
సాక్షి, విశాఖపట్నం: న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న అనధికారిక ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ‘ఎ’ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో భారత్ ‘ఎ’ 64 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ సిరీస్‌లో చివరిదైన ఐదో వన్డే ఆదివారం జరుగుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 289 పరుగులు చేసింది. ఓపెనర్ ఈశ్వరన్ (83; 7 ఫోర్లు), విజయ్ శంకర్ (61; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), దీపక్ హుడా (59; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ‘ఎ’ 45.1 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. సిద్ధార్థ్ కౌల్ (3/25) ఆరంభంలోనే కివీస్‌ను దెబ్బతీయగా...షాబాజ్ నదీమ్ (4/33) మాయాజాలానికి మిడిలార్డర్ నిలబడలేకపోయింది. ఓపెనర్ వర్కర్ (108; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించినప్పటికీ అతనికి సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో కివీస్ ‘ఎ’ ఓటమి ఖాయమైంది.
Comments
Please login to add a commentAdd a comment