచర్‌తో బీసీసీఐ ఒప్పందం చేసుకుంది. కానీ ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే ఈ విదేశీ కోచ్‌ను సాగనంపనున్నట్లు తెలుస్తోంది.
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో కోచ్‌గా ఫ్లెచర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగే అవకాశాలు లేవని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. అతని అధికారాలకు కోత విధించడంలో బీసీసీఐ ఉద్దేశం కూడా అదే. ఒకవేళ ఫ్లెచర్ ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత తన పదవికి రాజీనామా చేసినా బీసీసీఐ ఆపబోదని బోర్డు వర్గాల సమాచారం.