ఫైనల్కు చేరిన ధోని సేన
మిర్పూర్: ఆసియాకప్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా అందుకు తగ్గట్టుగానే రాణిస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా సమష్టి పోరాటంతో చెలరేగిపోతూ వరుస విజయాల్ని నమోదు చేస్తోంది. మంగళవారం శ్రీలంకతో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్లో ధోని సేన ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 'హ్యట్రిక్' గెలుపును సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లి(56నాటౌట్; 47 బంతుల్లో 7 ఫోర్లు), యువరాజ్ సింగ్ (35; 18 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లు) రాణించి టీమిండియా విజయంలో ముఖ్య భూమిక పోషించారు. తద్వారా ఈ టోర్నీలో ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.
శ్రీలంక నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆదిలో తడబడింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(1), రోహిత్ శర్మ(15) లు కులశేఖర బౌలింగ్లో అవుట్ కావడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. కాగా, విరాట్ కోహ్లి, సురేష్ రైనాలు సమయోచితంగా బ్యాటింగ్ చేసి జట్టు స్కోరును ముందుకు తీసుకువెళ్లారు. ఈ జోడి 53 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని సాధించడంతో టీమిండియా పుంజుకుంది. అయితే జట్టు స్కోరు 70 పరుగుల వద్ద ఉండగా రైనా(25) మూడో వికెట్ గా అవుటయ్యాడు.ఆ తరుణంలో ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన యువరాజ్ సింగ్ ఆకట్టుకున్నాడు. శ్రీలంక బౌలర్లు వేసిన చెత్త బంతులను బౌండరీలు దాటించి తన సహజసిద్ధమైన ఆటను ప్రదర్శించాడు. భారత్ విజయానికి మరో 18 పరుగులు చేయాల్సిన తరుణంలో యువీ భారీ షాట్కు యత్నించి నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత హార్దిక్ పాండ్యా(2) వెంటనే పెవిలియన్ చేరి నిరాశపరిచినా, మిగతా పనిని విరాట్ కోహ్లి, కెప్టెన్ మహేంద్ర సింగ్(7 నాటౌట్)లు పూర్తి చేయడంతో భారత్ ఐదు వికెట్లు కోల్పోయి ఇంకా నాలుగు బంతులుండగానే విజయం సాధించింది. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ లభించింది. శ్రీలంక బౌలర్లలో కులశేఖర రెండు వికెట్లు సాధించగా, పెరీరా, షనకాలు తలో వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 138 పరుగులు చేశారు. జట్టు స్కోరు ఆరు పరుగుల వద్ద చండిమాల్(4) తొలి వికెట్ గా పెవిలియన్కు చేరగా, 15 పరుగుల వద్ద జయసూరియా(3) రెండో వికెట్ గా అవుటయ్యాడు.అనంతరం దిల్షాన్(18), మాథ్యూస్(18)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో శ్రీలంక 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత కపుగదెరా(30), సిరివర్దనే(22) మోస్తరుగా రాణించి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. ఆపై శ్రీలంక మరోసారి తడబడినా పెరీరా(17), కులశేఖర(13 ) సమయోచితంగా ఆడటంతో లంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 138 పరుగులను చేసింది. భారత బౌలర్లలో బూమ్రా, పాండ్యా, అశ్విన్లు తలో రెండు వికెట్లు సాధించగా, నెహ్రాకు ఒక వికెట్ దక్కింది.
మ్యాచ్ విశేషాలు..
ట్వంటీ 20ల్లో శ్రీలంకపై విరాట్కు ఇది మూడో హాఫ్ సెంచరీ
ట్వంటీ 20ల్లో తొలుత బ్యాటింగ్ చేసి మొదటి 10 ఓవర్లలో శ్రీలంక(47) రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. అంతకుముందు 2007లో సౌతాఫ్రికాపై లంక చేసిన 43 పరుగులు తొలి అత్యల్ప స్కోరు
భారత్ పై తాజాగా ఇన్నింగ్స్ తో కలుపుకుని ఈ ఏడాది దిల్షాన్ ట్వంటీ 20 యావరేజ్ 12.28 గా ఉంది.
టీమిండియా ఆడిన గత నాలుగు ట్వంటీ 20లకు గాను మూడింట టాస్ గెలవడం విశేషం.