సాక్షి, విశాఖపట్నం : వెస్టిండీస్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి (157: 129 బంతులు, 13 ఫోర్లు, 4 సిక్స్‌లు, నాటౌట్) మరోసారి శతక్కొట్టాడు. కోహ్లికి తోడుగా రాయుడు(73) రఫ్పాడించడంతో విండీస్‌కు 322 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో శతకంతో ఆకట్టుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ(4) ఈ సారి తీవ్రంగా నిరాశ పరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి మరో ఓపెనర్ ధావన్‌తో కలిసి ఆచితూచి ఆడేప్రయత్నం చేశాడు. కానీ ధావన్ సైతం (29) పెవిలియన్ చేరడంతో భారత్ 10ఓవర్లకు రెండు వికెట్ల నష్టపోయి 49 పరుగుల మాత్రమే చేయగలిగింది.
రఫ్ఫాడించిన రాయుడు..
మిడిలార్డర్ ప్రయోగంలో భాగంగా నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాయుడు తన బాధ్యతను నిర్వర్తించాడు. నాలుగోస్థానానికి తను సరిగ్గా సరిపోతానని నిరూపించుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఆచితూచి ఆడుతూ.. కెప్టెన్ కోహ్లికి అండగా నిలిచాడు. ఈ ఇద్దరు నెమ్మదిగా ఆడుతూ అవకాశం చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో తొలుత 56 బంతుల్లో 5 ఫోర్లతో కెప్టెన్ కోహ్లి హాఫ్ సెంచరీ సాధించగా.. ఆ వెంటనే రాయుడు సైతం 61 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే రాయుడు(73)ని అశ్లేనర్స్ క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 139 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
విరాట్ పర్వం మొదలు..
రాయుడు వికెట్ అనంతరం విరాట్ రికార్డుల పర్వం మొదలైంది. క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి కోహ్లి చెలరేగాడు. తొలుత 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. అయితే మరికాసేపటికే భారత్ ధోని (20) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్ దాటిగా ఆడే ప్రయంత్నం చేశాడు. కానీ వికెట్ల ముందు దొరికి పంత్(17) పెవిలియన్ చేరాడు. వరుసగా వికెట్లు కోల్పోతున్న కోహ్లి మాత్రం తన ఆటలో వేగాన్ని తగ్గించలేదు. ఈ క్రమంలో 106 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్‌లో 37వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అనంతరం మరింత రెచ్చిపోయాడు. అచ్చొచ్చిన మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 27 బంతుల్లోనే మరో 50 పరుగులు పూర్తి చేశాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో అశ్లేనర్స్, ఒబెడ్‌లకు రెండు వికెట్లు దక్కగా రోచ్, సామ్యూల్స్‌లకు తలా వికెట్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment