మూడో టెస్టు: లంకకు భారీ లక్ష్యం
కొలంబో: శ్రీలంకతో కీలక మూడో టెస్టులో టీమిండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లంక ముందు 386 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్లో భారత్కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 21/3 ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ నాలుగో రోజు సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 274 పరుగులకు ఆలౌటైంది.
భారత్ రెండో ఇన్నింగ్స్లో టాపార్డర్ విఫలమైనా ఇతర బ్యాట్స్మెన్ సమష్టిగా రాణించి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించారు. రోహిత్ శర్మ (50), అశ్విన్ (58) హాఫ్ సెంచరీలతో రాణించడంతో పాటు బిన్ని 49, అమిత్ మిశ్రా 39, నమన్ ఓజా 35 పరుగులు చేశారు. లంక బౌలర్లు దమ్మిక ప్రసాద్, ప్రదీప్ నాలుగేసి వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ల్లో భారత్ 312 పరుగులు చేయగా, లంక 201 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.