
పసిడి ‘పట్టు’
మెరిసిన భారత రెజ్లర్లు
ఒకే రోజు మూడు స్వర్ణాలు, రజతం
అలరించిన సుశీల్ కుమార్
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమైన తర్వాత ఆరో రోజు ఎవరూ ఊహించని విధంగా భారత క్రీడాకారులు పసిడి పంట పండించారు. రెజ్లర్లు తమ పట్టు ప్రదర్శించి ఒకే రోజు మూడు స్వర్ణాలతోపాటు రజత పతకం సొంతం చేసుకున్నారు. మరోవైపు షూటర్లు కూడా రాణించడంతో... మంగళవారం ఒక్కరోజే భారత్‌కు తొమ్మిది పతకాలు వచ్చాయి.
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో ఆరో రోజును స్వర్ణం లేకుండానే ముగిస్తామా అని అనుకుంటున్న తరుణంలో... భారత రెజ్లర్లు తమ ఉడుంపట్టును ప్రదర్శించారు. ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చలాయించి మూడు స్వర్ణాలతోపాటు రజత పతకం గెల్చుకున్నారు. మంగళవారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్ (74 కేజీలు), అమిత్ కుమార్ దహియా (57 కేజీలు)... మహిళల విభాగంలో వినేశ్ ఫోగట్ (48 కేజీలు) పసిడి పతకాలు సంపాదించగా... పురుషుల 125 కేజీల విభాగంలో రాజీవ్ తోమర్ రజత పతకంతో సంతృప్తి పడ్డాడు.
107 సెకన్లలోనే...
కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి 74 కేజీల విభాగంలో పోటీపడిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఎలాంటి పోటీనే ఎదురుకాలేదు. ఫైనల్లో సుశీల్ కేవలం 107 సెకన్లలో తన ప్రత్యర్థి ఖమర్ అబ్బాస్ (పాకిస్థాన్)ను చిత్తు చేశాడు. సుశీల్ 6-2తో ఆధిక్యంలో ఉన్న దశలో అబ్బాస్ భుజాన్ని కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు అట్టిపెట్టడంతో రిఫరీ పోటీని నిలిపివేసి ‘బై ఫాల్’ పద్ధతిలో సుశీల్‌ను విజేతగా ప్రకటించారు.
అంతకుముందు తొలి రౌండ్‌లో సుశీల్ 11-1తో లారెన్స్ (ఆస్ట్రేలియా)పై; క్వార్టర్ ఫైనల్లో 10-0తో కుశాన్ సంద్రాగె (శ్రీలంక)పై; సెమీఫైనల్లో 8-4తో మెల్విన్ బిబో (నైజీరియా)పై గెలిచాడు. 57 కేజీల ఫైనల్లో అమిత్ కుమార్ 6-2 పాయింట్ల తేడాతో వెల్సన్ (నైజీరియా)ను ఓడించగా... మహిళల 48 కేజీ ఫైనల్లో వినేశ్ 11-8 పాయింట్ల తేడాతో యానా రటిగన్ (ఇంగ్లండ్)పై అద్భుత విజయం సాధించింది. ఇక పురుషుల 125 కేజీల ఫైనల్లో రాజీవ్ తోమర్ (భారత్) 0-3 పాయింట్లతో కోరె జార్విస్ (కెనడా) చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నాడు.